ఆయుష్షు ఉన్నంతవరకు, చివరి శ్వాసవరకు తెలంగాణ కోసం పనిచేస్త తప్ప, ఎట్టి పరిస్థితుల్లోనూ విశ్రమించే ప్రసక్తే లేదు. తెలంగాణ ప్రజలకు ఈ వేదికగా హామీ ఇస్తున్నా. బీఆర్ఎస్ పుట్టిందే మీకోసం. ఎటువంటి త్యాగాలకైనా సిద్ధపడుతది. వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు.
– బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
KCR | హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ పార్టీయే రక్షణ కవచమని, గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా ప్రజల కోసం పనిచేయాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ప్రజల ఆశలు అడియాసలు కాకుండా ఉండాలంటే.. అద్భుతమైన, నూతన ఉద్యమపంథా ఆవిష్కరించాల్సిన అవసరం ఉన్నదని పార్టీ శ్రేణులకు ఉద్బోధించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తిర్రి మొర్రి వేషాలు, వారి కార్యక్రమాలు రాష్ర్టానికి శాపంగా మారుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ పాలనలో అనుభవించిన ఆనందం కాంగ్రెస్ పాలనలో లేకుండా పోతున్నదనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారని చెప్పారు. ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పనిచేయాలని, వాళ్ల ఆశలు అడియాసలు కాకుండా కాపాలాదారులుగా ఉండాలని, అంతకుమించిన కర్తవ్యం మనకు లేదని దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఆదివారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణభవన్‌లో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ ప్రసంగించారు. ‘అన్ని రంగాల్లోనూ అల్లకల్లోలం.. కరెంటు రాదు.. రైతుబంధు రాదు.. మంచినీళ్లు రావు.. సాగునీళ్లు రావు.. పెన్షన్లు ఎగ్గొడుతరు.. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తిర్రి మొర్రి వేషాలు, వాళ్లు పాల్పడుతున్న చర్యలు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉన్నది’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఈ మధ్యనే తన వద్దకు ఒక వ్యక్తి వచ్చి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ 105 సీట్లు వస్తయని చెప్పాడని, ఆయన ఇలా మాట్లాడటం వెనుక అనేక కారణాలు ఉన్నాయని వివరించారు. తాము అధికారం చేపట్టిననాడు విద్యుత్తురంగంలో భయంకర సంక్షోభం ఉండేదని, దానిని బాగు చేశామని, ఒక నిమిషం కూడా కరెంటు పోకుండా చూశామని గుర్తుచేశారు. ఇప్పుడు విద్యుత్తు కోతలు భరించలేక ప్రజలు రోడ్లమీదికి వచ్చే పరిస్థితి దాపురించిందని, ఇది ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని స్పష్టంచేశారు. ఐక్యరాజ్యసమితి లాంటి సంస్థలు మెచ్చుకున్న మిషన్ భగీరథ లాంటి గొప్ప కార్యక్రమం కూడా ఇప్పుడు కింద, మీద అవుతున్నదని మండిపడ్డారు. రైతుబంధుకు ఆంక్షలు పెడుతామంటూ రైతులను ఆగం చేయడమెందుకు? అని ప్రశ్నించారు. ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని వాగ్దానం చేసిన కాంగ్రెస్.. తాము ఇచ్చిన రూ.10 వేలు కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రెండు ఇస్తే నాలుగు ఇస్తమని అర్రాస్ పాటలెక్క పాడి వృద్ధులను ఆగంపట్టించారని, నాలుగు వేలు ఇవ్వకపోగా, జనవరి నెలలో రావాల్సిన రూ.2వేలు ఎగ్గొట్టారని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎరువుల బస్తాలను పోలీస్స్టేషన్టలో పెట్టి అమ్మిన రోజులను గుర్తు చేస్తూ.. మళ్లీ ఇప్పుడు అలాంటి దుస్థితే దాపురించిందని, ఇప్పుడు మళ్లీ పాస్‌పుస్తకాలు, ఆధార్‌కార్డులు, చెప్పుల లైన్లు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ‘అదేమంటే.. మీరే పెట్టిస్తున్నరని అంటున్నరు. విత్తనాలు కుల్లా దొరుకుతుంటే మనం దండం పెట్టినా ఎవరైనా చెప్పులు పెడుతరా?’ అని ఎద్దేవా చేశారు. చిల్లర రాజకీయాలు తప్ప రైతుల బాధలు తీర్చాలన్న సోయి ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు.
అన్ని పథకాలు బంద్
దళితబంధు అద్భుతమైన కార్యక్రమం అని, దానిని కూడా నిలిపివేశారని కేసీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. రూ.12 లక్షలు ఇస్తామని చెప్పి, ఇప్పుడు పట్టించుకున్నోళ్లే లేరని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన డబ్బులు కూడా ఫ్రీజ్ చేశారని పేర్కొన్నారు. గొర్రెల పంపిణీ పథకాన్ని బంద్ చేశారని, డిపాజిట్లు వాపస్ ఇస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో కల్లు దుకాణాలు బంద్ పెడితే.. ఉద్యమ సమయంలో చెప్పినట్టుగానే కల్లుడిపోలు తెరిపించామని కేసీఆర్ గుర్తుచేశారు. చెట్లపై పన్ను రద్దు చేశామని, కోట్లాదిగా ఈత, తాటి వనాలు పెంచామని, దీంతో పట్టణంతోపాటు ఊళ్లలో గౌడ మిత్రులకు పనిదొరికిందని చెప్పారు. ఇప్పుడు కల్లు డిపోల మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయని, కేసులు పెడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు ‘ఇదేం దౌర్జన్యం సార్.. నోరు తెరవాలని నన్ను నలుగురు పెద్దమనుషులు అడిగారు. మాట్లాడతం, అవసరమైతే యుద్ధం చేస్తం, మీ తెరువు రాకుండా చేస్తం అని చెప్పిన’ అని పేర్కొన్నారు. గీత కార్మికులు దొంగపని చేసేటోళ్లు, కోటీశ్వరులు, స్మగ్లర్లు కాదని, దేవుడిచ్చిన చెట్లను గీసుకొని, కల్లు అమ్ముకొని బతుకుతున్నారని చెప్పారు. అలాంటివారి జీవితాలను కూడా ఆగం చేస్తున్నారని మండిపడ్డారు.
పల్లెప్రగతి, పట్టణప్రగతి సర్వనాశనం
కాంగ్రెస్ పాలనలో పల్లెప్రగతి, పట్టణప్రగతి సర్వనాశనం అయ్యిందని, ట్రాక్టర్లకు డీజిల్ లేదని, డ్రైవర్లకు జీతాలు ఇవ్వడం లేదని ఆగ్రహం కేసీఆర్ వ్యక్తంచేశారు. గ్రామాలు, పట్టణాలు మురికికూపాలుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు మంజూరు చేస్తే నిలిచిపోయాయని మండిపడ్డారు. సీఎంగా తాను స్పెషల్ ఫండ్స్ రిలీజ్ చేస్తే రద్దు చేశారని పేర్కొన్నారు. దవాఖానల పరిస్థితి మరీ దారుణంగా తయారైందని విమర్శించారు. కేసీఆర్ కిట్లు పెట్టిన తర్వాత ప్రజలు దోపిడీ నుంచి విముక్తి పొంది, సర్కారు దవాఖానలో లైన్ కట్టేదని, ఇప్పుడు మళ్లీ వెనుకకు పోతున్నారని చెప్పారు. అంటే.. మొత్తం రివర్స్ అయ్యిందని మండిపడ్డారు. ఒక్కరికి కాదు యావత్ తెలంగాణ సమాజానికే మోసం జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని స్పష్టం అవుతున్నదని పేర్కొన్నారు. ‘మెట్లు ఎక్కుడు మొదలుపెడితే పైకి పోతరు.. దిగుడు స్టార్ట్ చేస్తే కిందికి పోతరు. దాంట్లో ఏం బ్రహ్మపదార్థం లేదు. పెద్ద సిద్ధాంతం లేదు. వాళ్లు స్టెప్‌డౌన్ అవుతున్నరు’ అని స్పష్టం చేశారు. ‘కల్యాణలక్ష్మి బంద్, తులం బంగారం బంద్, రుణమాఫీ బంద్, చేనేతలు బంద్.. అన్నీ బందే. ఏదీ జరుగుతలేదు. మరి ఏం జరుగుతున్నదంటే ఎవరికీ తెలుస్తలేదు. బంద్ అయినందుకు ఇంకా ఏదన్నా మంచి జరగాలె కదా. అదేం జరుగుతలేదు. ఇదంతా కలగలిపి చివరికి ఏమైతది.. సమయం వచ్చినప్పుడు బాంబు పేలినట్టు పేలుతది. ఆ సమయం కూడా ఎక్కువ దూరం ఉంటదని నేను అనుకుంటలేను. కారణాలు అట్లున్నయి’ అని పేర్కొన్నారు.
ఒక్క పాలసీ అయినా ప్రకటించారా?
ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైందని, కనీసం ఒక్క పాలసీ అయినా ప్రకటించిందా? అని కేసీఆర్ నిలదీశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి క్యాబినెట్లోనే 42 నిర్ణయాలు తీసుకున్నామని గుర్తుచేశారు. వ్యవసాయ పాలసీ ద్వారా గొప్ప ఫలితాలు సాధించామని, పంజాబ్‌ను తలదన్నే ధాన్యం పండించామని గుర్తుచేశారు. అట్లా పట్టుబట్టి ఫలితం సాధించాలని, ప్రభుత్వ విజయం ప్రజా విజయం కావాలని చెప్పారు. డబ్బాలో రాళ్లేసి ఊపినట్టు లొల్లి తప్ప ఏదీ చేతకావడం లేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘నిన్న క్యాండిల్ ర్యాలీ నుంచి వాపస్ వస్తుంటే, ఒక ఆటోడ్రైవర్ ఉరికొచ్చి నా కారు కొట్టి.. సార్ మళ్లా మనమే గెలుస్తున్నం, నువ్వేం భయపడకు. మేమందరం ఉన్నం అన్నడు. సమీప భవిష్యత్తులో పాలన మళ్లా మన భుజాల మీదనే పడుతది. దాంట్లో అనుమానం అవసరం లేదు’ అని స్పష్టంచేశారు. కాంగ్రెస్ నేతలు చిల్లర రాజకీయాలు తప్ప గొప్ప వ్యూహకర్తలు కాదని పేర్కొన్నారు. ఫలితాల తర్వాత నిజంగానే గెలిచామా? అని వాళ్ల చెయ్యి వాళ్లే గిచ్చుకొని చూసుకున్నారని ఎద్దేవా చేశారు. అంత అపనమ్మక స్థితిలో, అనుకోకుండా వచ్చిన గెలుపును ఎట్లా మలుచుకోవాలో వాళ్లకు తెలియడం లేదని పేర్కొన్నారు. ‘సీఎంకో, మంత్రివర్గానికో బుద్ధి ఉంటే కరెంటోళ్లను పిలిపించి మొన్నటిదాకా ఎట్ల నడిచిందో, అట్ల నడిపించుమని చెప్తే అయిపోతుండే. ఏదో అధికం చాతలకు పోయి, కొండెంగ చాతలు చేస్తమని ఇష్టం వచ్చినట్టు మార్పులు చేస్తే ఇప్పుడు వాళ్ల లాగు పగలగొట్టేకాడికి వస్తున్నది’ అని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ అంటే 25 ఏండ్ల మహావృక్షం
రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ప్రజలు ఏ పాత్ర ఇచ్చినా చెయ్యాలని కేసీఆర్ సూచించారు. అప్పుడప్పుడు కొంత విషపు గాలి వీస్తుందని, కొన్ని విష ప్రచారాలకో, అత్యాశలకో, అడ్డగోలు హామీలకో ప్రజలు భ్రమిస్తారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఆ భ్రమలోనే అనుకోకుండా కొంత శాతం అటు మొగ్గడంతో.. 1.8% ఓట్లతో బీఆర్ఎస్ ఓడిపోయిందని చెప్పారు. అయినా కార్యకర్తలు దృఢ సంకల్పంతో ఉండాలని దిశానిర్దేశం చేశారు. రాజకీయం ఒక నిరంతర ప్రవాహమని, ఒక్కోసారి అధికారంలో ఉంటామని, ఒక్కోసారి ప్రతిపక్షంలో ఉండొచ్చని, ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో పనిచేయాలని సూచించారు. అప్పుడే ఆ పార్టీకి విలువ ఉంటుందని, ప్రజాక్షేత్రంలో గరిమ ఉంటదని చెప్పారు. 1999 నుంచి 2014 దాకా పదిహేనేండ్లు ఉద్యమం, ఆ తర్వాత పదేండ్ల పరిపాలన.. మొత్తంగా గులాబీ జెండాది 25 ఏండ్ల సుదీర్ఘ ప్రస్తానమని కేసీఆర్ వివరించారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత నాలుగు రోజులు ఎక్కడి వాళ్లం అక్కడ ఉన్నా.. మళ్లా పోరాటం ప్రారంభించామని, తాను బస్సుయాత్ర చేపట్టగానే ఎక్కడిక్కడ ప్రజలు గర్జించారని గుర్తుచేశారు. ‘మనకంటే ముందు కాంగ్రెస్ పదేండ్లు ప్రతిపక్షంలో ఉన్నది కదా? మరి ఖతమైందా? కాలేదు కదా? మళ్లా ప్రభుత్వానికి వచ్చిండ్రు కదా? అట్లనే గ్యారెంటీగా రేపొచ్చేది బీఆర్ఎస్సే’ అని స్పష్టం చేశారు.
ఫలితాలు ఎలా వచ్చినా ప్రస్థానం కొనసాగాలి
మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌రెడ్డి గెలువడంపై కేసీఆర్ హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆ జిల్లా నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గ్రాడ్యేయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలో కూడా రాకేశ్‌రెడ్డి చారిత్రాత్మక విజయం సాధిస్తారని చెప్పారు. ‘పార్లమెంట్ ఫలితాల్లో ఎన్నయినా రావొచ్చు. ఒకరు 11 అని, ఇంకొకరు ఒక్కటే అని, మరొకరు 2-4 అంటున్నారు. ఇదో గ్యాంబ్లింగ్ లాగా అయ్యింది. బస్సుయాత్రలో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. కాబట్టి మంచి ఫలితాలు రావాలె. ఎట్ల వచ్చినా బాధ లేదు. 11 వస్తే పొంగేది లేదు, రెండోమూడో వచ్చినా కుంగిపోయేది లేదు. ఎట్లా వచ్చినా, పరిస్థితి ఎట్లా ఉన్నా తెలంగాణ రక్షణ కవచం బీఆర్ఎస్. రాజకీయ ఫలితాలు వస్తుంటయి. పోతుంటయి. సీఎం సొంత జిల్లాలో గెలిచామని పొంగిపోయే అవసరం లేదు. 200 మెజార్టీతో గెలుస్తమని సీఎం చెప్తే.. బీఆర్ఎస్ 111 ఓట్ల మెజార్టీతో గెలిచింది. జయాపజయాలు ఆయా పరిస్థితులను బట్టి ఉంటాయి. మన ప్రయాణం, ప్రస్థానం కొనసాగుతుండాలె’ అని దిశానిర్దేశం చేశారు. తాను కూడా ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారని, ఎంత దూరమైనా పోదామని చెప్పారు. కఠినమైన సమయంలో ఉద్యమాన్ని ప్రారంభించి, గొప్ప విజయాన్ని సాధించి, రాష్ర్టాన్ని సాధించిపెట్టిన పార్టీ బీఆర్ఎస్ అని గుర్తుచేశారు. ‘రాజకీయ జయాజపయాలు మనకు లెక్క కాదు. ఎట్టి పరిస్థితుల్లో మొక్కవోని దీక్షతో, తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమైన కేంద్ర బిందువుగా పనిచేయాలి. పురోగమించాలి. నూతన ఉద్యమపంథాను ఆవిష్కరించి, ప్రస్తుత పరిస్థితుల్లో ఏది సమంజసమో, ఏ కార్యాచరణ అనువైనదో గుర్తించి, దానిని ఆవిష్కరించి ముందుకు తీసుకుపోతాం’ అని స్పష్టంచేశారు.
ప్రజలు ఆనందాన్ని కోల్పోయారు
గతంలో ఏం చేసినా పదుల సంఖ్యలో నిపుణులతో మాట్లాడి చేశామని, రాష్ట్ర అధికార చిహ్నం కూడా ఇలాగే తయారు చేశామని కేసీఆర్ వివరించారు. దళితబంధు పాటల సమయంలో రసమయి బాలకిషన్‌ను, ఇరవై మంది కళాకారులను ఫాంహౌజ్‌కు రప్పించుకొని, వారం రోజులు తిప్పలు పడి రాశామని గుర్తుచేసుకున్నారు. ‘ఒక పాట రాయలన్నా, ఒక మాట మాట్లాడాలన్నా, ఒక భావాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలన్నా.. కళాకారులు, మేధావులు, నిపుణులతో చర్చలు చేసినం. ఏ చిన్న పనిచేసినా ఒక సమిష్టి వ్యూహంతో చేసినం తప్ప, పొగరుతో, గర్వంతో ఒంటరిగా మనం చేయలేదు. అందువల్లే మంచి ఫలితాలు వచ్చినయి. అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నారు’ అని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ ఆనందాన్ని కోల్పోయామనే విషయం ప్రజలకు తెలిసిపోయిందని, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉజ్వలమైన భవిష్యత్తు బీఆర్ఎస్కే ఉంటుందని ధీమా వ్యక్తంచేశారు. ప్రజలకు కోపం వస్తే ఎవరూ అదుపు చేయలేరని, కాంగ్రెస్ నేతలు ఎంత ప్రజా వ్యతిరేక చర్యలు చేస్తే, అంత వెకిలితనం, మకిలితనం వాళ్లకే అంటుకుంటదని హెచ్చరించారు. ప్రస్తుత పరిణామాలపై రోజూ తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతున్నదని చెప్పారు.
చివరి శ్వాస వరకు తెలంగాణ కోసమే..
ఎన్నికలు ఉండటం వల్ల బీఆర్ఎస్ వార్షికోత్సవాన్ని వాయిదా వేశామని, త్వరలో రెండు రోజులపాటు ఘనంగా నిర్వహిస్తామని కేసీఆర్ చెప్పారు. ‘దేవుడు ఇచ్చిన ఆయుష్షు ఉన్నంతవకు, చివరి శ్వాసవరకు తెలంగాణ కోసం పనిచేస్త తప్ప, ఎట్టి పరిస్తితుల్లో విశ్రమించే ప్రసక్తే లేదు. విరమణ చేసే ప్రశ్నే లేదు. తెలంగాణ ప్రజలకు కూడా ఈ వేదికగా హామీ ఇస్తున్నా. బీఆర్ఎస్ పుట్టిందే మీ కోసం, ఉన్నదే మీ కోసం. తప్పకుండా అడుగడుగున మీ కోసం పోరాడుతది. ఎటువంటి త్యాగాలకైనా సిద్ధపడుతది. వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. ఇంకో ఆలోచన లేదు’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. మరోసారి యావన్మంది తెలంగాణ ప్రజానీకానికి, గులాబీ సైనికులకు, ఉద్యమవీరులకు, ప్రాణత్యాగం చేసిన పెద్దలకు, అమరులకు తెలంగాణ ఉద్యమాభివందనాలు చెప్తూ తన ప్రసంగాన్ని ముగించారు.
ఏ చిన్న పనిచేసినా ఒక సమిష్టి వ్యూహంతో చేసినం తప్ప, పొగరుతో, గర్వంతో ఒంటరిగా మనం చేయలేదు. అందువల్లే మంచి ఫలితాలు వచ్చినయి. అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు ఆ ఆనందాన్ని కోల్పోయామనే విషయం ప్రజలకు తెలిసిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో ఉజ్వలమైన భవిష్యత్తు బీఆర్ఎస్కే ఉంటుంది.
– కేసీఆర్
అన్నంల మన్ను పోసుకున్నట్టు అయిపాయె, అనవవసరంగా కేసీఆర్‌ను, బీఆర్ఎస్ను ఓడగొట్టుకున్నం అని ముచ్చట్లు బయలుదేరుతున్నయి. సాధారణంగా ఇంత తొందరగా చర్చ రాదు. వచ్చిందంటే దాని అర్థం ఏంటిది? అనతికాలంలోనే ఈ ప్రభుత్వం అప్రతిష్ఠపాలయితది. ప్రజాగ్రహానికి గురయితది, రీప్లేస్మెంట్ ఎవరంటే మళ్లా మనమే. కనపడేది మనమే. ఇంకొకరితోని ఆ పనికాదు.
– కేసీఆర్
లైన్మెన్లను హరీశ్‌రావు పనిచేయనిస్తలేరని సీఎం అంటున్నడు. ఇప్పుడు ముఖ్యమంత్రి హరీశ్‌రావా? రేవంత్‌రెడ్డా? ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అంత పేలవమైన మాటలు మాట్లాడవచ్చా?
– కేసీఆర్
తెలంగాణ ప్రజల ప్రయోజనాల పరిరక్షణే బీఆర్ఎస్ ప్రథమ కర్తవ్యం. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే తప్పులు సరిదిద్దాలె. మళ్లా గాడిన పెట్టాలె. అది ఎవరి నుంచి కూడా కాదు. లోతు తెలిసినోళ్లం మనమే కాబట్టి మన మీదనే ఆ కర్తవ్యం, బాధ్యత ఉంటది.
– కేసీఆర్
గులాబీ జెండా పుట్టిందే తెలంగాణ సమాజ రక్షణ కోసం. రాష్ట్రం తెచ్చే విషయంలో, ప్రభుత్వం నడిపే విషయంలో నిబద్ధతతో పనిచేసినం. ఇప్పుడు మన కర్తవ్యం తెలంగాణ సమాజ రక్షణే అయి ఉండాలి.
– కేసీఆర్
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం కాబట్టి కొంత నైరాశ్యం రావడం సహజమే. దీనికే పార్టీ ఖతమైతదని మోకాలెత్తు లేనోడు కూడా మాట్లాడుతున్నాడు. బీఆర్ఎస్ అంటే ఒక్కరోజు, రెండు రోజులు కాదు 25 ఏండ్ల మహావృక్షం, ఒక సముద్రం.
– కేసీఆర్