హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : ‘ఆంధ్రా ప్రాజెక్టులు వైష్ణవాలయాల లెక్క ఉంటే.. తెలంగాణ ప్రాజెక్టులేమో శివాలయాల లెక్క ఉన్నయి’ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) కట్టపై గుత్తా సుఖేందర్‌రెడ్డితో కొన్ని దశాబ్దాల కిందట ఉద్యమ నేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలివి! గోదావరి నది తెలంగాణలోకి ప్రవేశించిన తర్వాత స్వాగతం పలికే తోరణంలా ఉండే ప్రాజెక్టు ఎస్సారెస్పీ! పైగా సాగునీటి ప్రాజెక్టులు అంటే ఆధునిక దేవాలయాలు అన్న జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా దీనికి శిలాఫలకం పడింది. మరి అలాంటి బృహత్తర ప్రాజెక్టు దశాబ్దాల తరబడి ఆకుల్లేని మోడులా.. జలంలేని జలాశయంలా.. ఒక్కమాటలో చెప్పాలంటే ఆదరణ కరువైన శివాలయంలా ఎందుకు మారినట్టు? అసలు కేసీఆర్ వ్యాఖ్యల వెనుక చారిత్రక నేపథ్యం ఏంటిది? నాటి హైదరాబాద్ స్టేట్ ప్రతిపాదనల్లో 20 లక్షల ఎకరాలు.. నెహ్రూ శంకుస్థాపన సమయానికి 16 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో ఏర్పడ్డ ఎస్సారెస్పీకి ఆ దుస్థితి రావడానికి కారణమేంది? ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీ డిజైనింగ్‌లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు అనుభవం ఒక గుణపాఠంగా ఎందుకు మారింది? కాళేశ్వరం ప్రాజెక్టుతో పునరుజ్జీవనం కల్పిస్తే తప్ప ఎస్సారెస్పీ తన లక్ష్యాన్ని ఎందుకు చేరుకోలేకపోయింది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే.. తమ్మిడిహట్టి! కేసీఆర్ ప్రభుత్వం తమ్మిడిహట్టి బరాజ్‌ను నిర్మించి ప్రాణహిత జలాలను మళ్లించినట్టయితే తెలంగాణ సాగునీటి రంగంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులా, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు మరో శివాలయంలా చరిత్ర పుటల్లో నిలిచేది. రాష్ట్ర రైతాంగానికి గుదిబండలా తయారయ్యేది. ఇది నిజం.. ఒక్కసారి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు చారిత్రక నేపథ్యాన్ని చూస్తే తమ్మిడిహట్టి మరో శివాలయం అనేది అక్షర సత్యమని బోధపడుతుంది.
లోపభూయిష్ట ఒప్పందాలకు సాక్షిభూతం ఎస్సారెస్పీ
హైదరాబాద్ స్టేట్‌లోనే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రతిపాదనలు రూపుదిద్దుకున్నాయి. వాస్తవంగా 330 టీఎంసీల గోదావరి జలాలతో 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనేది అప్పటి ప్రతిపాదన. కానీ 1956లో ఏపీ ఏర్పాటుతో ఈ ప్రాజెక్టు అనేక మలుపులు తిరిగింది. చివరికి 1963లో అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అనంతరం పుష్కర కాలానికి అంటే 1975, అక్టోబర్ 6న ఎస్సారెస్పీ కోసం మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకున్నారు. ఇందులో ప్రధానంగా మహారాష్ట్రలో అప్పటివరకు 79 టీఎంసీల మేర ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులు చేపడుతున్నారని, వీటికి అదనంగా 60 టీఎంసీల మేర కొత్త ప్రాజెక్టులు కట్టుకోవచ్చని పొందుపర్చారు. 75 శాతం డిపెండబులిటీపై శ్రీరాంసాగర్ వద్ద సుమారు 156 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని, ఈ క్రమంలో 112 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో జలాశయాన్ని నిర్మించి, 196 టీఎంసీలను వినియోగించుకునేలా డిజైన్ చేశారు.
తద్వారా 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్టు డీపీఆర్‌లో పొందుపర్చారు. గోదావరి నది మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి ప్రవేశించిన తర్వాత 764వ కిలోమీటరు వద్ద 1091 అడుగుల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో 112 టీఎంసీల సామర్థ్యంతో ఎస్సారెస్పీ రిజర్వాయర్ నిర్మించారు. ఎస్సారెస్పీ స్టేజీ-1 కింద నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో 9.69 లక్షల ఎకరాలకు నీళ్లందించేందుకు పనులు చేపట్టారు. కానీ అంతర్రాష్ట్ర ఒప్పందం జరిగిన ఆరేడు సంవత్సరాల్లోనే మహారాష్ట్ర ఆన్‌గోయింగ్ ప్రాజెక్టు సామర్థ్యం 79 టీఎంసీల నుంచి 102 టీఎంసీలకు పెరిగింది. అంటే ఎస్సారెస్పీ వద్ద నీటి లభ్యతలో 23 టీఎంసీల కోత పడినట్టయింది. కానీ ఈ విషయాన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు.
వరుస బరాజ్‌లతో గోదావరి ‘మహా’ అడ్డుకట్ట
మహారాష్ట్ర కేవలం బాబ్లీతోనే ఆగలేదు.. శ్రీరాంసాగర్‌పై చేసుకున్న ఒప్పందంలో ఎలాగూ 60 టీఎంసీలతో కొత్త ప్రాజెక్టులు కట్టుకోవచ్చని ఉన్నందున విష్ణుపురి (సింధ్పానే), పూర్ణ, మానేరు, లెండి వ్యాలీల్లో ఇబ్బడిముబ్బడిగా ప్రాజెక్టులు నిర్మించింది. వరుస బరాజ్‌లతో గోదావరి జలాలను బంధించింది. ప్రధాన నదిపై ఆపెగావ్, హిర్వాపురో, జోగులాదేవి, మంగ్రూల్, రాజాటక్లీ, లోనీసాంగ్లీ, దాలెగావ్, ముడుగల్, ములీ, డిక్రాస్, విష్ణుపురి, దేవాపూర్, బాబ్లీ.. ఇలా ఇబ్బడిముబ్బడిగా ప్రాజెక్టులు నిర్మించింది.
దీంతో ఎస్సారెస్పీకి నీటి లభ్యతలో భారీ కోత పడటమే కాకుండా వరద రోజులు భారీ ఎత్తున పడిపోయాయి. అందుకే ఇప్పటికీ శ్రీరాంసాగర్ జలాశయానికి వరదలు రోజుల వ్యవధికే పరిమితమై జలాశయం నిండగానే దిగువకు వదలిపెట్టడం తప్పని పరిస్థితి అయ్యింది. ఆపై వచ్చే మోస్తరు వరదలు ఎగువన మహారాష్ట్ర ప్రాజెక్టులకే పరిమితమవుతున్నాయి. ఒప్పందం.. ప్రాజెక్టు డిజైన్ సమయంలో అప్రమత్తంగా లేకపోవడంతో జరిగిన చారిత్రక నష్టాన్ని పూడ్చుకునేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బాబ్లీపై సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఎట్టకేలకు సుప్రీం జూన్ నుంచి అక్టోబర్ వరకు గేట్లు ఎత్తి ఉంచాలని (తొలుత వచ్చే వరద దిగువకు వచ్చేందుకు) ఆపై నవంబర్ నుంచి గేట్లు మూసివేయాలని ఆదేశించింది. అందుకే అక్టోబర్ తర్వాత ఎస్సారెస్పీకి వరద అనేది దాదాపుగా రావడం లేదు.
శివాలయంలా ఎస్సారెస్పీ
లోపభూయిష్టమైన అంతర్ రాష్ట్ర ఒప్పందం.. డిజైన్ లోపాలు.. నీటి లభ్యతను లెక్క గట్టడంలో విఫలం.. చివరికి పనులను దశాబ్దాల పాటు కొనసాగించడం.. ఇదీ ఎస్సారెస్పీపై కాంగ్రెస్ ప్రభుత్వాల తీరు! దాని ఫలితంగానే ఎస్సారెస్పీ ఒక శివాలయంగా తయారైంది. కానీ ఇవేవీ పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సారెస్పీ రెండో దశ కింద 284 కిలోమీటర్ల కాకతీయ కాలువను 346 కిలోమీటర్లకు పొడగించింది. దీని ద్వారా వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో 4.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ప్రకటించింది. రెండో దశ పనులు తెలంగాణ ఏర్పడేనాటికి కూడా పూర్తవలేదు. పైగా రెండో దశ పనులు పూర్తి కాకముందే మొదటి దశలో నిర్మించిన కాకతీయ కాల్వ శిథిలావస్థకు చేరింది.
అందుకే శ్రీరాంసాగర్ రెండు దశల్లో 14 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని ఉన్నా ఏ సంవత్సరం కూడా నాలుగైదు లక్షల ఎకరాలకు మించి సాగయిన దాఖలాల్లేవు. అందుకే ఎస్సారెస్పీ డిజైన్‌లో నీటి వినియోగం 196 టీఎంసీలుగా ఉన్నా ఏ ఒక్క సంవత్సరంలోనూ వినియోగం 120-130 టీఎంసీలకు మించలేదు. చివరికి కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ఎస్సారెస్పీకి పునరుజ్జీవనం పోసింది. దాని ఫలితంగానే 2019 నుంచి ఇప్పటిదాకా ఎస్సారెస్పీ కింద ఉన్న 14 లక్షల డిజైన్ ఆయకట్టుతో పాటు గ్యాప్, కొత్త ఆయకట్టు కలుపుకొని 20 లక్షల ఎకరాల దాకా సాగులోకి వచ్చింది.
‘ప్రాణహిత-చేవెళ్ల’లోనూ అవే లోపాలు
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ఉమ్మడి ఏపీలోని కాంగ్రెస్ ప్రభుత్వం తమ్మిడిహట్టి వద్ద 165 టీఎంసీల నీటి లభ్యతను లెక్కించింది. దాని ప్రకారమే కేంద్ర జల సంఘానికి డీపీఆర్ సమర్పించింది. కానీ 2015 మార్చిలో కేంద్ర జల సంఘం తెలంగాణ ప్రభుత్వానికి పంపిన లేఖలో తమ్మిడిహట్టి వద్ద 165 టీఎంసీల నీటి లభ్యత నిజమేనని పేర్కొన్నారు. కానీ అందులో మహారాష్ట్రకు హక్కుభుక్తంగా బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపుల్లోని 63 టీఎంసీలు కూడా కలిసి ఉన్నాయని స్పష్టం చేశారు. అంటే తదుపరి ఏక్షణంలోనైనా మహారాష్ట్ర 63 టీఎంసీలను అంచెలంచెలుగా వాడుకునే అవకాశం ఉండటమే కాదు.. ట్రిబ్యునల్ కేటాయింపు జరిగినా వాడుకునే అధికారం ఉన్నదని హెచ్చరించారు. ఆ మేరకు తమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యతలో కోత పడి 102 టీఎంసీలే తేలిందని మున్ముందు జరిగే ముప్పును సూచించింది.
సరిగ్గా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు విషయంలో కూడా మహారాష్ట్రతో ఇదే అనుభవం ఎదురైంది. లోపభూయిష్టమైన ఒప్పందాన్ని ఆసరాగా చేసుకొని ఉమ్మడి ఏపీ వెసులుబాటు కల్పించిన 60 టీఎంసీల కంటే ఎక్కువ సామర్థ్యంతోనే ప్రాజెక్టులను నిర్మించుకున్నది. తమ్మిడిహట్టి విషయంలోనూ అదే తప్పును చేయడమంటే తెలంగాణ సాధించుకున్న ఫలితమేముంటుంది? అందుకే ఎస్సారెస్పీ ఒక గుణపాఠంగానే కేసీఆర్ ప్రభుత్వం.. కేంద్ర జల సంఘం హెచ్చరికతో తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు బరాజ్‌ను మార్చాల్సి వచ్చింది. ఇదేకాదు.. నిజాంసాగర్, సింగూరులాంటి ప్రాజెక్టులు కూడా ఇదే కోవలోకి వస్తాయి. ఏండ్ల తరబడి ఆ ప్రాజెక్టులు వట్టిపోవడానికి కారణం కూడా ఎగువ రాష్ర్టాలు నిర్మించిన ప్రాజెక్టులతో డిజైన్ సమయంలో లెక్కించిన నీటి లభ్యతకు భారీ గండి పడటమే! ఇవన్నీ విస్మరించి కేసీఆర్ ప్రభుత్వం తమ్మిడిహట్టి వద్దనే బరాజ్ నిర్మించి ఉంటే తెలంగాణ రైతుల భవిష్యత్తు మహారాష్ట్ర దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉండేది.
