ఈసారి కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమిదే అధికారం. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీకి మద్దతిచ్చే రోజులు పోయినయ్. ప్రాంతీయ పార్టీలకు మద్దతిచ్చేందుకు వారే ముందుకొచ్చే పరిస్థితులు రాబోతున్నయ్. ఎన్నికల తర్వాత ప్రాంతీయ శక్తుల కూటమి బలోపేతమవుతుంది. వందకు వందశాతం జరిగేది అదే. బీజేపీకి 200 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదనే మోదీ ప్రతిరోజూ చొక్కాలు చింపుకొని గాండ్రిస్తున్నరు. తెలంగాణ, ఏపీలో బీజేపీకి ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు. 130 సీట్లున్న దక్షిణాదిలో బీజేపీకి వచ్చేది ఆరేడు సీట్లే. ఈసారి ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తయి. అది మీరు చూస్తరు. దేశంలో కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారింది.
– కేసీఆర్
‘మా పాలన చూసి ఓటేయండి.. ఈ లోక్‌సభ ఎన్నికలు మా పరిపాలన మీద రెఫరెండం’ అని మూడు నెలల క్రితం సీఎం రేవంత్‌రెడ్డి అన్న మాట. మర్చిపోయారో, వేరే కారణమేదైనా ఉందో తెల్వదు గానీ, రేవంత్ ఆ తర్వాత రెఫరెండం మాట ఎత్తలేదు. అయితే ప్రజలు మాత్రం రెఫరెండంను మర్చిపోలేదు. కాంగ్రెస్ సర్కారు ఐదు నెలల పాలనను చూసే ఈ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇస్తారని, ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. తాను తీర్చిదిద్దిన వ్యవస్థలను కూడా వాడుకోవడం చేతకాక ఐదు నెలల కాలంలోనే ప్రజలను అరిగోస పెట్టిన రేవంత్ సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని దాని ఫలితం ఎన్నికల్లో కాంగ్రెస్ అనుభవించ బోతున్నదని కేసీఆర్ కుండబద్దలు కొట్టారు. పరిపాలనను గాలికొదిలి, చిల్లర మల్లర రాజకీయాలు, బూతు భాషల వ్యవహారాలు చేస్తున్న రేవంత్‌రెడ్డికి ప్రజలు గట్టి గుణపాఠం చెప్పబోతున్నారని ఆయన వివరించారు. 16 రోజుల బస్సు యాత్ర ముగించుకొని హైదరాబాద్ వచ్చిన కేసీఆర్ శనివారం తెలంగాణభవన్‌లో సుదీర్ఘ మీడియా సమావేశం నిర్వహించారు.
KCR | హైదరాబాద్, మే11 (నమస్తే తెలంగాణ): “రాష్ట్రంలో చాలా చక్కగా నడుస్తున్న అనేక మంచి కార్యాక్రమాలను కాంగ్రెస్ దారుణంగా దెబ్బతీసింది. అతి తెలివి, అనవసరమైన భేషజానికి పోయి వారి కాళ్లు వాళ్లే విరగ్గొట్టుకున్నరు. నష్టపోయింది వాళ్లే. ఇతరులు ఎవరూ నష్టపోరు. రైతుబంధు, కరెంటు, తాగునీరు, సాగునీరు, పంటల కొనుగోలు, ఫీజు రీయింబర్స్మెంట్, సబ్బండవర్గాల సంక్షేమం అన్నిట్లోనూ కాంగ్రెస్ ఘోరంగా విఫలమై తెలంగాణకు శాపంగా మారింది. అన్ని రంగాల్లో రాష్ర్టాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తిని తిడితే తెంగాణ సమాజం హర్షిస్తుందా? ‘చెప్పుతో కొడతాం’ అని మందిని తిట్టడం, దురుసుగా మాట్లాడడం తప్ప ప్రభుత్వం ఏదీ చేయడం లేదు. ఐదారు నెలల్లోనే ఘోర తప్పిదాలకు పాల్పడిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు” అని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. శనివారం తెలంగాణభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్ అనేక అంశాలపై కుండబద్దలు కొట్టారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తన 17 రోజుల బస్సుయాత్రకు జనం నుంచి విశేష స్పందన వచ్చిందని, ప్రజలు నీరాజనాలు పలికారని కేసీఆర్ తెలిపారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అద్భుత ఫలితాలు సాధించబోతున్నదని ధీమా వ్యక్తంచేశారు. తనకు అందిన సమాచారం ప్రకారం రెండు జాతీయ పార్టీలకు మించి బీఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో గెలవబోతున్నదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాలు, అవలంబించిన తప్పుడు విధానాలు ప్రజల్లోకి స్పష్టంగా వెళ్లాయని, ఫలితంగా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అద్భుత విజయాన్ని అందుకోబోతున్నదన్న విశ్వాసం వ్యక్తంచేశారు.
‘రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక అర్భక ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో చాలా బ్లండర్ మిస్టేక్స్ చేసింది’ అని కేసీఆర్ విమర్శించారు. ఎప్పుడైనా, ఎక్కడైనా ఒక పార్టీ ప్రభుత్వం మారి వేరే పార్టీ ప్రభుత్వం కొలువు దీరినప్పుడు సహజంగా గత ప్రభుత్వం అనుసరించిన విధానాలపై అంతర్గత సమీక్షలు చేసుకొని అంతకంటే కొంచెం మెరుగైన ఫలితాలు వచ్చే పనులు చేపట్టడం సహజంగా జరిగే ప్రక్రియ అని పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే అవన్నీ విడిచిపెట్టి అమూల్యమైన సమయాన్ని చిల్లర విషయాల కోసం వృథా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్వేతపత్రాల పేరుతో అనవసర చర్చపెట్టి ప్రతిపక్షాన్ని తూలనాడడం, మాట్లాడకూడని భాష వాడడం, అక్కసు వెళ్లగక్కడం, ప్రతిపక్షాన్ని దెబ్బతీయాలనే చిల్లర రాజకీయ ప్రయత్నానికి పాల్పడిందని నిప్పులు చెరిగారు. ‘కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. చేసిన తప్పు ఆ పార్టీని కాటేయబోతున్నది. అందులో ఎటువంటి అనుమానం లేదు. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులే ఆ పార్టీని ముంచేయటం ఖాయం’ అని స్పష్టంచేశారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ జాతీయ నాయకుడు రాహుల్‌గాంధీ వస్తే సరూర్‌నగర్ స్టేడియంసాక్షిగా తేలిపోయిందని కేసీఆర్ ఉదహరించారు. సరూర్‌నగర్‌లో మూడు పార్లమెంట్ నియోజకవర్గాల సంయుక్త సమావేశం నిర్వహిస్తే కనీసం మూడువేల మంది కూడా హాజరుకాకపోవడమే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరుపై ప్రజలెంత ఆగ్రహంతో ఉన్నారనే అంశానికి కొలమానమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉన్న చొరవ, ఆ జోష్ ప్రస్తుతం కొరవడిందని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రగతి, అభివృద్ధిని కాంక్షించే ఏ ప్రభుత్వం కూడా ఇంత బాధ్యతారాహిత్యంగా ఉండదని మేధావులు ఆవేదన చెందుతున్నారని కేసీఆర్ తెలిపారు. స్వయంగా ముఖ్యమంత్రే ‘రాష్ట్రం దివాలా తీసిందని పేర్కొనడం. రాష్ట్ర ప్రతిష్ఠను ఒక ముఖ్యమంత్రిగా తానే కించపరచుకోవడాన్ని మేధావులే కాదు సామాన్యులెవరూ హర్షించడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రం దివాలా తీసిందని ముఖ్యమంత్రి పేర్కొనడం రాక్షస ఆనందానికి ప్రతీక అని ధ్వజమెత్తారు. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా, రాష్ర్టానికి వచ్చే పెట్టుబడుల దృష్ట్యా బాగుందనే చెప్పాలని వివరించారు. ‘రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తెలంగాణ ధనిక రాష్ట్రం అని ప్రతిసారి చెప్పిన. బీఆర్ఎస్ హయాంలో దాన్ని నిజం చేసిన. ధనిక రాష్ట్రమని చెప్తూ ఆ దిశగా పనిచేస్తూ అద్భుతమైన విజయాలు సాధించినం’ అని వివరించారు.
