హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): రెండుసార్లు కలిసొచ్చిన హుస్నాబాద్ నుంచే ఈసారి కూడా బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సమరశంఖం పూరించనున్నా రు. తెలంగాణ అసెంబ్లీకి తొలిసారిగా 2014 లో జరిగిన ఎన్నికల ప్రచారాన్ని కేసీఆర్ హుస్నాబాద్ నుంచే ప్రారంభించారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ 63 స్థానాల్లో విజయం సాధించడంతో కేసీఆర్ ముఖ్యమంత్రిగా పాలనాపగ్గాలు స్వీకరించారు. ఆ తరువాత 2018 సెప్టెంబర్ 6న అసెంబ్లీని రద్దు చేసిన మరుసటి రోజే (సెప్టెంబర్ 7) హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఎన్నికల శంఖారావం పూరించారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ 88 స్థానాలతో జైత్రయాత్ర కొనసాగించి, వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. వందకుపైగా సీట్లతో హ్యాట్రిక్ విజయంపై గురి పెట్టిన సీఎం కేసీఆర్ ఈసారి కూడా హుస్నాబాద్ నుంచే సమరశంఖం పూరిస్తుండటం విశేషం. ఈ నెల 15న మధ్యాహ్న 3 గంటలకు హుస్నాబాద్ నుంచే సమరశంఖం పూరించనున్న నేపథ్యంలో మరోసారి ఈ నియోజకవర్గం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నది.
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మూడోసారి హుస్నాబాద్ నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించడం తమకు గొప్ప అవకాశమని, కెప్టెన్ లక్ష్మీకాంతరావు కుమారడు, ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ సంతోషం వ్యక్తంచేశారు. ఉద్యమాల పోరుగడ్డ హుస్నాబాద్ చారిత్రక వారసత్వంలో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధించబోయే అపూర్వ సన్నివేశానికి తమ నియోజకవర్గం వేదిక కావడం తమకు దక్కిన గొప్ప వరం అని తెలిపారు.