KCR | హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఖ్యాతిని యావత్తు దేశానికి, ప్రపంచానికి చాటేందుకు మాజీ సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేశారు. మహనీయుడి చరిత్ర మరుగునపడిపోతున్న తరుణంలో ‘పీవీ మన తెలంగాణ ఠీవీ’ అంటూ నరసింహారావు ఖ్యాతిని మరోసారి ఎలుగెత్తిచాటారు. 2014 తెలంగాణ ప్రత్యేక రాష్ర్టావతరణం నుంచి పీవీ జయంతి, వర్ధంతి సభలను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించి, దానిని అమలు చేస్తూ సముచితస్థానం కల్పించారు. రాష్ట్రంలో వెటర్నరీ యూనివర్సిటీకి పీవీ పేరుపెట్టి తన అభిమానాన్ని చాటుకొన్నారు. పీవీ ఔన్నత్యాన్ని నలుదిశలా తెలియజేసేందుకు శతజయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా నిర్వహించేందుకు సంకల్పించారు.
తొలి సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే పీవీ నరసింహారావు ఖ్యాతిని చాటేందుకు కేసీఆర్ చర్యలు చేపట్టారు. పీవీ జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించారు. 2015 సెప్టెంబర్ 4న ఉత్తర్వులు జారీ చేయడంతోపాటు తూచా తప్పకుండా ప్రభుత్వం అమలు చేసింది. పీవీ శతజయంతి వేడుకలను 2020 జూన్ 28 నుంచి 2021 జూన్ 28 వరకు ‘పీవీ మన తెలంగాణ ఠీవి’ అనే నినాదంతో ఏడాది పొడవునా అట్టహాసంగా నిర్వహించింది. పీవీమార్గ్‌లోని జ్ఞానభూమి వద్ద వేడుకలను కేసీఆరే స్వయంగా ప్రారంభించారు. రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు నేతృత్వంలో శతజయంతి ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసి పీవీని 360 డిగ్రీల కోణంలో ఆవిష్కరించేలా కార్యక్రమాలను నిర్వహించారు. దేశవిదేశాల్లోనూ, ఇతర రాష్ర్టాల్లోనూ వేడుకలను నిర్వహించారు. దాదాపు 50కి పైగా వెబినార్లను నిర్వహించారు. నెక్లెస్‌రోడ్‌కు పీవీమార్గ్గా నామకరణం చేశారు. 16 అడుగుల పీవీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయగా, కేసీఆర్ ఆవిష్కరించారు. పీవీ జ్ఞానభూమిలో పీవీ మెమోరియల్‌ను నిర్మించాలని ప్రతిపాదించారు.
పీవీ కుమార్తెకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి కేసీఆర్ తన సహృదయతను చాటుకొన్నారు. హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో బీఆర్ఎస్ అభ్యర్థిగా సురభి వాణిదేవీని నిలిపారు. స్వతహాగా విద్యావేత్త, చిత్రకారిణి కావడంతోపాటు పీవీ కుమార్తె కావడంతో సబ్బండ వర్గాల పట్టభద్రులు ఆమెను ఆదరించారు. ఎమ్మెల్సీగా 2021 మార్చి 20న పట్టం కట్టి పీవీకి ఘనమైన నివాళి అర్పించారు.
ముందుతరాలకు స్ఫూర్తి కలిగించేలా వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో పీవీ విద్యాపీఠం ఏర్పాటు చేయాలని మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అప్పటి కేయూ వీసీ తాటికొండ రమేశ్ పంపిన ప్రతిపాదనలను ఆమోదించడమేగాక, పీవీ ఆదర్శాలను విద్యాపీఠం నెరవేర్చాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
పీవీకి భారతరత్న ఇవ్వాలని గత బీఆర్ఎస్ సర్కారు అనేక పర్యాయాలు డిమాండ్ చేసింది. ‘దేశం అనేక సంక్లిష్ట సమస్యల్లో కూరుకుపోయిన తరుణంలో, వయస్సు పైబడిన సమయంలోనూ తన ప్రజ్ఞాపాటవాలతో మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదేండ్లు ముందుకు నడపడమేగాక భారత్‌ను ప్రగతిపథంలో నడింపించారు. అంతటి మహనీయుడు పీవీకి భారతరత్న ఇచ్చి సత్కరించాలి’ అని కోరుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ 2020 జూన్ 18న కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. తెలంగాణ అసెంబ్లీ సైతం ఇదే విషయమై 2020 సెప్టెంబర్ 8న ఏకగ్రీవ తీర్మానం చేసింది. పీవీ పేరిట స్మారక స్టాంప్‌ను విడుదల చేయాలని 2020 నవంబర్ 20న, హెచ్సీయూకు పీవీ పేరు పెట్టాలని ప్రధాని మోదీకి 2020 జూన్ 28న కేసీఆర్ లేఖ రాశారు. ప్రతి సందర్భంలోనూ కేంద్రానికి అనేక విజ్ఞప్తులు చేస్తూనే వచ్చారు.
పీవీ స్వగ్రామం వంగర, లక్నేపల్లిని పర్యాటక కేంద్రాలుగా తీర్చి దిద్ది, సైట్ మ్యూజియాలుగా ఏర్పాటు చేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. వంగరలో పీవీ విజ్ఞాన వేదిక నిర్మాణం కోసం రూ.7 కోట్లను కేటాయిస్తూ జీవో విడుదల చేసింది. పీవీ ఇంటిని మ్యూజియంగా రూపొందించడంతోపాటు అక్కడే విజ్ఞాన వేదిక థీమ్ పార్కు నమూనాలను సైతం సిద్ధం చేసి ఆ పనులను ప్రారంభించింది. పీవీ సాహిత్య గ్రంథాలను పునర్ముద్రించేందుకు పూనుకున్నది. వరంగల్, కరీంనగర్, వంగర, ఢిల్లీ తెలంగాణా భవన్లో పీవీ కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేయడానికి రూ.35 లక్షలను మంజూరు చేసి, పనులను చేపట్టింది. పీవీ విగ్రహాన్ని ఆస్ట్రేలియా సిడ్నీ నగరంలోని ఓంబుష్ పార్కులో ఏర్పాటు చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపింది.