1966లో ఫిన్లాండ్ రాజధాని హెల్సింకీలో ప్రపంచ జల శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఈ సదస్సు ఒక కీలక తీర్మానాన్ని ఆమోదించింది. దాని ప్రకారం ఆయా ప్రాంతాల్లో ప్రవహించే నదుల్లోని నీటిని మొట్టమొదట ప్రాజెక్టులు కట్టి ఎవరు వాడుకుంటారో వారికే ఆ నీటిపై హక్కు ఉంటుంది. దీనికి ‘రైపేరియన్ రైట్స్’ అని పేరు. హిస్టారికల్ ప్రొటెక్షన్ అని కూడా పిలుస్తారు. ఈ తీర్మానం ఆధారంగానే దేశంలోని అనేక రాష్ర్టాలు అక్రమంగానో, సక్రమంగానో ప్రాజెక్టులు కట్టి నదీజలాలపై తొలిహక్కును సాధించుకున్నాయి. నదుల అనుసంధానం పేరిట కేంద్రంలోని బీజేపీ సర్కారు గోదావరి నీటిని తరలించుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నదని కేసీఆర్ ఎప్పుడో గుర్తించారు. అందుకే ఆగమేఘాలపై కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. కేంద్రం ఎప్పుడో ఒకసారి ఇచ్చంపల్లినీ తెరపైకి తెస్తుందని గ్రహించే మూడో టీఎంసీనీ వాడుకోవడానికి ప్రణాళికలు రచించారు. ఇదంతా గోదావరి నీటిపై మన హక్కును మరింత స్థిరపరుచుకోవడమే. దీన్ని అడ్డుకోవడానికి బీజేపీ, ఈ అంశంపై అవగాహనేలేని కాంగ్రెస్ అడ్డగోలు ఆరోపణలు చేశాయి. ఫలితమేమైందో ఇప్పుడు చూస్తున్నాం. కేసీఆర్ పదవి నుంచి దిగడమే ఆలస్యం, కేంద్రం ఇచ్చంపల్లిని మళ్లీ తెరపైకి తెచ్చింది. తెలంగాణ ఆమోదించకున్నా తమిళనాడుకు నీళ్లు తీసుకుపోతామని ప్రకటించింది. కారణాలేవో తెలియదు గానీ రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు దీనిపై నోరే మెదపడం లేదు.
Kaleshwaram Project | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): బ్రిజేశ్‌కుమార్ కృష్ణాజలాల కేటాయింపు చేపట్టినప్పుడు, బేసిన్‌తో సంబంధం లేని తెలుగుగంగ ప్రాజెక్టుకు సైతం నీటి కేటాయింపు చేశారు. కారణం, అప్పటికే దాని నిర్మాణం జరిగింది. అందుకే ఆ ప్రాజెక్టుకు రక్షణ (ప్రొటెక్షన్) కల్పించాలనే అంతర్జాతీయ ప్రమాణాల మేరకు కేటాయింపు చేపట్టారు. ఇప్పుడే కాదు, గతంలో బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల్లోనూ ఇదే సూత్రం పాటించారు. బేసిన్లో పరివాహక ప్రాంతం, ఎగువ-దిగువ ఇవేవీ పెద్దగా ప్రామాణికంలోకి రాలేదు. ట్రిబ్యునల్ కేటాయింపు సమయంలో అప్పటికే ఉన్న ప్రాజెక్టులు, వినియోగం మేరకు ఆయకట్టుకు రక్షణ కల్పించాలనేదే ప్రధానంగా పరిగణనలోకి తీసుకున్న కనీస సూత్రంగా స్పష్టమవుతుంది.
ఇదీ అనుభవం
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో తొలుత రోజుకు రెండు టీఎంసీల చొప్పున గోదావరి జలాలను ఎత్తిపోసుకునేలా డిజైన్ రూపొందించారు. తదనంతర చర్చల్లో భాగంగా మూడో టీఎంసీని సైతం ఎత్తిపోసుకునేలా సివిల్, మెకానికల్ పనులకు ముందుగానే అవకాశం ఉండేలా నిర్మాణ ప్రక్రియ చేపట్టారు. కాళేశ్వరం నుంచి రోజుకు మూడు టీఎంసీల ఎత్తిపోతలు చేపడితే క్రమంగా అది మన హక్కుగా మారుతుందన్న ముందుచూపే ఇందుకు కారణం. కేంద్రం ఏకపక్షంగా నదుల అనుసంధానం పేరిట మన జలాలను తమిళనాడుకు తరలించుకుపోయే కుతంత్రాలు చేస్తే ‘మూడో టీఎంసీ’ అనేది శ్రీరామరక్షగా నిలుస్తుంది.
ఇదీ ముందుచూపు
రాజకీయాలు వేరు. రాష్ట్ర ప్రయోజనాలు వేరు. నదీజలాల హక్కుల విషయంలో రాజకీయాలకు అతీతం గా అన్ని పార్టీల నేతలు ఏకమవుతారు. తెలంగాణలో మాత్రం పరిస్థితులు భిన్నం. కాళేశ్వరం ప్రాజెక్టును బదనాం చేయడం తప్ప బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వేరే ఎజెండా లేకుండా పోయింది. చివరకు కేసీఆర్ ప్రభు త్వం ముందుచూపుతో చేపట్టిన మూడో టీఎంసీ ఎత్తిపోతలపై సైతం అవినీతి బురదజల్లి రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు మూడో టీఎంసీని ఎత్తిపోసుకునేందుకు అనుమతులు ఇవ్వకపోగా, ఆ పార్టీ చేస్తున్న ఆరోపణలకు కాంగ్రెస్ కూడా వంత పాడుతున్నదే కానీ, ఏనా డూ రాష్ట్ర ప్రయోజనాల కోణంలో ఆ రెండు పార్టీలు ఆలోచించిన దాఖలాలు లేవు. కృష్ణాజలాల పంపిణీలో తెలంగాణకు జరిగిన దశాబ్దాల అన్యాయాన్ని ఆసాం తం గుర్తించినందునే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కేసీఆర్ ప్రభుత్వం ముందుచూపు ప్రదర్శించింది. గత అనుభవాల దృష్ట్యా భవిష్యత్తులో జలాల్లో మన హక్కులకు ఎక్కడా భంగం కలగకుండా ఒక టీఎంసీని ఎక్కువగానే జోడించారు. కానీ కాంగ్రెస్, బీజేపీ దానిపై ‘అవినీతి’ బుదరజల్లి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాయి. ‘లాజిక్‌లు ఎవ్వరూ నమ్మరు. అందరికీ మ్యాజిక్లే కావాలి. అందుకే మన దేశంలో శాస్త్రవేత్తల కంటే బాబాలే ఫేమస్.. ’ అంటూ ఒక సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్‌కు తగ్గట్టుగానే బీజేపీ, కాంగ్రెస్ వ్యవహరిస్తున్నాయి. భావి తరాలకు ఉద్దేశించిన అంశాన్ని లాజిక్‌గా ఆలోచించడం లేదు. తెలంగాణకు హక్కుభుక్తంగా వచ్చిన గోదావరి జలాలను సైతం తమిళనాడుకు తన్నుకుపోయేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుతంత్రాలకు ‘ముందుచూపుతో చేపట్టిన మూడో టీఎంసీ’ వంటివే చెక్ పెడతాయని సాగునీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మూడో టీఎంసీ వెనక అసలు ఉద్దేశం
కమీషన్ల కోసమే ఈ అదనపు టీఎంసీ పనులు అంటూ నిరాధార ఆరోపణలతో రాజకీయ లబ్ధి పొందేందుకు కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్‌లో తొలుత గోదావరిలో వరద రోజులు (ఫ్లడ్ డేస్) 120 రోజులుగా నిర్ధారించారు. ఆ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్‌లో భాగంగా గోదావరి నుంచి తరలించాల్సిన 195 టీఎంసీలను లిఫ్టు చేసుకుంటామని పేర్కొన్నారు. కానీ మరింత లోతుగా అధ్యయనం చేయడం, మున్ముందు ఇతర రాష్ర్టాలు, వరద పరిమాణంలో చోటుచేసుకునే మార్పులను దృష్టిలో ఉంచుకొని వరద రోజులను 80 రోజులకే పరిమితం చేశారు. గోదావరిలో మంచి ఇన్‌ఫ్లోలు 80 రోజుల్లోనే ఉంటున్నందున ఆ సమయంలోనే 195 టీఎంసీలను ఎత్తిపోసుకునేందుకు సామర్థ్యాన్ని రోజుకు రెండు టీఎంసీల నుంచి మూడు టీఎంసీలకు పెంచుకోవాలని నిర్ణయించారు. తద్వారానే తెలంగాణకు గోదావరి జలాల్లో హక్తుభుక్తంగా వచ్చిన 954 టీఎంసీలను త్వరితగతిన, సంపూర్ణంగా వాడుకునేందుకు వెసులుబాటు లభిస్తుందని ఆశించారు.
ఇవీ చేదు అనుభవాలు
గోదావరిపై నిర్మించిన నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల విషయంలోనూ కాలానుగుణంగా వచ్చిన మార్పులతో ఆయకట్టు రైతులు ఎదుర్కొంటున్న అనుభవాలు కూడా మన కండ్ల ముందే ఉన్నాయి. అవి, గోదావరి ఉప నది మంజీరాపై ప్రపంచంలోనే తొలి భారీ సాగునీటి ప్రాజెక్టుగా చరిత్రకెక్కిన నిజాంసాగర్ డిజైన్ ప్రకారం 2,31,338 ఎకరాలకు సాగునీరు అందించాలి. కానీ, అది నిర్దేశిత ఆయకట్టులో 25% ఆయకట్టుకు సైతం సాగునీరు అందించలేకపోతున్నది. కారణం, ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర మంజీరాను బంధించాయి. కర్ణాటక ఒక్క బీదర్ జిల్లా పరిధిలోనే మంజీరాపై 13 బరాజ్‌లు నిర్మించింది. దీనికి తోడు 1931-1972 వరకు ప్రాజెక్టులో పదింతల మేర పూడిక పెరిగిపోయి, నీటి నిల్వ సామర్థ్యం తగ్గింది. గోదావరిపై కాంగ్రెస్ హయాంలో నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 1963లో శంకుస్థాపన చేస్తే, 1984లో క్రస్టు గేట్లను ఏర్పాటుచేశారు. 1994లో ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ రీసెర్చి ల్యాబరేటరీస్ (ఏపీఈఆర్‌ఎల్) హైడ్రోగ్రాఫిక్ సర్వే చేయగా, నీటి నిల్వ సామర్థ్యం 112 టీఎంసీల నుంచి 90.30 టీఎంసీలకు పడిపోయినట్టు తేలింది. 2013 డిసెంబర్-2014 జనవరిల్లో అధునాతనమైన ఇంటిగ్రేటెడ్ బోట్ మౌంటెడ్ బాతిమెట్రిక్ సర్వే (ఐబీఎస్) విధానంతో హైడ్రోగ్రాఫిక్ సర్వే నిర్వహిస్తే, నీటి నిల్వ సామర్థ్యం 80.104 టీఎంసీలకు పడిపోయినట్టుగా గుర్తించారు. అంటే ప్రాజెక్టు వాస్తవ నీటి నిల్వ సామర్థ్యం కంటే 31.912 టీఎంసీలు (28.48%) తగ్గింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహారాష్ట్రతో చేసుకున్న లోపభూయిష్టమైన ఒప్పందాన్ని ఆసరాగా చేసుకొని మహారాష్ట్ర ఎస్సారెస్పీ ఎఫ్ఆర్ఎల్ పరిధిలోనే బాబ్లీ ప్రాజెక్టును కట్టింది.
హక్కు జలాలను ఎలా వాడుకుంటాం?
గోదావరి జలాల్లో తెలంగాణకు 954 టీఎంసీల జలాలను వాడుకునే హక్కు ఉన్నది. అధ్యయనం మేరకు బచావత్ ఇది కేటాయించకపోయినప్పటికీ, గోదావరి ట్రిబ్యునల్‌లో పొందుపరిచిన వివరాల మేరకు ఈ వెసులుబాటు ఉన్నది. ఎగువన ఉన్న శ్రీరాంసాగర్, తద్వారా దాని దిగువన ఉన్న ప్రాజెక్టులకు సరైన ఇన్‌ఫ్లోలు ఉండటం లేదు. ఎగువన మహారాష్ట్ర బాబ్లీ ఉచ్చు బిగించింది. 2019లో కాళేశ్వరం అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి శ్రీరాంసాగర్‌కు ఆశాజనకమైన వరదలు ఉన్నప్పటికీ, అంతకుముందు దశాబ్దాలపాటు శ్రీరాంసాగర్ ఆయకట్టు అరిగోస చరిత్ర మన కండ్ల ముందే ఉన్నది. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్లోగానీ, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డాక్యుమెంట్లల్లోగానీ ప్రధాన గోదావరిలో వరద లేనందునే ప్రాణహిత జలాలను వినియోగించుకుంటామని స్పష్టంగా ఉన్నది. ఈ క్రమంలో ప్రాణహిత కలిసిన తర్వాత తెలంగాణ గోదావరి జలాల వినియోగానికి కాళేశ్వరం, సమ్మక్క బరాజ్ ద్వారా దేవాదుల, అటు పిమ్మట దిగువన ఉన్న సీతారామ వంటి పిడికెడు ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి. అందుకే తక్కువ రోజుల్లో ఎక్కువ జలాలను తరలించుకోవాలనే తాపత్రయంతోనే మూడో టీఎంసీని చేపట్టారు.
‘ఇచ్చంపల్లి’ కుట్రలకూ ఇదే అస్త్రం
మన హక్కు.. మన నీళ్లు అనుకుంటాం. కానీ ఎగువ, పొరుగు రాష్ర్టాలు కాలానుగుణంగా చేపట్టే ప్రాజెక్టులు, పెంచుకునే జలాల వినియోగంతో చివరకు హక్కుభుక్తంగా వచ్చే జలాలకూ ఎసరు పడుతుంది. ఇందుకు కృష్ణా జలాల్లో తెలంగాణ ఎదుర్కొంటున్న విచిత్రమైన పరిస్థితే నిదర్శనం. దీనితోపాటు మహారాష్ట్ర తరపున బల్లెంగా మారిన బాబ్లీ, ఆంధ్రప్రదేశ్ నుంచి పిడుగుపాటులాంటి పోతిరెడ్డిపాడు.. వంటివి కూడా మన హక్కుగా ఉన్న జలాలకు గండికొడతాయి. తాజాగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మనకు దక్కాల్సిన గోదావరి జలాలను రాజకీయ లబ్ధి కోసం తమిళనాడుకు తన్నుకుపోయేందుకు ప్రతిపాదించిన ‘ఇచ్చంపల్లి’ నదుల అనుసంధాన ప్రాజెక్టుల వంటివి కూడా మన ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తాయి. ఇలాంటి సమయాల్లో మూడో టీఎంసీ వంటివి మనకు శ్రీరామరక్షగా ఉంటాయి. కాళేశ్వరం పథకంలో రోజుకు మూడు టీఎంసీల చొప్పున గోదావరి జలాల ఎత్తిపోతకు అన్ని హంగులు ఉన్నట్టయితే ట్రిబ్యునల్స్గానీ, న్యాయస్థానాలుగానీ అప్పటికే అందుబాటులో ఉన్నాయనే ఒకే ఒక్క కారణంతో రక్షణ కల్పిస్తాయి. బచావత్ కేటాయింపుల్లోనూ కృష్ణా బేసిన్‌తో సంబంధంలేని పెన్నా బేసిన్‌లోని ప్రాజెక్టులకు కేవలం ఈ ఒక్క కారణంగానే (మనుగడలో ఉన్న ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు రక్షణ కల్పించాలి) ఎక్కువ కేటాయింపులు చేసింది. కేసీఆర్ ప్రభుత్వం చేసిన ఈ మూడో టీఎంసీ కూడా మున్ముందు తెలంగాణకు గోదావరి జలాల వినియోగంలో శ్రీరామరక్షగా ఉంటుంది. ఈ లాజిక్‌ను అర్థం చేసుకోలేకనో, అర్థమైనా తెలంగాణ ప్రయోజనాలు పట్టకనో.. దురదృష్టవశాత్తు తెలంగాణకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కూడా తమ పార్టీ జాతీయ నాయకుల రాజకీయ ప్రయోజనాలు తీర్చేందుకు పావులుగా మారి సొంత గడ్డ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తుండటమే విషాదం.
అనుమతులు ఇవ్వకుండా రాజకీయ డ్రామాలు
కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి తొలుత అన్ని రకాల అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆపై మూడో టీఎంసీకి వచ్చే సరికి మెలిక పెట్టడం ప్రారంభించింది. ముఖ్యంగా బీజేపీ ఎంపీ బండి సంజయ్ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆరోపణలు మొదలుపెట్టి, మూడో టీఎంసీపై కేంద్ర జల సంఘానికి లేఖ రాశారు. దీంతో అప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రశంసల వర్షం కురిపించిన కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు, కేంద్ర జల సంఘం చైర్మన్, ఇతర సభ్యులు, ఇంజినీర్లు చివరకు మూడో టీఎంసీని ఎత్తిపోసుకునేందుకు అనుమతి ఇవ్వకుండా కొర్రీలు పెట్టడం ప్రారంభించారు. కేవలం కాంట్రాక్టులు, పనుల కోసమే అదనపు జలాల తరలింపు అనే అర్థరహిత, వితండ వాదనను బీజేపీ భుజాన వేసుకున్నది. మూడో టీఎంసీ కోసం సీడబ్ల్యూసీకి పంపిన డాక్యుమెంట్లలో కాళేశ్వరం ప్రాజెక్టులో తొలుత నిర్దేశించిన 190 టీఎంసీల కంటే ఒక్క చుక్క కూడా అదనపు నీటిని ఎత్తిపోసుకుంటామని ఎక్కడా పేర్కొనలేదు. ఆ 195 టీఎంసీల నీటినే మంచి వరద ఉన్న రోజుల్లో త్వరితగతిన ఎత్తిపోసుకుంటామని స్పష్టంగా పేర్కొన్నది. కానీ కేసీఆర్ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ను బదనాం చేయాలనే ఏకైక ఎజెండాతో ప్రధాని మోదీ మొదలు బీజేపీ నాయకులు మూడో టీఎంసీపై ఆరోపణలు చేశారు. దానికి కాంగ్రెస్ నేతలు వంత పాడారు.