హుజూరాబాద్, సెప్టెంబర్ 1: ‘హుజూరాబాద్ ప్రజలరా మీ ఓటు ఎటు?.. ప్రజలను నమ్ముకున్న టీఆర్ఎస్కా?, ఆస్తులను అమ్ముకునే బీజేపీకా? ఆలోచించుకోండి’ అని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చా రు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలను అమ్ముతున్న బీజేపీ ప్రభుత్వం..చివరికి పంచభూతాలను సైతం కార్పొరేట్లకు తాకట్టుపెట్టేందుకు వెనుకాడబోదేమోనని ఎద్దేవాచేశారు. మద్యం, డబ్బులు పంచాల్సి వస్తే రాజకీయాల్లోంచి తప్పుకుంటానని చెప్పిన ఈటల.. ఇప్పుడు అడ్దదారిలో కుట్టుమిషన్లు, గోడ గడియారాలు, గ్రైండర్లు ఎందుకు పంచుతున్నాడని నిలదీశారు. బుధవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బోర్నపల్లి, దమ్మక్కపేటలో వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం జమ్మికుంటలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ జమ్మికుంట మండల అధ్యక్షుడు కాయిత లింగారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి దమ్ముల రామ్ముర్తితోపాటు సీపీఐ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు 1500 మంది మంత్రుల సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ..సర్కారు అమలుచేస్తున్న పథకాలను వివరిస్తూ విపక్షాలపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. అడ్డదారిలో గెలిచేందుకు ఈటల తాయిలాల ఎరవేస్తున్నాడని ధ్వజమెత్తారు. ప్రజలరా మీ ఓటు గోడ గడయారానికా?.. కేసీఆర్ కిట్టుకా?, కుట్టుమిషన్లకా?.. కల్యాణలక్ష్మికా?, రూపాయి బొట్టు బిళ్లకా?.. ఆసరా పింఛన్లకా?, కుంకుమ భరిణికా?.. రైతుబంధుకా?, సెల్ఫోన్కా?.. రైతు బీమాకా? ఆలోచించుకోవాలని కోరారు. కేసీఆర్ గెలిచాకా రైతుబంధు, రైతుబీమా, దళితబంధులాంటి పథకాలు వచ్చాయని.. కేంద్రంలో బీజేపీ గద్దెనెక్కాకా పెట్రోల్ ధరలు పెరిగాయని చెప్పారు. రైతుబంధువులెవరో? ద్రోహులెవరో గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.
ఏడేండ్లలో ఒక్క ఇల్లు నిర్మించలేదేందుకు?
ఏడేండ్లు మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ హుజూరాబాద్‌లో ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు ఎందుకు నిర్మించలేదో ప్రజలకు చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్‌చేశారు. ప్రభుత్వం 4 వేల ఇండ్లను మంజూరు చేసినా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ గెలిచిన వెంటనే హుజూరాబాద్, జమ్మికుంటలో అసంపూర్తిగా ఉన్న 3 వేల ఇండ్లను నిర్మించి పేదలకు పంచుతామని హామీఇచ్చారు. ఉద్యమ బిడ్డ గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను గెలిపిస్తే ఇచ్చిన ప్రతి హామీని అమలుచేస్తామని ప్రకటించారు. ఆయా కార్యక్ర మాల్లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివా స్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కెళ్లపల్లి రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు.