జగిత్యాల, ఏప్రిల్ 21(నమస్తే తెలంగాణ) : తెలంగాణ.. కేసీఆర్.. ఈ రెండు పేర్లు ఒకదానితో ఒకటి ముడిపడిపోయాయి. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుయుక్తులు పన్నినా ఆ రెండింటినీ విడదీయలేరన్న విషయం మరోసారి స్పష్టమైంది. పల్లె నుంచి పట్టణం దాకా ఎవరి నోట విన్నా.. కేసీఆర్ మాటే వినిస్తున్నది. అంతటా ‘కేసీఆర్ సారే మళ్లీ రావాలి’ నినాదం హోరెత్తుతున్నది. ఆరు గ్యారెంటీలతో, 420 హామీలతో మోసం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి సర్కార్‌పై ప్రజలకు ఉన్న భ్రమలన్నీ తొలగిపోయి.. తెలంగాణ సాధకుడు కేసీఆరే రాష్ర్టానికి రక్షకుడనే విషయాన్ని వారు పూర్తిగా అర్థంచేసుకోగలిగారు.
పల్లె నుంచి పట్నం దాకా కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామరక్ష అనే అభిప్రాయానికి వచ్చేశారు. ఈ విషయం సోమవారం జగిత్యాలలో కేసీఆర్ ప్రజాశీర్వాద సభకు తరలివచ్చిన అశేష జనప్రవాహమే చెబుతున్నది. సూర్యుడి ప్రతాపాన్ని సైతం లెక్కచేయకుండా అభిమాన నేత కోసం వచ్చి.. ప్రసంగాన్ని ఆద్యంతం ఆసక్తిగా వింటూ కేసీఆర్ నోటి నుంచి వచ్చిన ప్రతి మాటకూ ప్రతిస్పందించారు.
‘మోసపడితే గోసపడ్తం’ అని చెప్పానా.. లేదా? ఇప్పుడేమైంది? రైతుల పరిస్థితి ఎట్లుంటె.. కడుపుల సల్ల కదలకుండా ఉండెనా.. లేకుండెనా? ఆటో ఆయనకు చెబితే పొలం కాడా పది బస్తాలు ఏశిపోయిండా లేదా..? ఇప్పుడు యాప్‌ల బుక్ చేసి కాళ్ల వాపులు వచ్చేలా తిరుగుతున్నరా.. లేదా? అని కేసీఆర్ చెబుతుంటే రైతులోకం చిన్నబోయింది. మహిళల పరిస్థితి ఎట్లుండె.. పెన్షన్లు ఏమైనయ్? అంటూ కేసీఆర్ మాట్లాడుతున్నప్పుడు వృద్ధులు, మహిళలు మౌనంగా మనోవేదనను మునిపంటిన అదిమిపట్టి వినడం కనిపించింది. ఏ తల్లిని, చెల్లిని పలుకరించినా.. మళ్లీ కేసీఆర్ పాలన వస్తేనే తమ బతుకులు బాగుపడుతాయని చెప్పడం గమనార్హం.
తెలంగాణ కోసం జాన్ పెట్టి కొట్లాడిన బెహతర్ ఆద్మీ కేసీఆర్ సార్. ఆయన సీఎం అయినంక ఎన్నో పనులు చేసిండు. అసలు సర్కార్ గిన్ని పనులు చేస్తదా? అని ఆయనను చూసినంకనే తెలిసింది. బీమారైన మనిషి నుంచి రైతుల వరకు.. చోటే బచ్చేసే లేకర్ బడే ఆద్మీ తక్ సబ్కో అచ్ఛా కియా.. అలాంటి కేసీఆర్ సార్‌ను దించేసి తప్పు చేసినం. 420 హామీలతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసి, అధికారంలోకి వచ్చింది. కాంగ్రెసోళ్లకు పాలన చేతకావడం లేదు. అంతా ఝూటా సర్కార్ లెక్క మారింది. రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ సార్ రావాలి.
– మహమ్మద్ మక్తార్ హుస్సేన్, నిర్మల్
కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ సుభిక్షంగా ఉన్నది. అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషంగా ఉన్నరు. మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, రాష్ర్టాన్ని ఆగం చేసింది. అందరినీ ఆగం పట్టించింది. కొట్లాడి సాధించుకున్న రాష్ట్రం కాంగ్రెస్ పాలనతో రెండున్నరేండ్లలోనే పూర్తిగా వెనుకబడిపోయింది.
– ఊరి మనూష, జగిత్యాల
జగిత్యాల సభలో కేసీఆర్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడిండు. ప్రభుత్వం ఏట్ల మోసం చేస్తున్నదో అందరికీ అర్థమయ్యేలా మంచిగ చెప్పిండు. టీవీల్లో కేసీఆర్ ప్రసంగం పూర్తిగా చూసినం. మా నేతన్నల సమస్యలపై కూడా మాట్లాడిండు. మా సిరిసిల్లలో చేతినిండా పనిలేక మళ్లీ అవస్థలు పడుతున్నరు. కొందరు పనులు లేక ఆర్థిక సమస్యలతో చనిపోయిన్రు. అదే కేసీఆర్ చెప్పిండు. మళ్లీ కేసీఆర్ సర్కారే వస్తది.
– వేముల వేణు, వార్పిన్ కార్మికుడు (సిరిసిల్ల)