హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : చరిత్ర అంటే చెరిపివేయలేని వాస్తవం. చరిత్రలో భాగమయ్యే వారు చాలా అరుదు. కొంత మంది మాత్రమే పుస్తకాలకు రచనా వస్తువవుతారు. చరిత్ర సృష్టించిన వారిగా చరిత్రలో నిలిచిపోతారు. దీనిని ఎవరూ మార్చలేరు. మార్చడం ఎవరి తరం కాదు. ఇది మన పెద్దలు తరచూ చెప్పే మాటలు. కానీ ఈ మాటలను చెవికెక్కించుకోకుండా పుస్తకాల్లో పేజీలను చించివేస్తే చరిత్రను చెరిపివేసినట్టేనన్న భ్రమల్లో కాంగ్రెస్ సర్కారు ఉన్నది. చరిత్ర పేజీల్లో కేసీఆర్ పేజీలను చింపివేసే కుయుక్తికి ఒడిగట్టింది. ‘కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తాం.. నిశానా చెరిపేస్తాం’ ఇది తరచూ సీఎం రేవంత్‌రెడ్డి నోటినుంచి వచ్చే ఆణిముత్యాలు. ఈ మాటలను నిజం చేసేందుకు భాషా సాంస్కృతికశాఖ తమ భక్తిని చాటుకుంటున్నది. ఏకంగా ముద్రిత పుస్తకాల్లో కేసీఆర్ చిత్రాలున్న ఫొటోలను చించేసి విక్రయిస్తున్నది. అవేం ఇప్పటికిప్పుడు ముద్రించినవో.. కొత్తవో కాదు. పాత పుస్తకాలు. గతంలో ముద్రించినవే. పూర్తి వివరాల్లోకి వెళ్తే… బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో ‘తారీఖుల్లో తెలంగాణ’ అనే పుస్తకాన్ని ముద్రించారు. ఈ పుస్తకాన్ని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించింది. పదేండ్లుగా ఇది ప్రాచుర్యంలో ఉంది. ఎన్టీఆర్ మైదానంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో ఈ పుస్తకాన్ని విక్రయిస్తున్నారు.
గతంలో ముద్రించిన ఈ పుస్తకంలోని కేసీఆర్ ఫొటో ఉన్న పేజీని చించేసి అమ్ముతుండటం గమనార్హం. ఆయా పేజీకి చించేసిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పుస్తకాలు విరివిరిగా అమ్ముడయ్యాయి. పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యేవారు అత్యంత ప్రామాణిక పుస్తకంగా భావిస్తారు. ఇలాంటి పుస్తకంలో కేసీఆర్ ఫొటో ఉన్న పేజీని చించేసి విక్రయిస్తుండటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సర్కారు తీరుపై తెలంగాణవాదులు, కేసీఆర్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. సర్కారు తీరుపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రేవంత్ సర్కారుపై దుమ్మెత్తిపోస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారుడు కొణతం దిలీప్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఘాటుగా స్పందించారు. ‘కేసీఆర్ ఆనవాలు లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్న మూర్ఖపాలకుడిని చూస్తే.. అరచేయిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపడానికి ప్రయత్నించిన వారే గుర్తొస్తున్నారు.. తెలంగాణ చరిత్రపై చెరగని సంతకం కేసీఆర్‌ది. ఆయన ఆనవాలు చెరిపేయాలంటే తెలంగాణ ఆనవాలు లేకుండా చేయడమొక్కటే మార్గం. అది మీ వల్ల కాని పని’ అని ఎద్దేవా చేశారు. ‘పుస్తకాల్లో పేజీలు చించొచ్చు.. కానీ తెలంగాణ చరిత్రపై ఆయన సంతకం చెరిపివేయలేవు’ అంటూ వ్యాఖ్యానించారు. పుస్తకాల్లో కేసీఆర్ ఫొటో ఉన్న పేజీని చించేసి అమ్ముతుండటం నిజంగా బాధేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రేవంత్ సర్కార్ గతంలో కేసీఆర్ సహా బీఆర్ఎస్ మాజీ మంత్రుల పేర్లు పాఠ్యపుస్తకాల్లో కనిపించకుండా చేసింది. పేర్లు కనిపించకుండా పేపర్‌ను అతికించి కవర్ చేసింది. రాష్ట్రంలో 1-10 తరగతుల్లోని విద్యార్థులకు ఇచ్చిన తెలుగు పుస్తకం ముందుమాటలో తొలి సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కడియం, జగదీశ్‌రెడ్డి, సబిత పేర్లున్నాయి. దీనిని రేవంత్ సర్కారు జీర్ణించుకోలేకపోయింది. ఈ విషయంలో విద్యాశాఖ ఆగమాగంగా వ్యవహరించింది. పుస్తకాల్లో పేర్లున్న విషయం బయటికి పొక్కగానే తొలుత ఆయా పేజీని చింపివేయాలని మౌఖిక ఆదేశాలిచ్చింది. పలు జిల్లాల్లో చింపివేశారు కూడా. ఈ పేజీ వెనుక జన గణ మణ ఉండటంతో నాలుక్కరుచుకుని ఆదేశాలను ఉపసంహరించుకున్నారు. ఆ తెల్లవారే ఈ పుస్తకాలను ఎమ్మార్సీలకు, జిల్లా గోడౌన్లకు రిటర్న్చేయాలని డీఈవోలకు ఆదేశాలిచ్చారు. మరో రోజు తిరగగానే పేర్లున్న పేజీని కత్తిరించి కవర్ పేజీ వెనుకవైపు గమ్‌తో లేదా ఫెవికాల్తో జన గణ మణ కనిపించేలా అతికించాలని ఆదేశాలిచ్చారు. దీంతోపాటు ఈ వ్యవహారంలో ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి, ప్రభుత్వ పాఠ్యపుస్తక ముద్రణ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసచారిపై ప్రభుత్వం బదిలీ వేటువేసింది.