హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్ స్ఫూర్తితో కేసీఆర్ పదేండ్ల పాలన సాగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమానికి కేసీఆర్ బలమైన పునాదులు వేశారని, ఆ పరంపరను కాంగ్రెస్ సర్కార్ కొనసాగించినప్పుడే సార్‌కు నిజమైన నివాళి అవుతుందని పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో జయశంకర్‌సార్ జయంతిని బీఆర్ఎస్ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాలకు జయశంకర్‌సార్ ప్రత్యక్ష సాక్షి అని, జీవితాంతం రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా పరితపించిన మహానుభావుడు అని కొనియాడారు. కేసీఆర్‌తో కలిసి సార్ ఢిల్లీలో తెలంగాణకు అనుకూలంగా దేశంలోని 36 రాజకీయ పార్టీలను ఒప్పించి లేఖలు ఇప్పించటంలో క్రియాశీలకంగా వ్యవహరించారని గుర్తుచేశారు.
సార్ జీవిత లక్ష్యాన్ని కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సమాజం సాధించిందని పేర్కొన్నారు. భూపాలపల్లి జిల్లాకు, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి జయశంకర్‌సార్ పేరుపెట్టి కేసీఆర్ ఘన నివాళి అర్పించారని చెప్పారు. తెలంగాణ సమాజానికి, బీఆర్ఎస్కు సార్ ఆశీస్సులు ఉండాలని కాంక్షించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, గంగుల కమ లాకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్‌రావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, కొత్త ప్రభాకర్‌రెడ్డి, పార్టీ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ పాల్గొన్నారు.