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తెలంగాణ వ్యతిరేకి అయినా, ఆయన హయాంలోని మంచి పథకాలను కొనసాగించి అసెంబ్లీ సాక్షిగా కీర్తించాం అని కేసీఆర్ గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలను ఆయన ఉదహరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన మంచి పథకాలను చెరిపేస్తం…క్యాన్సల్ చేస్తమని చెప్పలేదు. లేబుల్ అంటించలేదు’ అని పేర్కొన్నారు. ‘ఈ ప్రభుత్వం అతి తెలివి, అనవసరమైన భేషజానికి పోయి వాళ్ల కాళ్లు వాళ్లే ఇరగ్గొట్టుకున్నరు. నష్టపోయింది వాళ్లే. ఇతరులు ఎవరూ నష్టపోరు’ అని కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును తూర్పారబట్టారు.
అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే రాష్ర్టాన్ని కాంగ్రెస్ ఆగం చేసిందని కేసీఆర్ విమర్శించారు. అధ్వానంగా ఉన్న విద్యుత్తు వ్యవస్థలను తాము అద్భుతంగా తీర్చిదిద్దామని, అన్నిరంగాలకు 24గంటల పాటు కరెంట్ ఇచ్చామని, ఏడువేల మెగావాట్ల విద్యుత్తుశక్తిని 21వేల మెగావాట్లకు పెంచామని గుర్తుచేశారు. ఇప్పుడీ అసమర్థ కాంగ్రెస్ ఐదారు నెలల్లో మళ్లీ అస్తవ్యస్తం చేసిందని మండిపడ్డారు. తెలంగాణకు పరిశ్రమలు తరలివస్తున్నయ్ అనే పరిస్థితి నుంచి తరలిపోతున్నయ్ అనే పరిస్థితి తెలంగాణకు వచ్చిందని విమర్శించారు. కార్నింగ్ అనే పరిశ్రమ వెయ్యికోట్ల పెట్టుబడితో వచ్చి పనులు ప్రారంభించి తమిళనాడుకు తరలివెళ్లిందని ఉదహరించారు.
ఇంటింటికీ మంచినీటి సరఫరాను ఒక చాలెంజ్‌గా తీసుకుని మిషన్ భగీరథ పనులు చేశామని కేసీఆర్ గుర్తుచేశారు. నిరుపేద గ్రామీణ ప్రజలకు రూపాయి కూడా తీసుకోకుండా నల్లా కనెక్షన్లు ఇచ్చామని, తమ ప్రయత్నాల ఫలితంగా నీళ్ల కొనుగోళ్లు, నీళ్ల వ్యాపారం బంద్ అయిందని తెలిపారు. ‘ఈ మూడు, నాలుగు నెలల్లోనే అతి ప్రయత్నాలు, అతి ప్రవర్తన వల్ల ప్రజలు అనుభవిస్తున్న బాధలు చెప్పనలవికావు. మళ్లీ బిందెలొచ్చినయి. ఐదు నెలల్లో 2.5 లక్షల ట్యాంకర్ల నీటిని ప్రజలు కొనుగోలు చేసినట్టు సమాచారముంది. నాలుగైదు నెలల స్వల్పకాలంలోనే మరెందుకు ఈ ఇబ్బంది వచ్చిందో నాకు అర్ధమైతలేదు. బాగా నడిచిన వ్యవస్థలను కాంగ్రెస్ పార్టీ భ్రష్టుపట్టిస్తున్నది. ఏ సమస్య వచ్చినా పట్టించుకునే నాథుడులేదు. బీఆర్ఎస్ ప్రభుత్వమున్నప్పుడు భయం, భక్తి ఉండేది. ఇప్పుడది లేదు. విచ్చలవిడితనం వచ్చింది. దీంతోనే ఈ దుర్మార్గం జరుగుతున్నది’ అని కేసీఆర్
‘దేశంలోఎవరూ కనీవినీ ఎరుగనటువంటి పెట్టుబడి సాయాన్ని రైతుబంధు రూపంలో ఇచ్చాం. 24 గంటల పాటు విద్యుత్తునిచ్చాం. రైతుల్ని అధైర్యపరచొద్దని ధాన్యం తడిచినా, మొలకవచ్చినా, బియ్యం పాడైతయని తెలిసినా మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసినం. కానీ ఒకటేసారి పరిస్థితి తారుమారైంది. రైతబంధును ఆగం చేసిండ్రు. పంటపెట్టుబడి సాయం ఇవ్వలేదు. కారణమేందో ప్రభుత్వానికే తెలియాలి’ అని కేసీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వమే రైతుబంధు కోసం రూ.15వేల కోట్లు వెచ్చించిందని, కాంగ్రెస్ హామీ అమలు కావాలంటే మరో రూ.5-6వేల కోట్ల బడ్జెట్ పెరుగుతుందని, మొత్తంగా 21వేలకోట్లకుపైగా ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఆ మొత్తం ఇవ్వలేమని తెలిసే, మొత్తంగా రైతుబంధును ఎగబెట్టాలని చూస్తున్నదని, అందుకే కుంటిసాకులు వెతుకుతున్నదని కేసీఆర్ ధ్వజమెత్తారు.
రైతు రుణమాఫీపై రేవంత్ సర్కారును కేసీఆర్ నిలదీశారు. ఏ ఆగస్టు 15న రుణమాఫీ చేస్త్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 9న ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఇలా అనడం బాధాకరమని పేర్కొన్నారు. ఒక సీఎం స్వయంగా చేసే దోపిడీని ఒక ఏడాది ఆపేస్తే రుణమాఫీ లెక్కనేకాదు. ఎడమచేయి తోటి రూ. 40వేలకోట్ల రుణమాఫీ చేస్తానని ఇప్పడు అంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలివిగా ఆగస్టు 15 అంటున్నాడని, కానీ ఏ సంవత్సరమో చెప్పడం లేదని ఎద్దేవా చేశారు.
కాళేశ్వరం మీద అడ్డమైన ఆరోపణలుపెట్టి, కతలు పెట్టి దానినో ప్రహసనంగా కాంగ్రెస్ మార్చిందని కేసీఆర్ ధ్వజమెత్తారు. కమిషన్‌తో ఆయ్యేది, తేలేది, పాతమన్ను ఏమీ లేదని తేల్చి చెప్పారు. కాళేశ్వరం బరాజ్‌ను రిపేరు చేసుకోవచ్చని కమిషనే చెప్పిందని, నేషనల్ డ్యాం సేఫ్టీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడంపై ప్రభుత్వాన్నే నిందిస్తున్నదని మండిపడ్డారు. చెరువులను, చెక్‌డ్యాంలను నింపకుండా గోదావరి నీళ్లను కిందికి వదిలి పెట్టారని, సాగునీళ్లను అందివ్వలేదని, భూగర్భజల మట్టం పడిపోయిందని, రైతులు మళ్లా బోర్లు వేసుకుని ఆర్థికంగా నష్టపోయారని మండిపడ్డారు.
ఉన్న పథకాలు రివర్స్ కావడంతో ప్రజలంతా కాంగ్రెస్ ప్రభుత్వంపై రివర్స్ అయ్యారని కేసీఆర్ పేర్కొన్నారు. రైతులు, ప్రజల ఆగ్రహానికి ఈ ప్రభుత్వం గురికాకతప్పదని హెచ్చరించారు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడంతోపాటు పేదలకు సాయం అందించాలనే ఒక ఎత్తుగడతో బతుకమ్మ చీరలు, రంజాన్, క్రిస్మస్, స్కూల్ యూనిఫాంల తయారీ అప్పగించామని, రంగులు, రసాయనాలపై సబ్సిడీ కల్పించామని, త్రిఫ్ట్, బీమా పథకాలను ప్రవేశపెట్టి కాపాడుకున్నామని వివరించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కొత్త బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వలేదని, గత ఆర్డర్లకు సంబంధించిన రూ.300 కోట్ల బకాయిలను కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఇదేమని అడిగితే నిరోధ్‌లు, పాపడాలు అమ్ముకుని బతకాలని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన కాంగ్రెస్‌కు చేనేత కార్మికులు ఎలా ఓట్లేస్తారని ప్రశ్నించారు. దళిత కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.12లక్షలు ఇస్తామని హామీ ఇచ్చిందని, కానీ ఎప్పుడు ఇస్తాం? ఎలా ఇస్తాం? అనే విషయాన్ని చెప్పడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 1.3 లక్షల కుటుంబాలకు విడుదల చేసిన దళితబంధు నిధులను కూడా వెనక్కి తీసుకుంటున్నారని మండిపడ్డారు.
‘గోబెల్స్ అనే వ్యక్తి బతికుంటే.. బీజేపీ చేసే తప్పుడు ప్రచారం చూసి సిగ్గుతో సచ్చిపోయేవాడు. అంత భయంకరంగా గోబెల్స్ ప్రచారం చేస్తున్నది బీజేపీ. ఎంత దారుణమంటే, ‘అబ్కీ బార్ చార్సౌ పార్’ అంటున్నరు. బీజేపీ మళ్లీ గెలిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400కు చేరడం ఖాయం. వాళ్ల పిచ్చి, ఉన్మాదానికి అవధులే ఉండవు. అంత దారుణంగా ధరలు పెరగుతాయాయి’ అని కేసీఆర్ చెప్పారు. ఢిల్లీలో రైతుల ఆందోళనలు జరుగుతుంటే నక్సలైట్లు అని, అర్బన్ నక్సలైట్లు అని రైతులను నానా దుర్భషలాడుతూ 750 మంది రైతులను మోదీ పొట్టన పెట్టుకున్నడని ఆరోపించారు.
‘కంట్రీ జీడీపీ గ్రోత్ 2004-14 మధ్యలో 6.8 శాతం ఉంది. మరి ఘనత వహంచిన విశ్వగురు ప్రధాని మోదీ పదేండ్ల కాలంలో 5.8 శాతానికి వచ్చింది. మన దేశం ముందుకుపోయిందా? వెనక్కి పోయిందా? ప్రజలు ఆలోచించాలి. లెక్కకైతే కనీసం 8 శాతానికి పైగా గ్రోత్ ఉండాలి. జాబ్‌లెస్ గ్రోత్ దేశంలో బాగా పెరిగింది. మోదీ కాలంలో నిరుద్యోగం బాగా పెరిగింది’ అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పొద్దున లేస్తే దేశం కోసం ధర్మం కోసం అని మాట్లాడే మోదీ.. దేశంలో ఒక సంస్కృత యూనివర్సిటీ అయినా పెట్టిండా? అని కేసీఆర్ నిలదీశారు. ఒక రకమైన ఉన్మాద స్థితిలోకి దేశాన్ని నెట్టివేయడం, విద్వేషం నింపడం వంటి చర్యలు తప్ప దేశానికి ఒరిగిందేమీ లేదని విమర్శించారు.
‘ఇప్పుడు గోదావరి ఎత్తుకొని పోతానని మోదీ అంటుండు. ఎన్‌డబ్ల్యూడీఏ ద్వారా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రకు లేఖలు పంపిండు. తెలుగు రాష్ర్టాలకు ఉన్న ఒకే ఒక్క వనరు గోదావరి. ఒక్కోసారి కృష్ణా ఎండిపోతది. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రతిపాదన తెస్తే.. నేను ససేమిరా ఒప్పుకోను అన్నా. నువ్ ఏం చేసుకుంటావో చేసుకో’ అని మోదీని ఎదురించినట్టు కేసీఆర్ చెప్పారు. ముందు మన వాటా తేల్చకుండా, మన అవసరాలు గురించి పట్టించుకోకుండా, నీటి కేటాయింపులు చేయకుండా ఎవరికో అప్పగిస్తామని అంటే ఎలా ఒప్పుకుంటామని ప్రశ్నించారు.
‘నా బస్సు యాత్రను విజయవంతం చేశారు. మీరు మంచి స్పందన ఇచ్చారు. ఘన స్వాగతం పలికారు. ఆవేశపూరిత స్వాగతం చెప్పారు. నన్ను కలిసి మీ బాధలు చెప్పుకున్నారు’ అని రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఆనాడు కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు రాష్ట్రం వస్తదని ఎవ్వరికీ నమ్మం లేదని, 14 ఏండ్లు అద్భుతంగా పోరాడి, పురోగమించి, తెలంగాణ రాష్ట్రం తెచ్చి ప్రజలకు అప్పగించినట్టు గుర్తు చేసుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో బీఆర్ఎస్ ఓడిపోయిందని, ప్రజలు ఇచ్చిన తీర్పు తమకు శిరోధార్యమేనని, ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర పోషిస్తామని స్పష్టం చేశారు.
‘వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమి పాత్ర పెద్దగా లేదు. ఎన్డీఏ కూటమిలో కూడా ఎవ్వడూ దిక్కు లేడు. అంతా వెళ్లిపోయారు. బీజేపీకి 200 సీట్ల దాటే పరిస్థితి లేదు’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. మోదీ ప్రతిరోజూ చొక్కాలు చించుకుని గాండ్రిస్తున్నది అందుకేనని ఎద్దేవా చేశారు. కూటమి కూడా రిజర్వేషన్లు ఉంచుతమని, బీజేపీ తీసేస్తదని, ముస్లింలకు ఇస్తమని, దళితులకు తీసేస్తరని, బీసీల రిజర్వేషన్లు తీసేస్తరని ఇలా.. ఏవేవో పుకార్లు సృష్టిస్తున్నట్టుదని మండిపడ్డారు.
‘తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే, తెలంగాణ ఆత్మగౌరవం నిలబడాలంటే కచ్చితంగా ఈ కష్టసమయంలో బీఆర్ఎస్ ఎంపీలనే గెలిపించాలె. నేను మీ బిడ్డగా చెబుతున్నా.. మీరు నాకు 14 సీట్లు ఇవ్వండి. తెలంగాణ తడాఖా కేంద్రంలో నేను చూపిస్తా. ‘ఇది మా తెలంగాణ’ అని మీరు తలెత్తుకునే విధంగా దేశ రాజకీయాలను శాసిస్తా. బీఆర్ఎస్ ఇంటిపార్టీ. ఎప్పుడైనా తెలంగాణ కోసం పేగులు తెగేదాకా కొట్లాడతది. తెలంగాణ ఆత్మగౌరవం కాపాడండి’ అని కేసీఆర్ వివరించారు.
‘నేనున్నప్పుడు కూడా కేఆర్ఎంబీ ఉంది. అప్పుడు కూడా కేఆర్ఎంబీ మా మీద కర్ర పెత్తనం చేయాలని చూస్తే.. ‘మీరు మా ఇరు రాష్ర్టాల మధ్య సమన్వయ కర్త మాత్రమే. మీ లిమిట్స్‌లో మీరు ఉండండి. మాకంటే ఎక్కువ కాదు’ అని హెచ్చరించా. కానీ ఈ దద్దమ్మలు ప్రాజెక్టులు వాళ్లకు అప్పగించారు. ఇప్పుడు నాగార్జునసాగర్ కట్టమీదకు పోయే పరిస్థితి లేకుండా చేశారు’ అని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న ఆంధ్ర నాయకులు టెయిల్ పాండ్ నుంచి 4 టీఎంసీల నీళ్లు తీసుకొని పోయినా కాంగ్రెస్ నాయకులు మాట్లాడే పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే పద్ధతిలో గోదావరి నీళ్లను తీస్కోని పోతానని మోదీ అంటున్నడని, ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
ప్రభుత్వ పెద్దల దురుసు ప్రవర్తన, దుర్భాషలాడుతున్న తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని కేసీఆర్ వివరించారు. కేసీఆర్‌పై తిట్లు.. దేవుళ్లపై ఒట్లు తప్ప సీఎం రేవంత్‌రెడ్డికి వేరే కార్యక్రమం లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. ‘కేసీఆర్‌ను టైగర్ అంటారు మా పార్టీవోళ్లు, ప్రజలు. పులిని బోన్లో వేస్తం. చర్లపల్లి జైల్లో వేస్తం. డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తం అని దుర్మార్గంగా మాట్లాడుతున్నరు. నాపై దుర్భాషలతో మీరు సాధించేదేంది? అథమస్థానంలో ఉన్న తెలంగాణను దేశంలోనే నంబర్ వన్‌గా నిలిపినందుకా? 4.17 లక్షలు ఉన్న జీఎస్ఎస్డీని 14.5 లక్షలకు తీసుకెళ్లినందుకా? అన్నిరంగాలకు 24 గంటల పాటు కరెంటు ఇచ్చినందుకా? వడ్ల ఉత్పత్తిలో పంజాబ్‌ను తలదన్ని అగ్రస్థానంలో నిలబెట్టినందుకా?.. ఎందుకు జైలులో వేస్తారు?’ అని ప్రశ్నించారు. 14 ఏండ్లు అనేక అవమానాలు భరించి అవిశ్రాంతంగా పోరాడి, జాతిని విముక్తం చేసి, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయించి, అన్ని రంగాల్లో రాష్ర్టాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తిని తిడితే తెలంగాణ సమాజానికి దుఃఖం కలగదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఇది శాపంగా మారుతుందని చెప్పారు.
