హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): ఎవరు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా రాబోయే రోజుల్లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవడం ఖాయమని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. రైతుబంధు ఇచ్చినందుకు కేసీఆర్‌కు సిట్ విచారించిందా? కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టినందుకు విచారించిందా? ఎందుకు నోటీసులు ఇచ్చారో? ఎందుకు విచారించారో? ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సంక్షేమానికి స్వర్ణయుగంలా కేసీఆర్ పాలన ఉండేదని గుర్తుచేశారు.
ఇంటి ఆడబిడ్డ బిందె పట్టుకొని బయటకు రావొద్దని రాష్ట్రంలోని ఇంటింటికీ తాగునీరు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దని చెప్పారు. రెండేండ్ల కాంగ్రెస్ పాలన అవినీతిమయమైందని, ఏ రంగంచూసినా అన్నీ సామ్‌లే బయటపడుతున్నాయని ఆరోపించారు. వాటి నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకే విచారణల పేరిట బీఆర్ఎస్ నాయకులను వే ధించాలని చూస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ సమాజం కేసీఆర్ వెంటే ఉంటుందని స్పష్టంచేశారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమని తేల్చి చెప్పారు.
సిట్ పేరుతో కేసీఆర్‌ను విచారించడ మంటే తెలంగాణ సమాజాన్ని కించ పరుచడమేనని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. 14 ఏండ్లు పోరాడి తెలంగాణ తెచ్చిన సాధకుడు, తెచ్చిన రాష్ర్టాన్ని పదేండ్లలో దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టిన రాష్ట్ర సారథి కేసీఆర్‌ను ఇలా వేధించడాన్ని సరికాదన్నారు. దేశమంతా కేసీఆర్ వైపు చూసిందని, అలాంటి నాయకుడిని రేవంత్‌రెడ్డి సర్కార్ అవమానిస్తున్నదని మండిపడ్డారు.
కేసీఆర్‌కు సిట్ నోటీసులిస్తే, ప్రజలంతా రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడితే కొందరు పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని, ప్రభు త్వ దిష్టిబొమ్మలు తగలబెడుతుంటే బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని విమర్శించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని హెచ్చరించారు. కేసీఆర్ ఎకడ ఉంటారో అందరికీ తెలుసని, అయినా, నందినగర్‌కు సిట్ అధికారులు వచ్చి నోటీసులు అంటించడం బాధాకరమని పేర్కొన్నారు. మంత్రుల మధ్య వాటాల పంచాయితీని ప్రజలు మరిచిఏందుకే ఇలా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు.
ఈ రెండేండ్లలో కేసీఆర్‌పై ప్రజాభిమానం పెరిగింది తప్ప తగ్గలేదని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నా రు. రేవంత్‌రెడ్డి తన అసమర్థతను కప్పి పుచ్చుకునేందుకే సిట్‌తో విచారణ జరిపించారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో ఎటువంటి ఎమర్జెన్సీ కొనసాగిందో, కాంగ్రెస్ ఈ రెండేండ్ల్ల పాలనలో కూడా అలానే ఉన్నదని విమర్శించారు.