సుదీర్ఘ పోరాటాలు, అనేక త్యాగాలు, విద్యార్థుల ఆత్మ బలిదానాలు, చివరికి కేసీఆర్ ఆమరణ దీక్షతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడిన వెంటనే జరిగిన ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్‌కు పాలనాధికారం అప్పజెప్పారు. రాష్ట్రం సిద్ధించడం చారిత్రక విజయమైతే, పోరాటయోధుడే పాలకుడు కావడం ఒక సానుకూల పరిణామం. అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ తన మొదటి క్యాబినెట్ సమావేశంలోనే నలభై అంశాలపై తీర్మానాలు చేసి తన ప్రభుత్వం ముందున్న లక్ష్యాలను వివరించి, చేపట్టబోయే పథకాల ప్రాధాన్యాలను ప్రకటించారు.
60 ఏండ్ల ఆంధ్రుల వలస పాలనలో తెలంగాణ ప్రజలు కోల్పోయిందేమిటి? తిరిగి వాటిని పొందేందుకు ప్రస్తుతం నిర్వర్తించాల్సిన కర్తవ్యం ఏమిటి? సాధించుకున్న తెలంగాణ అన్ని రంగా ల్లో అభివృద్ధి చెంది, అన్నివర్గాల ప్రజలు పురోగమించాలంటే ఏం చేయాలి? అని ఆలోచించి, అందుకు రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి సామాజిక, ఆర్థిక స్థితిగతుల పట్ల సరైన అవగాహన కోసం ఒక సూక్ష్మ స్థాయి పరిశీలన అవసరమని ఆలోచించి, ఒక్క రోజు సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారు. సమగ్ర సమాచారాన్ని సేకరించడానికి, సంక్షేమ, అభివృద్ధి పథకాలకు రూపకల్పన చేయడానికి ఆ సర్వే మూల మలుపుగా నిలిచింది. కులం, ఉద్యోగం, ఉపాధి, భూమి, ఇల్లు మొదలైన వాటికి సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని సేకరించడం ద్వారా వ్యవసాయం, ఉపాధి, విద్య, ఆరోగ్యం మొదలైన రంగాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలు రూపొందించుకోవడానికి, కులవృత్తులకు చేయూతనివ్వడానికి కావలసిన ప్రాతిపదికను ఏర్పర్చుకోవడానికి అవకాశం ఏర్పడింది.
పద్నాలుగేండ్ల ఉద్యమకాలంలో ప్రజలతో ఉన్నందున, ప్రజల కష్టసుఖాల పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉన్నందున పథకాల రూపకల్పనలో కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారు. ఉద్యమానికి ప్రాతిపదికగా ఉన్న నీళ్లు, నిధులు, నియామకాలను ప్రాధాన్యాలుగా చేసుకొని, అద్వితీయ పథకాలకు రూపకల్పన చేశారు. గత పాలకుల రొటీన్ పాలనకు చెక్ పెట్టి, సూక్ష్మగ్రాహిగా, స్వీయ అధ్యయనంతో పాలనను కొత్త పుంతలు తొక్కించారు. అత్యంత ప్రాధాన్యతా రంగాలుగా వ్యవసాయం, సంక్షేమం, పరిశ్రమలను ఎన్నుకున్నారు. కలచివేస్తున్న రైతుల ఆత్మహత్యలకు పరిష్కారంగా వ్యవసాయాన్ని బలోపేతం చేశారు. ఒక్క వ్యవసాయరంగంలోనే రైతుల అభివృద్ధికి 9 రకాల పథకాలు ప్రవేశపెట్టారు. సాగునీరు, ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతు బీమా, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైతు వేదికలు, గోడౌన్లు, ఎరువులు, విత్తనాలు, క్రిమి సంహారక మందులు, రైతు రుణమాఫీ, వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు, పంటకు గిట్టుబాటు ధర మొదలైనవి అందజేశారు. సాగు నీరందించడానికి రాష్ట్రంలోని అనేక ప్రాజెక్టులను రీ డిజైన్ చేయడం కేసీఆర్ నిశిత పరిశీలనకు ఒక ఉదాహరణ. మిషన్ కాకతీయ వ్యవసాయ పూర్వ విధానానికి పునర్ వైభవం.
ప్రజలకు సంక్షేమాన్ని అందించడమే మహోన్నత న్యాయంగా భావించి సంక్షేమ రంగంలో పలురకాల పథకాలు ప్రవేశపెట్టి అమలుచేశారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బోదకాలు బాధితులు, కళాకారులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులు మొదలైన వారికి పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా పేద మహిళల వివాహానికి ఆర్థిక సాయం, బాలింతలకు కేసీఆర్ కిట్, రూ.13 వేలు ఆర్థికసాయం, గర్భిణులకు పాలు, గుడ్లు, పౌష్టికాహారం, అమ్మ ఒడి వాహనాలు, న్యూట్రీషియన్ కిట్లు, బడి పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్ మొదలైన సంక్షేమ పథకాలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, మిషన్ భగీరథ, గొల్ల కురుమలకు గొర్లు, ముదిరాజులకు చేపలు, నాయీ బ్రాహ్మణులకు ఆధునిక సెలూన్లు, రజకులకు వాషింగ్ మెషిన్లు, నాయీ బ్రాహ్మణులకు, రజకులకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇలా ప్రతి ఒక్కరికీ వారికి అవసరమైన సాయాన్ని అద్భుతంగా అందించారు.
రాజకీయాల్లో నాయకుడి ప్రజ్ఞ, వివేకం, అనుభవం, సాహసం ఆధారంగా ఆ నిర్ణయాలు, వాటి ఫలితాలు అధారపడి ఉంటాయి. ప్రజల అవసరాలు, ఆకాంక్షలు, ప్రయోజనాలు నెరవేరాలంటే అవి ఆ నాయకుడి శక్తి సామర్థ్యం, అనుభవం, సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోగల చైతన్యంపై ఆధారపడి ఉంటాయి. అన్నింటికి మించి కేంద్రంతో సయోధ్యతోనో లేదా సమరంతోనే తమ ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం పోరాడే సాహసంపై అధారపడి ఉంటుంది.
పాలకుడికి తమ గత వైభవ చరిత్ర పట్ల లోతైన అవగాహన ఉండాలి. ప్రజా జీవితాలను ప్రభావితం చేసే వర్ధమాన విషయాల పట్ల వివేకవంతమైన విశ్లేషణ ఉండాలి. తరతరాల అభ్యున్నతిని సుస్థిరపరిచే భవిష్యత్ నిర్మాణం పట్ల మేధోపరమైన దార్శనికత ఉండాలి. అప్పుడే సమర్థుడిగా
తాననుకున్నవి సాధించగలుగుతాడు.
అధికారాన్ని చేపట్టిన మొదటిరోజు నుంచే అవిశ్రాంతంగా శ్రమిస్తూ, అన్నిరంగాల అభివృద్ధి కోసం, రాజకీయ సుస్థిరత కోసం ఉన్న వనరులను వినియోగించుకుంటూనే కొత్త దారులను వెతుక్కుంటూ తాననుకున్నది సాధించే దిశలో అహర్నిశలు కృషిచేశారు కేసీఆర్. అధికారాన్ని అప్పజెప్పి, పన్నులు చెల్లించి, పరిపాలన అవకాశాన్ని అందించిన ప్రజల ప్రయోజనాలు నెరవేర్చడం పాలకుల బాధ్యతగా భావించారు కేసీఆర్. ఆశయ శుద్ధి, అచంచల ఆత్మవిశ్వాసం మెండుగా ఉండటం వల్ల తలపెట్టిన ప్రతి పనిని మొండిగా ప్రయత్నించి పూర్తిచేయడం ఆయన నైజం. రాజ్యాంగ పరిధిలో ప్రజలకు శ్రేయోరాజ్య ఫలితాలను ఎంతవరకు అందించవచ్చునో అంతవరకు అందించారు. కేసీఆర్ పాలన తెలంగాణకు కొత్త వెలుగు.
మరి నేటి ముఖ్యమంత్రి రేవంత్ చేసిందేమిటి? అబద్ధపు ప్రచారాలతో, అమలుకు సాధ్యం కాని హామీలతో, ప్రజల ఓట్లు పొంది, సీట్లు సాధించి, అయాచితంగా అందివచ్చిన అధికారాన్ని చెలాయిస్తూ, సమస్యలను దాటవేస్తూ, నెరవేరని హామీలతో, దిగజారుడు స్కాములతో, ప్రజాపాలన పేరిట ప్రజా జీవితాలను అతలాకుతలం చేస్తున్నారు. వెరసి రేవంత్ పాలన ప్రజలకు భారంగా మారింది. ఆయన పాలనలో అనుభవరాహిత్యం, నిర్ణయాల్లో అయోమయం, ఆర్థిక నిర్వహణలో విఫలత ఇవన్నీ కలగలిసి రాష్ర్టాన్ని వెనక్కి లాగుతున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం కన్నా ముందు తెలంగాణ ప్రాంతం సున్నా దశలో ఉంటే… తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ ‘సూపర్’ దశకు చేరుకున్నది.
రాజకీయాల్లో ఒక నాయకుడు ప్రజ్ఞ, అనుభవం, సాహసంతో నిర్ణయాలు తీసుకుంటేనే ఫలితం వస్తుంది. కానీ, రేవంత్ పాలనలో ఇవేవీ కనిపించడం లేదు. తత్ఫలితంగానే రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాతి పదేండ్లలో తెలంగాణ ‘సూపర్’గా రూపాంతరం చెందితే.. ఇప్పుడు మళ్లీ శూన్యంలోకి ఒదిగిపోతున్నది. ప్రజాపాలన అంటే ప్రజల బాగోగులు చూసే బాధ్యత. ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత. ఆ బాధ్యతను మోయలేని నాయకుడు రేవంత్ రెడ్డి. ఈ విషయం తెలంగాణ ప్రజలు గ్రహించారు. బాధ్యతెరిగిన మనిషి తెలంగాణకు కావాలని కోరుకుంటున్నారు. లేకుంటే తెలంగాణ భవిష్యత్తు మరింత చీకట్లోకి వెళ్లే ప్రమాదం పొంచి ఉన్నదని భావిస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ మాటలు చూస్తే, ఆయన ప్రవర్తనను పరిశీలిస్తే, ఆయన ఆలోచనలను గమనిస్తే, ఆయన స్థిరత్వం లేని పోకడలపై దృష్టిసారిస్తే, ఇక భవిష్యత్తులోనూ ఆయన పరిపాలన బాగుంటుందన్న నమ్మకం కలగడం లేదు. అధికారంలోకి రాకముందు ఏది మాట్లాడినా ప్రజలు పెద్దగా పట్టించుకోరు. కానీ, ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ప్రతిదీ గమనిస్తారు. ప్రస్తుత పాలనను గత పాలకుల పాలనతో పోల్చుకుంటారు. అందుకే, ప్రజలు కేసీఆర్ పాలనే బాగుండే, ఆయనే మళ్లీ రావాలని కోరుకుంటున్నారు. మనకు పుష్కలమైన ల్యాండ్ బ్యాంక్, అద్భుతమైన భౌగోళిక స్థితి, అన్ని రంగాలలో ప్రగతి సాధించగల మేధో సంపత్తి, ఘనమైన సాంస్కృతిక సమ్మిళిత స్థితి, ఐక్య పోరాటంతో రాష్ర్టాన్ని సాధించుకున్న ఉద్యమ స్ఫూర్తి ఉన్నది. వీటన్నింటినీ ప్రోది చేసుకొని తెలంగాణను దేశానికే రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దాలన్న దృఢ సంకల్పం ఉన్న నాయకత్వ శక్తి కావాలి. అభివృద్ధి, సంక్షేమం-అస్తిత్వం, ఆత్మగౌరవం అన్న నినాదాన్ని గుండెల నిండా నింపుకొని, తెలంగాణ పునర్నిర్మాణంలో ఉద్యమస్ఫూర్తిని చాటగల పార్టీ కావాలి. ఆ నాయకత్వ శక్తి కేసీఆర్, ఆ పార్టీ బీఆర్ఎస్. మనమంతా ఐక్యమై మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని ఆహ్వానిస్తే, అభివృద్ధి దిశగా దూసుకుపోవడాన్ని ఆపే శక్తి ఈ లోకంలో ఎవరికీ ఉండదు.
(వ్యాసకర్త: రాష్ట్ర శాసనమండలి మాజీ సభ్యులు)
-నారదాసు లక్ష్మణ్ రావు