KCR | హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ దెబ్బకు కాంగ్రెస్ సర్కారు దిగొచ్చింది. నల్లగొండ సభ పిలుపుతో కలవరం చెందిన సర్కారు రాత్రికి రాత్రే అసెంబ్లీ ఎజెండా మార్చేసింది. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించి తెలంగాణ ప్రజల నీటి హక్కును కాలరాసే ప్రయత్నానికి కేసీఆర్ ఆదిలోనే అడ్డుకట్ట వేశారు. తన మార్క్ రాజకీయంతో కాంగ్రెస్ సర్కారు దిగొచ్చేలా చేశారు. కృష్ణా జలాలపై పోరుకు శంఖారావం పూరించారు. మంగళవారం నల్లగొండలో భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చారు. కేసీఆర్ నిర్ణయంతో కాంగ్రెస్‌లో కలవరం మొదలైంది. దీంతో కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై యూటర్న్ తీసుకొన్నది. ఇందులో భాగంగానే అసెంబ్లీలో సోమవారం తీర్మానం పేరుతో హడావిడి చేసింది. అసలు వాస్తవానికి అసెంబ్లీ ఎజెండాలో కృష్ణా జలాలపై తీర్మానానికి సంబంధించిన అంశం లేదు.
కానీ మంగళవారం నల్లగొండలో బీఆర్ఎస్ సభ జరుగుతుండటంతో ఈ సభను ఎదుర్కొనేందుకుగానూ సోమవారం అసెంబ్లీలో తీర్మానం అంకానికి తెరలేపిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం ఆదివారం రాత్రి అసెంబ్లీ ఎజెండాలో ఈ అంశాన్ని పొందుపరిచింది. వాస్తవానికి సోమవారం బడ్జెట్‌పై చర్చ ఉండాలి. దానిని పక్కకు పెట్టిన ప్రభుత్వం.. కృష్ణా జలాలపై తీర్మానాన్ని ముందుకు తెచ్చింది. మొన్న జరిగిన బీఏసీలోనూ ఈ తీర్మానంపై ఎలాంటి నిర్ణయం జరగలేదు. కానీ బీఆర్ఎస్ సభతో ప్రజలకు ఎలాగూ వాస్తవం తెలిసిపోతుందని, అప్పుడు ప్రజల ముందు దోషిగా నిలబడాల్సి వస్తుందని భావించిన కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తాము కూడా కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతకు వ్యతిరేకమని చెప్పుకొనేందుకు నానా తంటాలు పడుతున్నది. ఈ నేపథ్యంలో కేసీఆర్ తన మార్క్ రాజకీయంతో సభకు ముందే విజయం సాధించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పోరాటం ద్వారా ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల రైతులకు మేలు జరిగిందని భావిస్తున్నారు.