కల్వకుర్తినీ భష్టుపట్టించిన కాంగ్రెస్
పాత పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి ప్రాజెక్టును చూడండి.. ఇప్పుడు ఐదు లక్షల ఎకరాల ఆయకట్టు దానిపై ఆధారపడి ఉన్నది. కానీ జలయజ్ఞంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన రిజర్వాయర్ల సామర్థ్యం ఎంతో తెలుసా?! కేవలం 3.8 టీఎంసీలు! పైగా ప్రాజెక్టులో ఉన్న ఐదు మోటర్లతో 4 వేల క్యూసెక్కులను ఎత్తిపోయొచ్చు. కానీ ప్రధాన కాల్వ ప్రవాహ సామర్థ్యం 3200 క్యూసెక్కులే! ఇలా చెప్పుకుంటూ పోతే జూరాల, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు, భీమా అన్ని ప్రాజెక్టుల డిజైన్లు లోపభూయిష్టమే! అందుకే కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎస్సారెస్పీకి ఎలా పునరుజ్జీవనం కల్పించారో కల్వకుర్తి ప్రాజెక్టు ఆయకట్టుకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా జీవం పోసేందుకు కేసీఆర్ ప్రభుత్వం రీ డిజైనింగ్ చేసింది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో అన్ని రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం కేవలం 11.4 టీఎంసీలు! ఇంత తక్కువ నిల్వతో 16 లక్షల ఎకరాలకు సాగునీరు ఎలా అందిస్తారని కేంద్ర జల సంఘమే ప్రశ్నించింది. డిజైన్లోనే లోపమున్నదని, రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పెంచుకోవాలని సూచించింది. గత అనుభవాలు, కేంద్ర జల సంఘం సూచనల మేరకు కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరంలో నిల్వ సామర్థ్యాన్ని ఏకంగా 141 టీఎంసీలకు పెంచింది. కానీ దీన్ని కూడా కాంగ్రెస్ నేతలు తప్పుబడుతున్నారు. ప్రాణహిత-చేవెళ్లలో లెక్కనే నిల్వ సామర్థ్యం 11.4 టీఎంసీలు ఉంచకుండా ఎందుకు పెంచారు? దాని వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టులో అంచనా వ్యయం పెరిగింది కదా?! అని తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టుగా వాదిస్తున్నారు. ‘తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల్లో సమైక్య పాలకులు అవలంబించిన ఆ విధానమే సరైనదనేది ఇప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ నేతల మెదళ్లలో నాటుకుపోయింది. ఏడాదిన్నరగా వాళ్ల పాలన తీరు కూడా అలాగే ఉన్నది.
కొసమెరుపు: మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణలో నిన్నటిదాకా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ ఎన్డీఎస్ఏ ఏది చెప్తే అది వింటాం అన్నారు. అంటే తమ నిర్ణయాలకు ఎన్డీఎస్ఏనే ప్రామాణికమని స్పష్టం చేశారు. వాస్తవానికి కేంద్ర జల సంఘంలో ఎన్డీఎస్ఏ ఒక విభాగం. 2015లో కేసీఆర్ ప్రభుత్వం కేంద్ర జల సంఘం చెప్పినట్టే విన్నది. ఆ మేరకు రీ డిజైనింగ్‌తో నీటి లభ్యతలేని తమ్మిడిహట్టిని మార్చింది.. రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పెంచుకున్నది. అలాంటప్పుడు ఎన్డీఎస్ఏ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రామాణికమైనప్పుడు సీడబ్ల్యూసీ సూచనలు అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వానికి ప్రామాణికం కావా? రాజకీయ డ్రామాలో ఈ లాజిక్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా మిస్ మిస్సయింది?
కీలక అంశాన్ని వదిలి కాంగ్రెస్ వాదనలు
‘తమ్మిడిహట్టి వద్ద 165 టీఎసీంల నీటి లభ్యత ఉన్నది. అక్కడ నీళ్లు లేవనడం అంతా అబద్ధం. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారు’ అంటూ ఇప్పటికీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వాదిస్తున్నది. ప్రధానంగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పదేపదే తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత ఉన్నందున ఆ ప్రాజెక్టును చేపట్టి తీరుతామంటూ సవాళ్లు విసురుగుతున్నారు. నిజమే.. 2015 వరకు తమ్మిడిహట్టి దగ్గర 165 టీఎంసీల నీటి లభ్యత ఉన్నదని అప్పట్లోనే కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తన లేఖలోనే తేల్చి చెప్పింది. ఇందులో ఎవరికీ సందేహం లేదు. కానీ అదే లేఖలో అత్యంత కీలకమైన హెచ్చరిక కూడా ఉన్నది. దానికి ఉత్తమ్ సహా ప్రభుత్వ పెద్దలెవరూ ఉద్దేశపూర్వకంగానే ప్రాధాన్యత కల్పించడం లేదు. ఎందుకంటే అలాంటి కీలక అంశాన్ని విస్మరించి సాగునీటి ప్రాజెక్టులను నిర్మించడం కాంగ్రెస్‌కు అలవాటు.. తెలంగాణకు గ్రహపాటు అని చరిత్ర చెప్తున్నది. అందుకు నిలువెత్తు నిదర్శనమే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు!
నానాటికీ పడిపోయిన శ్రీరాంసాగర్ నిల్వ సామర్థ్యం
మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు.. ఎస్సారెస్పీ నీటి లభ్యతలోనే భారీ కోత పడటం ఒక వంతైతే రిజర్వాయర్ సామర్థ్యం కూడా గణనీయంగా పడిపోవడం ఇంకో వంతు! ఇందుకు డిజైన్ లోపమే కారణమని సాగునీటి రంగ నిపుణులు చెప్తున్నారు. 1970లో ఎస్సారెస్పీ జలాశయంలో నీళ్లు నిల్వ చేయడం మొదలుపెట్టి.. 1984లో క్రస్ట్ గేట్లు ఏర్పాటు చేశారు. అంటే ప్రాజెక్టు శంకుస్థాపన జరిగిన రెండు దశాబ్దాల తర్వాత ఎస్సారెస్పీని నింపారు. ఆతర్వాత 1994లో ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ (ఏపీఈఆర్‌ఎల్) హైడ్రోగ్రాఫిక్ సర్వే చేయగా ఎస్సారెస్పీ నీటి నిల్వ సామర్థ్యం 112 టీఎంసీల నుంచి 90.30 టీఎంసీలకు పడిపోయినట్టుగా తేలింది. 2013 డిసెంబర్ – 2014 జనవరిల్లో అధునాతనమైన ఇంటిగ్రేటెడ్ బోట్ మౌంటెడ్ బాతిమెట్రిక్ సర్వే (ఐబీఎస్) విధానంతో హైడ్రోగ్రాఫిక్ సర్వే నిర్వహించగా రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం ఏకంగా 80.104 టీఎంసీలకు పడిపోయినట్టుగా తేలింది. అంటే వాస్తవ సామర్థ్యం 102 టీఎంసీల నుంచి 80.104 టీఎంసీలకు… 31.912 టీఎంసీలు (28.48 శాతం) తగ్గినట్టు గుర్తించారు.
లొసుగులతో జాడిచ్చి కొట్టిన మహారాష్ట్ర
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుపై మహారాష్ట్రతో జరిగిన అంతర్రాష్ట్ర ఒప్పందంలో ఎఫ్‌ఆర్‌ఎల్‌ను 1091 అడుగులుగా పొందుపర్చారు. ఆ మేరకు మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూభాగంలో ఉన్న డ్యాంలు, రోడ్లు ఇతరాలన్నింటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించింది. కానీ మహారాష్ట్ర తన ముంపు భాగంలో ఎంత నీరు వినియోగించుకోవాలనే కీలకమైన అంశాన్ని ఒప్పందంలో పొందుపర్చలేదు. అదే పోలవరం ప్రాజెక్టు ఒప్పందాన్ని పరిశీలిస్తే 1978, డిసెంబర్ 15న ఒడిశాతో జరిగిన అంతర్రాష్ట్ర ఒప్పందంలో ఎలాంటి వ్యయం లేకుండా ఒడిశా ఐదు టీఎంసీలు, 1978, ఆగస్టు 7న మధ్యప్రదేశ్‌తో చేసుకున్నపుడు ఎలాంటి వ్యయం లేకుండానే ఆ రాష్ట్రం (ఇప్పుడు ఛత్తీస్‌గఢ్) 1.5 టీఎంసీల నీటిని లిఫ్టు చేసుకోవచ్చని స్పష్టంగా పొందుపర్చారు. తద్వారా ముంపు ప్రాంతంలో ఆయా రాష్ర్టాలు అంతమేర మాత్రమే నీటిని వినియోగించుకుంటాయి. కానీ ఎస్సారెస్పీకి సంబంధించి మహారాష్ట్ర ఒప్పందంలో ఆ విషయం లేకపోవడంతో మహారాష్ట్ర తన ఇష్టానుసారంగా ప్రాజెక్టులు నిర్మించుకునేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టయింది. అందుకే ఏకంగా శ్రీరాంసాగర్ రిజర్వాయర్ ఎఫ్ఆర్ఎల్లోనే బాబ్లీ ప్రాజెక్టును నిర్మించింది. ఇదేమంటే ముంపునకు అంగీకరించామేగానీ తమ భూభాగాన్ని తాము వినియోగించుకునే స్వేచ్ఛ ఒప్పందంలో ఉన్నది కదా! పైగా ఇంత మొత్తం నీళ్లు వాడుకోవాలనేది ఒప్పందంలో లేదు కదా! అని మహారాష్ట్ర ఎదురు ప్రశ్నించే పరిస్థితి ఏర్పడింది.