BRS | హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): మూణ్నాలుగు రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం జరుగనున్నది. త్వరలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండటం, రాష్ట్రంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకొన్నది. తెలంగాణ భవన్లో అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతోపాటు పార్టీ ముఖ్యనేతలు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్ఎస్ నేతలే టార్గెట్గా సాగుతున్న పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై కసరత్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. అనుసరించాల్సిన కార్యాచరణపై సుదీర్ఘంగా సమాలోచనలు చేస్తున్నారు.
వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, మేధావులు, సహచర ఉద్యమకారులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ మాజీ సభ్యులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ మాజీ సభ్యులు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులతో పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై విస్తృతంగా సమాలోచనలు చేస్తున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. వారి నుంచి సూచనల సమహారాన్ని త్వరలో నిర్వహించనున్న సమావేశం ముందు ఉంచి, వాటిపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సమావేశంపై నేడో, రేపో అధికారిక సమాచారం వెలువడే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.