వరంగల్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ నీటివాటాలో మళ్లీ దొంగలు పడ్డారు. ఉమ్మడి పాలనలో దాదాపు ఆరు దశాబ్దాలపాటు దోపిడీకి గురైన తెలంగాణ జల వనరులకు తిరిగి ప్రమాదం పొంచి ఉన్నది. అరవై ఏండ్ల ‘ఉమ్మడి పాలకుల’ కుట్రలకు వలవలా ఏడ్చిన తెలంగాణ రైతన్న కన్నీటిని కేసీఆర్ పాలన దూరం చేసింది. పదేండ్లు దర్జాగా బతికిన మన రైతుకు రేవంత్ పాలన మళ్లీ కన్నీటిని కానుకగా ఇచ్చేందుకు సిద్ధపడింది. గురుశిష్యుల పాలన.. బడేభాయ్.. చోటేభాయ్ బంధాలు వెరసి తెలంగాణ నీటిబంధాన్ని తెగ్గొట్టేందుకు చూస్తున్నాయి. జల వాటాలపై మళ్లీ కుట్రలు మొదలయ్యాయి.
ఈ నేపథ్యంలో ఉద్యమ నాయకుడు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరో జలపోరాటానికి సిద్ధం అవుతున్నారా? అంటే, జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. ఆదివారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరుగనున్నది. ఈ సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ మరో జలసాధన ఉద్యమ కార్యాచరణకు పిలుపునిచ్చే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఆ కూటమి చేసే కనుసైగలకు ‘జీ..! హుజూర్’గా చలామణి అయ్యే రాష్ట్ర పాలకుల నిర్లక్ష్యం వెరసి మరోజలసాధన ఉద్యమం చేయక తప్పని అనివార్య పరిస్థితులు సృష్టించాయి. ఈ క్రమంలోనే తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించే సమావేశానికి ప్రాధాన్యత పెరిగింది.
నవంబర్ 25, 2002 నుంచి జనవరి 6వ తేదీ 2003 దాకా 45 రోజులు తెలంగాణ అంతటా ఏ నోట విన్నా ‘జల’ కొలుపులే అనే రీతిలో నాడు ఉద్యమనేతగా కేసీఆర్ జలసాధన ఉద్యమాన్ని నడిపారు. ఇచ్చంపల్లి పోయింది. పోచంపాడు పోయింది. నందికొండ ప్రాజెక్టు ఇలా అన్నీ ఎట్లా కిందికి పరుగులు తీశాయి? ఏలేశ్వరంలో కట్టాల్సిన నాగార్జునసాగర్ మరోచోటుకు ఎందుకు మారింది? ఖమ్మం గార్ల బయ్యారం మీదుగా వెళ్లాల్సిన నాగార్జున సాగర్ కాలువ మధ్యలో ఎట్లా కట్ కొట్టారు? ఇటువంటి అనేక విషయాలను కేసీఆర్ ఊరూరా తిరిగి ప్రజలకు వివరించారు.
మే 20, 2003న శక్తిపీఠమైన జోగుళాంబ అమ్మవారిని దర్శించుకొని ఉద్యమ నాయకుడిగా నాడు కేసీఆర్ పాదయాత్రను ప్రారంభించారు. మే 25న పాదయాత్ర గద్వాలకు చేరింది. ఆరు రోజులపాటు ఆ యాత్ర సాగింది. తెలంగాణ ఉద్యమ చరిత్రలో అలంపూర్ టు జోగులాంబ పాదయాత్ర చిరస్థాయిగా నిలిచింది. రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) 85 వేల ఎకరాలను మాగాణిగా మార్చే స్కీమ్‌ను నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రారంభించారు. ‘ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఆర్డీఎస్ తూములు మూసేయొద్దు. ఒకవేళ కేసీఆర్‌కు భయపడి ప్రభుత్వం దాన్ని మూసేస్తే ‘బాంబులు పెట్టి పేల్చేస్తాం’ అని ఆనాటి నందికొట్కూరు కర్నూల్ ఎమ్మెల్యేగా ఉన్న బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేశారు. దీంతో కేసీఆర్ తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించారు.
‘ఏమయ్యా.. బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి.. అందరిలెక్కనే దేవుడు నీకు రెండు చేతులు ఇచ్చిండు. నాకూ రెండు చేతులు ఇచ్చిండు.. అట్లగాకుంట నీకు నాలు గు చేతులు, ఆరు కాళ్లు ఇచ్చిండా? మునుపటి రోజులు కావివి.. తెలంగాణ బెబ్బులి లేచి కూర్చున్నది. కచ్చితంగా తూములు మూస్తం. మా నీళ్లు మేం తెచ్చుకుం టం. నువ్వు ‘బాంబులు పెడతా’..అంటున్నవ్. అడుగుపెట్టి చూ డు, మీ సుంకేశుల బరాజ్‌ను వంద బాంబులు పెట్టి లేపేస్తం, దుమ్ము దుమ్ము అయితది’ అని కేసీఆర్ స్ట్రాంగ్ కౌటర్ ఇచ్చారు. ఉద్యమ సమయంలో అదొక సంచలనం. ఆర్డీఎస్ తూములను మూసేయాలని డిమాండ్ చేస్తూ కేసీఆర్ 2003 ఆగస్టు 15న ఢిల్లీకి వెళ్లి అప్పటి ప్రధాని, రాష్ట్రపతికి వినతిపత్రాలను అందజేశారు.
1974లో సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి బచావత్ చేసిన నీటి కేటాయింపులను ఉమ్మడి పాలకులు తుంగలో తొక్కారు. మహబూబ్‌నగర్ జిల్లా (జూరాల)కు 17 టీఎంసీలు కేటాయించారు. 1974లో నీటి కేటాయింపులు అయితే జూరాల కెనాల్‌కు 1980-81లో ఫౌండేషన్ వేశారు. బరాజ్ మాత్రమే కట్టి కాలువలు తవ్వలేదు. ఉద్యమ సమయంలో మహబూబ్‌నగర్ బహిరంగసభలో నాటి సీఎం చంద్రబాబుపై కేసీఆర్ నిప్పులు చెరిగారు.కేసీఆర్ గాండ్రిస్తే అప్పుడు కర్ణాటకకు వెళ్లి డబ్బులు కట్టారు. అట్లా జూరాల నీళ్లు వచ్చాయని, జూరాల నీళ్లు ఉద్యమ ఫలితంగానే వచ్చాయని ఉమ్మడి పాలమూరు జిల్లా ఉద్యమకారులు గుర్తు చేస్తున్నారు.
చిన్ననీటి వనరులను పునరుద్ధరించడానికి మిషన్ కాకతీయ అనే వినూత్న కార్యక్రమానికి మొదట కేసీఆర్ శ్రీకారం చుట్టారు. గొలుసుకట్టు చెరువులను పునరుద్ధించడం, పూడికలు తీయడం ద్వారా 15 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. భూగర్భజలాల సామర్థ్యం పెరిగింది. రాష్ట్రంలోని 46,531 చెరువులను దశలవారీగా పునరుద్ధరించారు.
కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా, ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, దేవాదుల, భక్తరామదాసు తదితర పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాలను నాడు కేసీఆర్ సర్కార్ శరవేగంగా పూర్తిచేసింది. దీంతో ఒకప్పుడు కరువు జిల్లాగా ముద్రపడిన పాలమూరు జిల్లా.. కోనసీమ జిల్లాలను తలదన్నేరీతిలో రూపాంతరం చెందింది. నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, నిజాంసాగర్ తదితర ప్రాజెక్టుల కాలువలను కేసీఆర్ ప్రభుత్వం ఆధునీకరించింది.
కాళేశ్వరంను కేసీఆర్ ప్రభుత్వం రికార్డు సమయంలో పూర్తి చేసింది. 45 లక్షల ఎకరాల్లో రెండు పంటలకు సాగునీరందించే కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ గ్రోత్ ఇంజిన్‌గా అవతరించింది. శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకానికి సైతం కాళేశ్వరం జలాలే ఉపయోగపడ్డాయి. గోదావరిలో నిరంతరం 100 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా చేసిన ఘనత కేసీఆర్‌ది. 90శాతం పాలమూరు-రంగారెడ్డి పూర్తయింది.
‘ఇంకుడుగుంతలు మాకు, నదులూ, కా ల్వలూ మీకా? ’ అని కరీంనగర్ ఎస్సారార్ కళాశాల వేదికగా గర్జించిన గొంతుక వెనుక (సింహగర్జన 2001) నెర్రెలుబారిన నేలనే కాదు.. పడావుపడ్డ సాగునీటి ప్రాజెక్టులు, ఆ ప్రాజెక్టుల కింద తవ్విన పిల్ల కాలువల్లో నీళ్లకు బదులు పట్నంతుమ్మల ప్రవాహ దృశ్యాలను దిగమింగి సరికొత్త తెలంగాణను ఆవిష్కరించుకోవాలన్న తండ్లాటలో భాగమైందే ప్రాజెక్టుల రీ డిజైనింగ్. తలాపున గోదావరి, కృష్ణా నదులు పారుతున్నా తెలంగాణ ఎడారిగా మారిన దయనీయం. తెలంగాణ భౌగోళిక అననుకూలతల వల్ల వాటిని వందల మీటర్ల లోతునుంచి ఎత్తిపోసుకోవడం తప్ప మరో గత్యంతరం లేదు. పాకాల, రామప్ప, గణపసముద్రం, గండిపేట, ఉస్సేన్సాగర్ సహా అక్కడక్కడా ఉన్న మధ్యతరహా నీటి ప్రాజెక్టులు మాత్రమే మిగిలాయి.
ఈ నేపథ్యంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయడం, కొత్త ప్రాజెక్టుల నిర్మాణాల అనివార్యతలు నెలకొన్నాయి. జలలభ్యత నుంచి మొదలై ప్రపంచమే అబ్బురపడే కాళేశ్వరం. ఎవరు అవునన్నా.. కాదన్నా.. అంగీకరించకపోయినా.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ప్రధాన వంతెన అయిన మేడిగడ్డే తెలంగాణ జీవగడ్డ. తెలంగాణ తనను తాను పునర్వచించుకొన్న తర్వాత అప్పటిదాకా పడావుపడ్డ (పెండింగ్) ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నది. ఎస్సారెస్పీ కాలువలు పునరుజ్జీవం పొందాయి.
మొత్తంగా తెలంగాణ కలగన్న జలవిప్లవం చేరుకోవడానికి తుది అంకంలో నిలిచింది. తెలంగాణకు ‘తుంపర్ల సేద్యం..తుప్పిర్ల సేద్యమేనా’ అని దిగులుపడ్డ తెలంగాణ మండువేసవిలో కూడా సముద్ర సదృశ్యాలను కండ్లముందర పెట్టింది. కానీ, ఇవ్వాళ వ్యక్తిపై పగతో వ్యవస్థకు శాపం పెట్టాలనే ఆలోచన రావడం ఏ విధంగా సరైంది? ఒకవేళ జలస్వప్నం నిజరూపం దాల్చకపోతే 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఎలా సాధ్యమైంది? 2014లో ఉన్న 49,63,068 ఎకరాల వరిసాగు 2022 నాటికి 2,48,785 ఎకరాలకు (97శాతం పెరుగుదల) ఎట్లా సాధ్యమైంది? అని ప్రశ్నించుకోవాల్సి ఉన్నది.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జలవాటాలో జరుగుతున్న కుట్రలపై కేసీఆర్ యుద్ధం ప్రకటించారు. ఉమ్మడి పాలకుల జలదోపిడీ వ్యూహాన్ని బద్దలుకొట్టారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తొలినాళ్ల నుంచే ఏ ప్రాంతంలో ఏ చెరువు, చెక్‌డ్యామ్, ఏ నదీలో ఎంతమేర నీరు ప్రవహిస్తున్నది? ఎన్ని క్యూసెక్కుల నీరు ఏ వాగు గుండా వెళ్తున్నది? సింగూరు జలం.. ఇందూరు హక్కు ఎలా అయ్యింది? నాగార్జున సాగర్ ఎడమ కాలువపై ఆనాడు కేసీఆర్ సర్ది చెప్పకపోతే ఏమయ్యేది? జూరాలకు అనుమతులు ఎలా వచ్చాయి? ఆరున్నర దశాబ్దాల అనంతరం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ స్వప్నం సాకారమైన తర్వాత తెలంగాణపై పొడిసిన జలపొద్దు వంటి విషయాలన్నీ ప్రజల అనుభవంలో ఉన్నవే. రెండు దశాబ్దాల క్రితం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన జలసాధన దీక్ష, రాష్ట్ర సాధన అనంతరం జలచేతన కార్యాచరణ వెరసి తెలంగాణను పసిడి రాష్ట్రంగా రూపాంతరం చెందేలా చేసిందనేది అక్షర సత్యం.
రాష్ట్రంలో రెండేండ్లుగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బీఆర్ఎస్ను రాజకీయంగా అణచివేయాలని చూస్తున్న సంగతి తెలిసిందే. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సహా పార్టీ నేతలపై ఎన్ని కక్షసాధింపు చర్యలకు పాల్పడినా, ఎన్ని రాజకీయ ఆరోపణలు చేసినా పార్టీ అధినేత కేసీఆర్ మౌనం దాల్చారు. అయితే, నదీజలాల వాటాకు పొంచి ఉన్న నష్టాన్ని, రాష్ట్ర రైతాంగానికి జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ ఉండలేకపోతున్నారు. రాష్ట్ర సాధన ఉద్యమాన్ని నడిపి, తెలంగాణను సాధించడమేకాక, సాధించిన రాష్ట్రంలో రైతుల జీవితాలను బాగుచేసిన బాధ్యతాయుత నేతగా కేసీఆర్ మరో పోరాటానికి నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
ఇటు పార్టీని, అటు ప్రజలను సమాయత్తం చేయాలని భావించడమే కాకుండా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని తానే రంగంలోకి దిగేందుకు సిద్ధం అవుతున్నారని పార్టీ కీలక నేత ఒకరు పేర్కొన్నారు. రెండేండ్ల కిందట సీఎం రేవంత్‌రెడ్డి అధికారం చేపట్టిన కొద్దిరోజులకే కృష్ణానదీ జలాలను కేఆర్ఎంబీకి అప్పగిస్తే కేసీఆర్ నల్లగొండలో బహిరంగసభ నిర్వహించి ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ సాగునీటి రంగాన్ని నిర్వీర్యం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. దీంతో రేవంత్ సర్కార్ దిగొచ్చింది. కృష్ణానదీ జలాలను కేఆర్ఎంబీకి అప్పగించబోమంటూ తన తప్పును దిద్దుకున్నదని ఆ నేత గుర్తుచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం వద్ద మోకరిల్లి నదుల అనుసంధానం పేరుతో ఏపీ జలదోపిడీకి సహకరిస్తున్నదని ఆరోపిస్తున్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీలకే ఒప్పుకోవడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా పరిగణించింది. రాష్ట్రానికి 8 మంది బీజేపీ, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నా నోరు మెదపడం లేదని ధ్వజమెత్తుతున్నది. పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ రైతాంగ ప్రయోజనాలపై ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం కావాలని బీఆర్ఎస్ భావిస్తున్నది. అందుకు కార్యాచరణ రూపొందిస్తున్నది.