‘నా అనుభవం ప్రకారం చెప్పేదేంటంటే ప్రాంతీయ పార్టీల కూటమే దేశాన్ని శాసించే స్థాయికి చేరుకుంది. ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి బలమైన కూటమిగా ఏర్పడతాయి. కాంగ్రెస్, బీజేపీ నుంచి మాకు సపోర్ట్ చేసే పరిస్థితి ఉంది. మేము వాళ్లకు మద్దతు ఇచ్చే రోజులు పోయినయ్’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం దేశంలో ప్రాంతీయ శక్తులు, పార్టీలు బలోపేతమై, వీళ్ల కూటమే పెద్దదిగా అవతరించబోతున్నదని చెప్పారు. వీళ్లకే ఏదో ఒక జాతీయ పార్టీ సపోర్ట్ చేసి వాళ్లతోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, వందశాతం జరిగేది అదేనని తెలిపారు. ‘తెలంగాణలో బీజేపీకి ఒకటి, లేదంటే అది కూడా వచ్చే పరిస్థితి లేదు. అమిత్‌షాది అంతా గోబెల్స్ ప్రచారం. ఒక్క డిజిట్‌కే దిక్కులేదని అంటుంటే డబుల్ డిజిట్ అంటుండు. అందుకే ‘బీజేపీకి వన్ ఆర్ నన్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ” అని కేసీఆర్ చెప్పారు. సౌత్ ఇండియా నుంచి బీజేపీకి పది సీట్లు దాటే పరిస్థితి లేదని, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఏపీలో జీరో సీట్లు వస్తాయని, కర్ణాటకలో ప్రజ్వల్ గడబిడ తర్వాత 6-7 సీట్లు వచ్చే పరిస్థితి ఉన్నదని తెలిపారు. 130 సీట్లున్న దక్షిణ భారతంలో బీజేపీకి వచ్చేది కేవలం పది సీట్ల లోపే నని, ఉత్తర భారతంలో కూడా చాలా ఘోరంగా దెబ్బతింటున్నారని కేసీఆర్ చెప్పారు. ‘తెలంగాణలో బీజేపీకి 0-1 వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్కు 12-14 సీట్లు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ 9 స్థానాల్లో మూడోస్థానంలో ఉంది. బీజేపీ రెండోస్థానంలో ఉన్నా, మాకు చాలా దూరంలో ఉన్నది. ఈసారి ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయి’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
‘బీజేపీకి ఓటు వేస్తే అశాంతి, అలజడి తప్ప ఇంకొకటి ఉండదు. బీజేపీ పిచ్చిలో పడిపోతే ఏమీ రాదు. బీఆర్ఎస్ తెలంగాణ బలం. బీఆర్ఎస్ తెలంగాణ శక్తి. ఈ ఢిల్లీ గులాములు గెలిచి మనకు సాధించేది ఏమీ లేదు’ అని కేసీఆర్ పేర్కొన్నారు. నలుగురు ఎంపీలు గెలిచినా, ఒక కేంద్ర మంత్రి ఉన్నా రాష్ర్టానికి రూపాయి లాభం లేదని తెలిపారు. రేపు ప్రాంతీయ శక్తుల రాజ్యం రాబోతున్నదని, కాబట్టి మనం బలమైన ప్రాంతీయశక్తిగా ఉండాలని తెలిపారు. తెలంగాణ ప్రజలు తమిళనాడును ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ‘అక్కడ ద్రవిడులు బలంగా, చైతన్యంతో ద్రవిడ పార్టీలను గెలిపిస్తారు తప్ప, బయటి వారిని గెలిపించరు. మనం కూడా వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకుపోదాం’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు.