కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యిలెక్క అప్పజెప్తే అంతా ఆగమాగం, అడివడివి చేసిండ్రు. భగీరథ నీళ్లురావు, కరెంటు సక్కగ ఇయ్యరు. రైతుబంధు రాదు, యూరియా ఇయ్యశాతగాదు. మంచిమాటకు వినకపోతే లాగులు పలిగేదాకా ఉరికించాలె.. కాకికి పెడుదామంటే కంకెడు లేవు.. పిట్టకు పెడుదామంటే పిడికెడు లేవు. ఇదీ రాష్ట్రంలో పరిస్థితి. ఎవరిని కదిలించినా ఏడుపే! మూసీని బాగుచేయాల్సిందే. కానీ ఈ సర్కార్ చేస్తున్నది ప్రజల కోసం కాదు.. మూసీ పక్కన రియల్ఎస్టేట్ దందా.. పేదల ఇండ్లు కూల్చడమే హైడ్రా పని.. అధికారంలోకి రాగానే మొదటి సంతకంతోనే హైడ్రాను ఎత్తి చెరువుల పడేస్తం! – కేసీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : ‘నేను చావను కొడకా..! చివరిదాకా తెలంగాణకు సేవచేస్తా’ అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గర్జించారు. కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యిలా ఉన్న రాష్ర్టాన్ని అప్పజెప్తే.. కాంగ్రెస్ ఆగమాగం చేసిందని ఆయన మండిపడ్డారు. హామీలు వదిలేసి, స్కాముల్లో మునిగిన కాంగ్రెస్‌ను లాగులు పగిలేదాకా ఉరికించాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరిక సందర్భంగా సోమవారం జగిత్యాలలో నిర్వహించిన ‘ప్రజాఆశీర్వాద బహిరంగసభ’ లో కాంగ్రెస్ పాలనపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. అశేష జనవాహిని మధ్య.. 40 నిమిషాలపాటు సాగిన ఆయన ప్రసంగం ఆద్యంతం నిప్పులవానలా సాగింది. తెలంగాణ దురవస్థను, కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతను ఎత్తిచూపారు. ఉద్యమం నాటి గోసను, ప్రస్తుతం వివిధ వర్గాలు కంటితడి పెడుతున్న తీరును వివరిస్తూ కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. కాంగ్రెస్ నేతల చెత్తమాటలను చీల్చిచెండాడారు. పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగపడదని హెచ్చరించారు. తెలంగాణ కోసం తన యుద్ధం కొనసాగుతుందని ప్రకటించారు. ‘సమైక్య పాలనలో తెలంగాణ చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉండె. అప్పటి ప్రజల గోస చూస్తే దుఃఖం వస్తుండె’ అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ‘నాడు ఎమ్మెల్యేలుగా ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి. అంతా ఆగమాగం, అడివిడివి! ఎట్లుండె తెలంగాణ మనం జూడలేదా? తెలంగాణ రాకముందు ఎంత భయంకరమైన బాధలు.. ఎంత కష్టం ఉండె. ఎవడన్నా తెలంగాణ అని మాట్లాడేటోడు ఉండెనా? అసెంబ్లీలో ప్రణయ్ భాసర్ అని వరంగల్ ఎమ్మెల్యే తెలంగాణ అని మాట్లాడబోతే.. అసెంబ్లీలో తెలంగాణ అనొద్దని నిషేధం విధించిండ్రు. అంత భయంకరమైన వివక్షను ఎదుర్కొన్నం’ అని కేసీఆర్ గుర్తుచేశారు.
భారీగా వలసలు పోయిండ్రు
నాడు తెలంగాణ ప్రాంతంలో ఉపాధి కరువై అనేక ప్రాంతాల నుంచి ప్రజలు వలసలు పోయారని కేసీఆర్ తెలిపారు. ‘ఎస్సారెస్పీ కాలువ ఉన్నటువంటి మెట్పల్లి, జగిత్యాల ప్రాంతాల నుంచి కూడా దుబాయ్, బొంబాయికి వలసలు పోయిండ్రు. పాలమూరు జిల్లా అయితే భయంకరమైన వలసలు ఉన్నయి. ఇక్కడి బాధలు చూసి దుఃఖం వచ్చేది. బాధ కలిగేది. ఆవేశం రగిలేది. మహబూబ్‌నగర్ జిల్లాలో నూటికి తొంభై మంది యువకులు వలసలు పోయిండ్రు. బతకాలంటే బతుక పోవాలె. ఆడ బతుకు లేదు. ఉన్న ముసలోళ్లకు డబ్బులు వాళ్లు పంపిస్తే, వాళ్లు కంట్రోల్ బియ్యం కొనుకొని తిని బతకాలె. కొన్ని పార్టీల వాళ్లు తామేదో గొప్పతనం చేశామన్నట్టు గంజి కేంద్రాలు పెట్టిండ్రు. గుండెలు రగిలిపోయినయ్. నా తెలంగాణల గంజి కేంద్రాలా? అంటే ఎవడో గంజి పోస్తే బతకాలన్నట్టు! అంత అధ్వాన స్థితికి తెలంగాణను దిగజార్చిండ్రు. అది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, టీడీపీ ప్రభుత్వం కావచ్చు! తీయటి పుల్లటి మాటలు చెప్పడం తప్ప చుక నీళ్లు తెచ్చి ఇయ్యలే. నాడు మంచి నీళ్లు ఇయ్యలే.. కడుపునిండా కరెంట్ ఇయ్యలే.. ఏదీ లేదు. అంతా వట్టిదే గ్యాస్. మాటలు చెప్పుడు, మోసం చేసి పోవుడు! మన దగ్గర అడిగే నాయకుడు లేడు. నిలదీసే వాడు లేడు. అందరూ కట్టుబానిసలైపోయిండ్రు’ అని వాపోయారు.
పక్షిలెక్క తెలంగాణ మొత్తం తిరిగిన
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఎంతలా ఆరాటపడ్డారో.. ఊరూరూ తిరిగి ఎలా చైతన్యం రగిలించారో గుర్తుచేసుకున్నారు. ‘నాడు నేను ఒక్కడినే బయలుదేరితే ఎకిరించుడు. వీడు బక పలుచని కేసీఆర్ గాడు అని ఒకడు.. బొందపెట్టి చంపేస్తం అని ఒకడు మాట్లాడుడు. ఇది మగల పుట్టింది, పుబ్బల పోతది అని ఇంకోడు మాట్లాడుడు. యాడికెళ్లి అయితదిరా బై తెలంగాణ? వీడు దుకాణం పెట్టినాడు అని ఇంకొకడు అనుడు. నానా రకాలుగా అవమానపు మాటలు మాట్లాడిండ్రు. కానీ, మొకవోని ధైర్యం, చిత్తశుద్ధితో బయలుదేరి పోరాటం చేసినం. ప్రజలు జమైతా పోయిండ్రు. మీ అందరికీ తెలుసు. ఇదే జగిత్యాల, కోరుట్ల, చొప్పదండికి ఎన్నో సార్లు వచ్చిన. తిరుగని ఊరే లేదు. తిరుగని మండలాలు లేవు. అట్లా పక్షిలెక్క మొత్తం తెలంగాణ అంతటా తిరిగి విశ్వ ప్రయత్నం చేస్తే ఒక పెద్ద ఉద్యమ కెరటం తయారైంది. మేము ఇస్తం తెలంగాణ అని కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టింది. ఎవడిస్తే ఏంది అనే పద్ధతితోని కాంగ్రెస్‌తో జట్టు కట్టినం.. గెలిచినం. అమాంతంగా నేను తెలంగాణను లేవట్కపోయి ఢిల్లీల పెట్టిన. రాష్ట్రపతి ప్రసంగంలో వచ్చింది. కామన్ మినిమం ప్రోగ్రాంలో వచ్చింది. ఒక దశకు వచ్చింది. కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా వెనకుపోయి ఎగబెట్టే ప్రయత్నం చేసింది’ అని తెలిపారు.
కేసీఆర్ సచ్చుడో..తెలంగాణ వచ్చుడో..
తెలంగాణ ఉద్యమం కోసం తాను ఎలా బయలుదేరింది.. ‘కేసీఆర్ సచ్చుడో..తెలంగాణ వచ్చుడో’ అనే తెగింపు దాకా ఎలా వచ్చిందో కేసీఆర్ వివరించారు. ‘అప్పుడు రోశయ్య అని ఒకాయన ముఖ్యమంత్రి ఉండె. ఆ రోశయ్య 14 ఎఫ్ అని ఒకటి తీసుకచ్చిండు. హైదరాబాద్ సిటీలో మనోళ్లకు ఇక పోలీస్ ఉద్యోగం, సెప్రాసీ ఉద్యోగం కూడా దొరకదు. అప్పుడు నాకు తిక్కరేగింది. ఉద్యమం నడిపిన నాయకుడిని నేను బతికుండగానే వీళ్లు ఇట్లా 14 ఎఫ్‌లు, 15 ఎఫ్‌లు తెస్తే ఇంకేం మిగులుతది? చావో రేవో తేల్చుకోవాలని చెప్పి ఆరోజే శపథం కట్టిన. సిద్దిపేటలో ఉద్యోగ గర్జన చేసి ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అని పోరాడిన. యాడదాన్కయినా మంచిదే.. దేఖ్ లేంగే అని చెప్పి, శపథం చేసి, ఆనాడు ఆమరణ నిరాహార దీక్షకు బయలుదేరిన. బయలుదేరితే మొత్తం తెలంగాణ అల్లకల్లోలమైంది. వందల, వేల గ్రామాల్లో టెంట్లు, లొల్లులు, పార్లమెంటులో అల్లకల్లోలం.. ప్రజలంతా గందరగోళం చేస్తే అప్పుడు ఒక ప్రకటన ఇచ్చిండ్రు. చిదంబరం వచ్చి ‘తెలంగాణ ఏర్పాటు చేస్తాం దీక్ష బంద్ చెయ్’ అని చెప్పిండు. కేంద్ర హోమ్ మంత్రి చెప్పినాక నమ్మాలి కదా! దీక్ష బంద్ చేసినం. తెల్లారి ఆంధ్రోళ్లు మొత్తం రాజీనామాల డ్రామా.. మూడో రోజుకు మళ్లా వెనకి పోయిండ్రు. మళ్లా అప్పుడు జేఏసీ తయారు చేసి, అన్ని పార్టీలను పెట్టి నానా తంటాలు పడి, మళ్లా ఒక మూడున్నరేండ్లు భయంకరంగ కొట్లాడితే.. మీరందరు ఎకడివారకడ ఆశీర్వచనం ఇస్తే, మీ ప్రేరణతోని.. మీ స్ఫూర్తితోని చివరికి తెలంగాణ రాష్ట్రం వచ్చింది’ అని గుర్తుచేశారు.
రాష్ట్రం వచ్చినంక సమూహంగ కదిలినం
అలుపెరుగని పోరాటంతో తెలంగాణ రాష్ర్టా న్ని సాధించి, అధికారంలోకి వచ్చాక రాష్ట్ర అభివృద్ధి గురించి ఎంతగా కృషి చేశారో కేసీఆర్ వివరించారు. ‘తెలంగాణ వచ్చింది కదా! వచ్చిన తర్వాత దాని మంచో చెడ్డో చూసే బాధ్యత నాకు అప్పజెప్పిండ్రు. పని మొదలు పెట్టాలి. ఎట్లా? కొత్త కుండల ఈగ సొచ్చినట్టు. దీని ఆర్థికం తెల్వది.. కథ తెల్వది చాలా కష్టమైన, క్లిష్టమైన పరిస్థితి! అంత అల్కటి పని కాదు. ఏం చేయాలె? ఎకడికకడ భయంకరమైన బాధ. చాలా ఇబ్బంది. ఇదే జిల్లాలో చొప్పదండి మండలంలో జీఆర్ రెడ్డి గారనిచెప్పి పెద్ద ఆర్థిక శాస్త్రవేత్త. ఆయన బీహార్‌లో పని చేస్తా ఉండె. నేనే స్వయంగా జీఆర్ రెడ్డి గారికి ఫోన్ చేసి, అన్నా మన సొంత రాష్ట్రం వచ్చింది. మనం బాగు చేసుకోవాలి. మీరు రావాలి అని పిలిపించుకొని, అట్లాంటి వాళ్లందరినీ సమూహ పరుచుకొని ఒక ఎజెండా వేసుకొని బయలుదేరినం’ అని చెప్పారు.
ఇంటింటికీ నీళ్లియ్యకుంటే ఓట్లు అడుగనన్న
ఒకప్పుడు తాగునీటికీ గోసపడ్డ తెలంగాణలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ ఎలా మంచినీళ్లను అందించారో కేసీఆర్ చెప్పుకొచ్చారు. ‘వట్టి మాటలు మాట్లాడటం, గప్పాలు కొట్టడం కాకుండా నేను ఒకటే మాట మిమ్మల్ని అడుగుతున్నా.. శాసనసభలో నిలబడి ఈ రాష్ట్ర చరిత్రలో ఎవడన్న.. ఐదేండ్లలో మిషన్ భగీరథ కంప్లీట్ చేసి, ప్రతి ఇంటికీ నల్లా పెట్టి మంచి నీళ్లు ఇయ్యకపోతే మళ్లా ఓట్లు అడగం’ అని చెప్పిన ముఖ్యమంత్రిని చూసినామా? నేను చెప్పిన ఆ మాట. అసెంబ్లీలో నిలబడి చెప్పి, ఆ ఐదేండ్లలో మిషన్ భగీరథ నీళ్లు తెచ్చి.. 100 శాతం కులం, మతం సంబంధం లేకుండా.. తండాలు, మారుమూల పల్లెలకు కూడా, ప్రతి గ్రామంలోని ప్రతి ఇంట్లో ట్యాప్ పెట్టి మంచి స్వచ్ఛమైన నీళ్లు తెచ్చి ఇచ్చినం. ఐదేండ్లు నడువలేదా? మిషన్ భగీరథ నీళ్లు పుషలంగా రాలేదా? ఏమన్నా రాలేదా? వచ్చినాయా?’ అని ప్రశ్నించగా సభకు వచ్చిన జనాలు ‘వచ్చినయ్’ అంటూ ముక్తకంఠంతో స్పందించారు.
మిషన్ భగీరథ ఎందుకు కుంటుతాంది?
నాడు సాఫీగా ఇంటింటికీ నీటిని అందించిన మిషన్ భగీరథ ఇప్పుడు ఎందుకు కుంటుపడిందని కేసీఆర్ ప్రశ్నించారు. ‘ఇప్పుడు ఏం రోగం పుట్టిందో నాకు అర్థమైతలేదు. ఇప్పుడు మిషన్ భగీరథ ఎందుకు కుంటుతున్నది? ఎందుకు నీళ్లు వస్తలేవు? వస్తున్నాయా ఇప్పు డు నీళ్లు? (జనాల నుంచి స్పందన ‘రావట్లేదు’) మరి ఏం చేయాలె? లాగులు వలిగేదా కా చంపాలె. మంచి మాటకు వినకపోతే ఏం చేస్తరు? మంచిగా కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి కదా? ఐదేండ్లు నడిచింది కదా? మరి మీకేం బీమారి వచ్చిందో నాకు అర్థమైతలేదు. ఇకడ దరిద్రం పోయేదాకా పోరాడాలె. ఇకడ క్షేత్రస్థాయిలో అన్ని వర్గాల ప్రజలు ఇది మా తెలంగాణ, మేము గర్వంగా బతుకుతం, సంతోషంగా బతుకుతం అని తలెత్తుకొని వచ్చేదాకా మనం సేవ చేయాల్సిందే. చివరి శ్వాస దాకా చేయాల్సిందే. అందరం యువకుల్లాగా ముం దుకు దూసుకొని పోదాం. తెలంగాణ ఎట్ల బా గుపడదో చూద్దాం’ అంటూ పిలుపునిచ్చారు.
కరెంట్‌ను కాకెత్తుకపోయిందా?
బీఆర్ఎస్ పాలనలో 24 గంటల పాటు అందిన కరెంట్ ఇప్పటి కాంగ్రెస్ సర్కార్‌లో ఎందుకు రావడం లేదని కేసీఆర్ నిలదీశారు. ‘కరెంట్ సకగుండెనా కేసీఆర్ రాకముందు? నాడు కరెంట్ ఉండెనా? (‘లేదు’ అని జనాల స్పందన). కేసీఆర్ ఉన్న రోజులు మంచిగుండెనా? (‘అవును’ అని జనాల నుంచి స్పందన) మరి మళ్లా ఇప్పుడు ఏం రోగం వచ్చె? ఏం బీమారి వచ్చె? కరెంట్‌ను కాకి ఎత్తుకపోయిందా? ఆనాడు 7,000 మెగావాట్లు ఉంటే.. ఏడాది లోపట మంచిగ చేసి, 24 గంటల కరెంటిచ్చినం. ఒక క్షణం కూడా పోకుండ ఇచ్చినం. ఎప్పుడైనా రిపేర్, టెక్నికల్ ప్రాబ్లం వస్తది తప్ప పోకపోతుండె. అంత మంచి పవర్ సప్లయ్ చేసినం. యాదాద్రి, భద్రాద్రి, చాలా కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణం చేసినం. జనరేటింగ్ స్టేషన్లు పెట్టినం. 20 వేల మెగావాట్లకు తీసుకెళ్లిపోయినం. మరి ఏం రోగం వచ్చింది? ఎందుకు ఇబ్బంది పెడుతున్నరు? అనేక చోట్ల రైతుల పొలాలు ఎండుతున్నయి కదా? పేపర్లలో ఫొటోలు వస్తున్నయి, టీవీల్లో వార్తలు వస్తున్నయి.. జనం ఏడుస్తున్నరు. ఎందుకు ఈ బాధ కలుగుతున్నది? ఇది ఆషామాషీ వ్యవహారం కాదు. ఇది జీవన్మరణ సమస్య.. మన బతుకుదెరువు సమస్య’ అని కాంగ్రెస్ సర్కార్‌ను దునుమాడారు.
కరెంటు అడిగితే బాబు కాల్చి చంపిండు
తెలంగాణలో నాడు కరెంటు కోసం రైతులు ఎంత గోస పడ్డారో కేసీఆర్ వివరించారు. వ్యవసాయానికి విద్యుత్తు కోసం ఆందోళన చేసిన రైతులను నాటి సీఎం చంద్రబాబు నాయుడు కాల్చి చంపారని గుర్తుచేసుకొని ఆవేదన వ్యక్తంచేశారు. ‘తెలంగాణలో అంతటి దయనీ పరిస్థితులు ఉంటే.. మూలిగే నకమీద తాటికాయ పడ్డట్టు ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరెంట్ చార్జీలు భయంకరంగా పెంచిండు. తెల్లారి నేను ఒక ఉత్తరం రాసిన. నీ కరెంట్ చార్జీల పెంపుదల వాపస్ తీసుకో, లేకపోతే ఈ సమైక్య రాష్ట్రంలో న్యాయం జరుగదు. నేను ఉద్యమానికి పోవాల్సి వస్తది. తెలంగాణ కోసం కొట్లాడాల్సి వస్తది అని రాసిన. ఆయన వాపసు తీసుకోలేదు. కొంతమంది రైతులు పాపం పోరాటానికి వచ్చిండ్రు. ఆ పోరాటానికి హైదరాబాద్‌కు నిరసన తెలుపడానికి వస్తే, పట్టపగలు పదకొండున్నర గంటలకు బషీర్‌బాగ్‌లో ఇష్టం వచ్చినట్టు, విచ్చలవిడిగా కాల్పులు జరిపితే.. ముగ్గురు రైతులు అకడికకడే ప్రాణాలొదిలిండ్రు. ఇక లాభం లేదని అప్పుడే నిర్ణయం తీసుకున్న’ అని వివరించారు.
వాళ్లు చెరువులు నాశనం చేస్తే.. మనం బాగు చేసినం
గంగాళంలా ఉన్న చెరువులు ఉమ్మడి పాలనలో తాంబాలంలా ఎలా మారాయో.. వాటిని బీఆర్ఎస్ పాలనలో ఎలా అభివృద్ధి చేశారో కేసీఆర్ వెల్లడించారు. ‘సమైక్య రాష్ట్రంలో మొత్తం తెలంగాణ చెరువులను నాశనం చేసిండ్రు. కాకతీయ రాజులు తవ్వించిన చెరువులు ఉండె మనకు. బ్రహ్మాండంగా 80 వేల చెరువులు ఉండె. ఆంధ్రా పాలకుల సమైక్య పాలనలో మొత్తం నాశనం పట్టిచ్చిండ్రు. కబ్జాలు పెట్టిండ్రు. నాశనం పట్టిచ్చిండ్రు. చివరికి 44 వేల చెరువులు మిగిలినయ్. ఎకడ మొదలు పెట్టాలె? ఎవరి పేరు పెడితే బర్కత్ అయితది? అని ఆలోచించి.. ఏ కాకతీయ రాజులైతే మనకు అన్నం పెట్టిండ్రో, వాళ్ల పేరుతోనే ఇది బాగు చేయాలని చెప్పి మన మొట్టమొదటి కార్యక్రమం మిషన్ కాకతీయ చేపట్టినం. ఆ చెరువుల దరిద్రం వదిలిస్తే, వాటిని బందోబస్తు చేస్తే, వాటిలో నీటి నిల్వ సామర్థ్యం పెరిగితే, గ్రౌండ్ వాటర్ పెరుగుతది. బోర్లకు బాగా నీళ్లు పోస్తయి. తెలంగాణ ప్రజలు, రైతులు దాన్ని ఒక ఉద్యమం లాగానే చేసిండ్రు. మట్టి తీసుకుపోండ్రి సారవంతంగా ఉంటది, మీ పొలాల్లో పోసుకోండ్రి అంటే తెలంగాణ రైతాంగం లక్షల ట్రాక్టర్ల మట్టి తీసుకుపోయిండ్రు. అకడ నుంచి మొదలుపెట్టిన ప్రస్థానం.. పదేండ్లలో ఏం చేసినమో మీరు చూసిండ్రు’ అని తెలిపారు.
పొద్దున లేస్తే కేసీఆర్ సావాలని మాట్లాడుతు న్నరు. పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగిపడతయా? నువ్వు వెయ్యి జన్మలెత్తినా.. నా కొడకా.. నేను సచ్చేదిలేదు! చివరి శ్వాస వరకు తెలంగాణకు సేవ చేస్త.. నేను జీవనన్న కలిసి!
గుంటనక్కలు ఊలలు వేస్తే సింహగర్జన వినపడకుండాపోతదా? అధికారం అండతో కాలు అడ్డుపెడితే కదన కవాతు ఆగిపోతదా?
కేసీఆర్ గళం విప్పితే.. తెలంగాణ మార్మోగదా? కేసీఆర్ దళం కదిలితే జైత్రయాత్ర మొదలవదా? కే..సీ..ఆర్ – ఈ మూడక్షరాల పవర్ ఏందో జగిత్యాలలో కనిపించింది. జనంలో వినిపించింది. మాటను మరఫిరంగిలా పేల్చిండు కేసీఆర్. ప్రజల గోసపై, గోడుపై శివాలెత్తిండు. హామీల వంచనను, స్కాముల పాలనను రప్పా రప్పా అరుసుకున్నడు. మంచి మాటకు వినకపోతే.. లాగులు పలిగేదాకా కాంగ్రెస్‌ను ఉరికించాలని పిలుపునిచ్చిండు. పొద్దునలేస్తే సావును కోరుకునేటోళ్లకు.. వెయ్యి జన్మలెత్తినా తననెవడూ సంపలేడని తేల్చిచెప్పిండు.
ఆ తర్జని ఎందరి వెన్నులోనో వణుకు పుట్టించింది! ఆయన గర్జన ఎన్ని గుండెల్లోనో భరోసా నింపింది! అసమర్థ ప్రభుత్వంపై విరుచుకుపడుతూనే.. అసహాయ ప్రజలకు కేసీఆర్ ఆత్మస్థెర్యాన్నిచ్చారు. మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా ఇవ్వడమే కాదు, వచ్చిన తొలిరోజే హైడ్రాను ఎత్తి అవతలపడేస్తమని ప్రకటించారు. సకల జన సంక్షేమం కోసం తాము చేపట్టిన యాగాన్ని, ఆగం చేసిన అపరాధులెవరని ఆయన మండిపడ్డారు.
కేసీఆర్ ఒక్కో మాటకు జనహోరే జవాబిచ్చింది జగిత్యాల జైకొట్టింది. జేగంట మోగించింది.
తెలంగాణ పునర్నిర్మాణం పునఃప్రారంభం కావాలి. తెలంగాణ దరిద్రం పోయేదాకా.. అన్ని వర్గాల ప్రజలు ఇది మా తెలంగాణ.. గర్వంగా , సంతోషంగా, తలెత్తుకొని బతుకుతం అనే దాకా మనం సేవ చేయాల్సిందే. జగిత్యాల యుద్ధం మీవంతు! తెలంగాణ యుద్ధం మావంతు! జగిత్యాల నుంచే జైత్రయాత్ర.. – కేసీఆర్
ఓట్లు వేసేటప్పుడు నేను చిలుకకు చెప్పినట్టు చెప్పిన. ఉల్టా పల్టా ఎటుపడితే అటు వేయకుర్రయ్యా, దెబ్బ తింటారని చెప్పిన. నా మాట విన్నోడు విన్నడు. విననోడు వినలే. ఈ దుర్మార్గుల గుండెల్లో తడి లేదు. మోసపోతే గోస పడ్తమని చెప్పిన. వీళ్లు గెలిస్తే రైతు బంధుకు రాం రాం, దళితబంధుకు జై భీమ్ అంటరని నాడే చెప్పిన. అయిందా అట్లే? (‘అయింది’ అంటూ ప్రజల స్పందన) పకా ముచ్చటనే అయింది కదా?’
-కేసీఆర్
ఇంతింత పొడుగు మాటలు మాట్లాడుతరా? అడ్డం పొడుగు మాట్లాడుతరా? పొద్దున లేస్తే కేసీఆర్ చావాలి అంటున్నరు. నువ్వు వెయ్యి జన్మలెత్తినా నేను చావను కొడుకా ఏమనుకుంటున్నవో. పిల్లి శాపానికి ఉట్టి తెగుతదా? మరి ఈ వెధవలు కేసీఆర్ చావాలంటే, కేసీఆర్ చస్తాడా? మీ దీవెన, మీ
ఆశీర్వచనం ఉంటే నాకేం కాదు.
-కేసీఆర్
మన భాష మీద దాడి, మన బతుకు మీద దాడి, మన నీళ్ల మీద దాడి, మన ఉద్యోగాల మీద, మన వనరుల మీద, మన ఆస్తుల మీద మొత్తం దోపిడీ చేయడం తప్ప ఇకడి ప్రజలను బికారుల తీరుగ వదిలిపెట్టిండ్రు. రైతాంగం ఆగమాగం అయిపోయి చెట్టుకొకడు పుట్టకొకడు అయిపోయిండు.
-కేసీఆర్
ఎదురు తిరిగితే వీళ్లు కాల్చి చంపుతున్నరు. జెండా ఎత్తడం ఒక్కటే తప్ప మార్గం లేదని చెప్పి ఆనాడు నేను తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన. ఎంబడి ఎవడు వచ్చినా సరే.. రాకపోయినా సరే అనుకున్న.. ప్రజలున్నరు, యువకులున్నరు చూసుకుందాం, దేఖ్ లేంగే అని చెప్పి బయలుదేరిన. -కేసీఆర్