హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రానికి తలమానికంగా నిలిచేలా యాదగిరిగుట్ట దేవాలయాన్ని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పునర్నిర్మించారని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్ ఆగమశాస్త్ర పండితులతో అనేకసార్లు చర్చించి, టీటీడీ తరహాలో తీర్చిదిద్దేందుకు నిర్విరామంగా శ్రమించారని వివరించారు. నాడు ఆర్అండ్బీ శాఖ మంత్రిగా ఆ పవిత్రకార్యంలో పాలుపంచుకొనే అవకాశం దక్కడం తన అదృష్టమని పేర్కొన్నారు. మంగళవారం యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటుపై శాసనసభలో జరిగిన చర్చలో వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడారు. ప్రపంచంలోనే కృష్ణశిలతో నిర్మించిన ఏకైక ఆలయం యాదగిరిగుట్ట అని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలోనే విమాన గోపురానికి 60 కిలోల బంగారం సేకరించామని స్పష్టంచేశారు. తాను, తన వియ్యంకుడు కలిసి కిలో, హరీశ్‌రావు రెండు కిలోలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా విరాళమిచ్చారని వెల్లడించారు. టెంపుల్ సిటీ నిర్మాణానికి చర్యలు చేపట్టామని, వైటీడీఏ ఏర్పాటుపై ఆలోచించామని తెలిపారు. అంతలోనే ఎన్నికలు రావడం, అధికార మార్పిడి జరగడంతో విమాన గోపురాన్ని ప్రారంభించే అవకాశం కాంగ్రెస్‌కు వచ్చిందని పేర్కొన్నారు. హిందూ ధార్మిక ప్రచారానికి ప్రభుత్వం కేటాయించిన కోటి రూపాయలు సరిపోవని, రూ.5 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.