హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): ‘కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయబద్దమైన నీటి వాటాపై నేను త్వరలోనే స్పందిస్త.. ప్రజల ముందు వాస్తవాలను పెడుత’ అని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. స్వల్ప అస్వస్థతతో సోమాజిగూడ యశోద హాస్పిటల్లో చేరిన కేసీఆర్ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. శుక్రవారం తనను కలిసేందుకు వచ్చిన పార్టీ ముఖ్యనేతలతో మాట్లాడారు. ఉదయం, సాయంత్రం పార్టీ నేతలతో ముచ్చటించారు. దవాఖానలో ఉన్నా తనను కలవడానికి వచ్చిన నేతలతో రాష్ట్ర ప్రజలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలపైనే ఆయన చర్చించడం గమనార్హం. ముఖ్యంగా రైతుల గురించి ఎక్కువ సమయం నేతలతో మాట్లాడారు.
పంటలెట్ల ఉన్నయి? వానలు పడుతున్నయా?
పలకరించేందుకు వచ్చిన నేతలతో కేసీఆర్ మాట్లాడుతూ ‘రాష్ట్రంలో పంటలెట్ల ఉన్నయి? వానలు పడుతున్నాయా? నీళ్లు అందుతున్నాయా?’ అంటూ విచారించారు. యూరియా అందడం లేదని చాలాచోట్ల రైతులు చెప్తున్నారని పలువురు నేతలు కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. అనేక ప్రాంతాల్లో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం దాదాపు చేతులెత్తేసిందని నేతలు తమ తమ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితుల గురించి చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ఏనాడూ ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి రాలేదని రైతులే చెప్తున్నారని, ఈసారి విత్తనాలు, ఎరువుల కొరత తీవ్రంగా ఉన్నదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నదని కొంత మంది నేతలు చెప్పారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయబద్ధమైన వాటా గురించి ప్రభుత్వం చేస్తున్న వితండ, అర్థం, పర్థంలేని వాదన గురించి చర్చకు రాగా దీనిపై త్వరలోనే తాను స్పందిస్తానని, ప్రజల ముందు వాస్తవాలను పెడ్తానని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ఉద్యమం, కొత్త రాష్ట్రం ఏర్పాటు.. తర్వాత ప్రభుత్వం ఎదుర్కొన్న సవాళ్లు వంటివాటిని నాయకుల వద్ద కేసీఆర్ గుర్తు చేశారు.
నాలుగు గంటలకుపైగా చర్చలు
హాస్పిటల్లో సాధారణ వైద్య పరీక్షల కోసం వచ్చిన కేసీఆర్.. శుక్రవారం ఉల్లాసంగా కనిపించారు. తనను పలకరించేందుకు వచ్చిన కుటుంబసభ్యులు, పార్టీ ముఖ్యనేతలతో మాట్లాడారు. సుమారు నాలుగున్నర గంటలపాటు పార్టీ నేతలతోనే గడిపారు. తన ఆరోగ్యం బాగానే ఉన్నదని, వైద్యులు ఒప్పుకుంటే శనివారం డిశ్చార్జి అవుతానని చెప్పారు. అనేక విషయాలపై మాట్లాడాల్సి ఉన్నదని, ఒకట్రెండు రోజుల్లో తానే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతానని చెప్పారు. ఉదయం, సాయంత్రం కూడా పార్టీ ముఖ్యనేతలతో దేశంలో, రాష్ట్రంలో ఉన్న వర్తమాన రాజకీయ వ్యవహారాలపై చర్చించారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ముదిరాజ్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, బండారి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, బాల్కసుమన్, చిరుమర్తి లింగయ్య, పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, వాసుదేవరెడ్డి, చిరుమల్ల రాకేశ్, వై.సతీశ్‌రెడ్డి, గజ్జల నగేశ్ తదితరులు కేసీఆర్‌ను కలిశారు.