KCR | తెలంగాణకు 1956 నుంచి ఇప్పటి వరకు మనకు శత్రువే కాంగ్రెస్ పార్టీ అని.. ఉన్న తెలంగాణను ఊడగొట్టి ముంచిందే ఈ కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు విమర్శించారు. భువనగిరిలో బీఆర్ఎస్ అధినేత బస్‌యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘58 ఏళ్లు గోసపడ్డాం. భోనగిరి, ఆలేరు, జనగామ ప్రాంతం ఎంత గోసల ఉంటుండే. నీళ్ల వ్యాపారం ఉంటుండే. నీళ్లవ్యాపారాలు ఉంటుండే. బిందెలుపట్టుకొని మోసుడు ఉంటుండే. ఎన్ని బాధలు అనుభవించాం. వలసలు పోవడం, పట్నంపోవడం, ఆటోలు నడుపుకోవడం. మన వ్యవసాయాలను మూలకుపెట్టడం. ఇలా అనేక రకాల బాధలుపడ్డాం’ అంటూ గత కాంగ్రెస్ పాలనను కేసీఆర్ గుర్తు చేశారు.
‘ఆ నాడు ఎవరూ ధైర్యం చేయకపోయినా.. ఖచ్చితంగా తెలంగాణ లాభం జరగాలి. సొంత రాష్ట్రం కావాలి. బ్రహ్మాండంగా ఉండాలని నేను ఒక్కడినే పిడికెడు మందితో మిమ్మల్ని నమ్ముకొని ఉద్యమం ప్రారంభించాను. 15సంవత్సరాలు నిరాటంకంగా కొట్లాడి, చావునోట్లో తలకాయపెట్టి.. నిమ్స్ దవాఖానాలో నేను చచ్చిపోతనో.. బతుకుతనో అనే టైమ్ వరకు కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మీరంతా పులుల్లా కొట్లాడితే.. ఆ నాడు తలవంచి తెలంగాణ ఇచ్చింది. ఆ తర్వాత మనకు అధికారం వచ్చింది. కులం, మతం, జాతి వివక్ష లేకుండా అన్నివర్గాలకు మేలు జరగాలని చాలామంచి కార్యక్రమాలు చేసుకున్నాం. నేను తెచ్చిన రాష్ట్రంలో నా ప్రజలను తల్లి కోడిలా పిల్లలను కాపాడుకున్నట్లు అందరినీ కాపాడినం’ అన్నారు.
‘రైతులకు సంవత్సరానికి ఎకరానికి రూ.10వేలు ఇచ్చి బ్రహ్మాండంగా రైతుబంధు కార్యక్రమాన్ని భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తెచ్చిన గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్. ఒక సంవత్సరంలోనే చెడిపోయిన కరెంటును మంచిగ చేసి.. 24గంటలు కరెంటు ఇచ్చుకున్నాం. నీళ్లు ఇచ్చుకున్నాం. మన భువనగిరిలో బస్వాపూర్ ప్రాజెక్టును పూర్తి చేసుకున్నాం. నీళ్లు మీ అందరికీ వస్తయ్. ఆలేరు, భువనగిరి వస్తాయి. వడ్లు బ్రహ్మాండంగా మద్దతు ధర ఇచ్చి ఒక గింజకూడా లేకుండా కొనుగోలు కేంద్రాలు పెట్టి వడ్లు కొన్నాం. కొన్న వడ్ల పైసలు కూడా రైతులకు నేరుగా అకౌంట్లలో వేశాం’ అన్నారు.
‘ఇవాళ కాంగ్రెస్ ఏం చేసింది ? అడ్డగోలు హామీలు ఇచ్చింది. కేసీఆర్ రూ.10వేలు ఇస్తుండు కదా? మేం రూ.15వేలు ఇస్తాం. కేసీఆర్ లక్ష మాఫీ చేసిండు కదా? మేం రెండులక్షలు మాఫీ చేస్తమని చెప్పారా? రైతుబంధు అందరికీ వచ్చిందా ? రాలేదు కదా? అదికూడా ఉంటడో.. ఊడగొడుతరో తెలియడం లేదు. ఐదెకరాలకు, మూడెకరాలకు వేస్తామంటున్నరు నీ యబ్బ జాగీరు పోతుందా? నీ ముల్లె ఏమైనా పోతుందా? రైతులకు ఏమైనా బెంజ్ కారులు ఉన్నయా? రైతుల వద్ద ఏమైనా కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయా? ఐదెకరాలకే వేస్తామంటే.. ఆరు ఎకరాలు ఉన్నవారు ఎటుపోవాలి? ’ అంటూ కేసీఆర్ కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ మండిపడ్డారు.