Revanth Reddy | హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్టుగా ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును మొదలు పెట్టింది. క్షేత్రస్థాయి పరిస్థితులను పట్టించుకోకుండా, ఎలాంటి అధ్యయనాలు చేయించకుండా, ప్రచారం కోసం పనులు చేపట్టింది ఆ పార్టీనే. ఫలితంగా సొరంగం కుప్పకూలింది. ప్రమాదం వాటిల్లింది. అయినా ప్రమాదం జరగడానికి కారణం కేసీఆర్ అంటూ నిందారోపణలు చేయడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు, బీఆర్ఎస్ హయాంలో సొరంగం పనులేమీ చేయలేదంటూనే, మరోవైపు ప్రమాదానికి కారణం ఆ పార్టీనే అంటూ విరుద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎస్ఎల్బీసీ ఇన్లెట్ సొరంగం 13.93 కిలోమీటర్ వద్ద కూలిపోవడంతో ఎనిమిది మంది అందులో చిక్కుకుపోయిన విషయం విదితమే.
నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద సంఘటన స్థలాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆదివారం సందర్శించారు. రెస్యూ ఆపరేషన్‌ను సమీక్షించారు. అనంతరం మీడియాతో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడివే చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ ఏర్పాటు తరువాత బీఆర్ఎస్ హయాంలో టన్నెల్ పనులను నిర్లక్ష్యం చేశారని, నిధులను విడుదల చేయలేదని, విద్యుత్తు బకాయిలు చెల్లించలేదంటూ పచ్చి అబద్ధాలు వల్లెవేశారు. వాస్తవానికి, బీఆర్ఎస్ హయాంలో టన్నెల్ పనులు 11.48 కిలోమీటర్లు పూర్తి చేశారు.
సీపేజీ పెరిగిందని, పనులు చేయలేమని కాంట్రాక్టు సంస్థ చేతులెత్తేయడంతో సదరు ఏజెన్సీకి అప్పటివరకు చెల్లిస్తున్న డీవాటరింగ్ చార్జీలను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే సవరించింది. కాంట్రాక్టు సంస్థ కరెంటు బిల్లులు సక్రమంగా చెల్లించకపోవడంతో విద్యుత్తు సంస్థలు కరెంటు కట్ చేశాయి. ఆ సమయంలోనూ కేసీఆర్ ప్రత్యేక చొరవచూపి కాంట్రాక్టు ఏజెన్సీ చెల్లించే కరెంటు బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుందని విద్యుత్తు సంస్థలకు తేల్చిచెప్పారు.
ఆ బిల్లును ఏజెన్సీకి చెల్లించే బిల్లుల నుంచి మినహాయించుకుంటుందని, కరెంటు సరఫరాను ఎట్టి పరిస్థితుల్లోనూ కట్ చేయవద్దని టీఎస్ఎస్పీడీసీఎల్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడమేకాదు, ప్రాజెక్టుల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఆ అంశాన్ని క్యాబినెట్లో పెట్టి ఆమోదింపజేశారు. తెలంగాణ ఏర్పడే వరకు కాంగ్రెస్ హయాంలో అంటే 2014 జూన్ వరకు కేవలం టన్నెల్ పనుల కోసం రూ.1,279.04 కోట్లను వెచ్చించగా, తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ సర్కారు తొమ్మిదిన్నరేండ్లలో రూ.1,364.46 కోట్లు ఖర్చుచేసింది.
అవన్నీ కూడా ప్రభుత్వ నివేదికలే. పనులు పురోగతికి సంబంధించి అధికారులు నివేదించిన అంశాలే. శ్రీశైలం వరద, కరోనా, టీబీఎం సాంకేతిక లోపాలతో పనులు నిలిచాయే తప్ప ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ హయాంలో ఎప్పుడూ పనులు ఆగిపోలేదు. అయినప్పటికీ పనులు నిలిచిపోయాయని పచ్చి అబద్ధాలను ప్రచారం చేయడం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికే చెల్లిందని రాజకీయ విశ్లేషకులు, తెలంగాణవాదులు విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండీ అబద్ధాలు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఇదిలా ఉంటే అమెరికా నుంచి నిపుణులను, మిషనరీకి సంబంధించి స్పేర్‌పార్ట్స్‌ను రప్పించి టీబీఎంను పునరుద్ధరించి ప్రాజెక్టు పనులను పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టామని, తాము చిత్తశుద్ధితో పనిచేస్తుంటే అనుకోకుండా ఈ దుర్ఘటన జరిగిందని, అనుకొని ప్రమాదమంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించిన విషయాలు పచ్చి అబద్ధాలని ఇంజినీర్లు చెప్తున్నారు. వాస్తవంగా అవుట్లెట్ టన్నెల్‌లోని టీబీఎంకు సంబంధించిన బేరింగ్ పాడైపోయింది. దీంతో అక్కడ పనులు నిలిచిపోయాయి. బేరింగ్‌ను అమెరికా నుంచి తెప్పిస్తున్నారు. ఇప్పటికీ అది రాష్ర్టానికి రాలేదు. బేరింగ్ అంశమై చర్చించేందుకు మంత్రి కోమటిరెడ్డి అమెరికా వెళ్లారు. కానీ, మిషన్ తెప్పించి పనులు చేస్తున్నామని అబద్ధాలు చెప్తుండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి.