KCR | హైదరాబాద్, మే1 (నమస్తే తెలంగాణ): ఎన్నికల సంఘం తనపై 48 గంటల నిషేధం విధిస్తే, బీఆర్ఎస్ బిడ్డలు 96 గంటలపాటు అవిశ్రాంతంగా పనిచేస్తారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. ఈసీ ఇష్టారీతిగా వ్యవహరిస్తూ ఎంపిక చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకుంటున్నదని ధ్వజమెత్తారు.
‘కేసీఆర్ పేగులు మెడలో వేసుకుంటా, గుడ్లు పీకుతా’ అని రేవంత్‌రెడ్డి అడ్డగోలు మాటలు మాట్లాడినా ఆయనపై ఈసీ నిషేధం విధించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. లక్షలాదిమంది బీఆర్ఎస్ కార్యకర్తలు 96 గంటలపాటు పనిచేయాలని పిలుపునిచ్చారు. బస్సుయాత్రలో భాగంగా మహబూబాబాద్ పట్టణంలో బుధవారం కేసీఆర్ రోడ్‌షో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన ప్రాణమున్నంత వరకు తెలంగాణకు అన్యాయం జరగనివ్వబోనని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్కు స్వప్రయోజనాలు ఉండవని, ప్రతిక్షణం ప్రగతి కోసం, ప్రతి మాట ప్రజల కోసం, ప్రతి అడుగు ప్రజల కోసమేనని పేర్కొన్నారు. ఇది తెలంగాణ ఇంటి పార్టీ అని తెలిపారు. తెలంగాణ హక్కులు, నీళ్లను కాపాడేందుకు, నిధులను రాబట్టేందుకు, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకు బీఆర్ఎస్ పనిచేస్తుందని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ఆదరించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
మహబూబాబాద్ జిల్లా ఉండాల్నా?.. పోవాల్నా?
45 డిగ్రీల ఎండలోనూ రోడ్‌షోకు భారీగా తరలివచ్చిన మహబూబాబాద్ ప్రజలను చూసి కేసీఆర్ సంతోషం వ్యక్తంచేశారు. “మహబూబాబాద్ మారుమూల ప్రాంతం. గిరిజన ప్రాంతం. ఇక్కడికి అభివృద్ధి రావాలని ఆలోచన చేసినం. ఎంతో ప్రేమతో మహబూబాబాద్‌ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసుకున్నం. కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మహబూబాబాద్ జిల్లాను రద్దు చేస్తామంటున్నది.
ఒక్క మాట అడుగుతున్నా. మహబూబాబాద్ జిల్లా ఉండాల్నా? పోవాల్నా? జిల్లా ఉండాలంటే, ఈ ముఖ్యమంత్రి మెడలు వంచాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవిత గెలవాలె. మహబూబాబాద్ జిల్లాను తీసేస్తానని కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెప్తున్నడు. జిల్లా ఉండాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి” అని కేసీఆర్ పిలుపునిచ్చారు.
మహబూబాబాద్ ప్రాంతంలో తాగునీళ్లు వచ్చేవి కావని, కాంగ్రెస్ యాభై ఏండ్ల పాలనలో ఎస్సారెస్పీ స్టేజ్-2 అని చెబితే ఎన్నడూ నీళ్లు రాలేదని, కాళేశ్వరం కట్టిన తరువాత తాను కష్టపడి, ఇక్కడి నాయకుల ఆధ్వర్యంలో వెన్నవరం కాలువ తవ్విన తరువాతనే నీళ్లు వచ్చాయని గుర్తుచేశారు. ఆ కెనాల్‌కు ఈ ఏడాది నీళ్లు ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
ఆరు గ్యారెంటీలతో ఆగం
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పేరిట అరచేతిలో వైకుంఠం చూపించి, అడ్డగోలు హామీలు ఇచ్చి, రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఉసురు పోసుకుంటూ ఉన్నదని కేసీఆర్ నిప్పులు చెరిగారు. “రైతుబంధు వచ్చిందా? ఎవరికన్నా 2,500 రూపాయలు వచ్చినయా? తులం బంగారం వచ్చిందా? ఏదీ కూడా రాలె” అని కేసీఆర్ అనగానే ప్రజల నుంచి అవునంటూ పెద్ద ఎత్తున స్పందన లభించింది. ఎన్నో హామీలిచ్చిన కాంగ్రెస్ ఉచిత బస్సు ఒక్క హామీనే నెరవేర్చిందని తెలిపారు.
ఈ పథకం వల్ల ఆటోరిక్షా కార్మికులంతా రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వారి బతుకులు ఆగమవుతున్నాయని, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. మహిళల కోసం పథకం తీసుకురావడం మంచిదే కానీ, దానివల్ల వచ్చే బాధలు, ఇబ్బందులను కూడా గమనించి ఆటోకార్మికులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వారికి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ అండగా ఉండి కొట్లాడుతుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పాలనలో రైతుబంధు రాలేదని, కాలువల నీళ్లు రావడం లేదని, కరెంటు సక్కగ ఇవ్వడం లేదని, మళ్లా బోరుబండ్లు వస్తున్నాయని, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు.
రైతులు చనిపోతున్నరు
కాంగ్రెస్ దుష్ట పరిపాలన వల్ల అనేకమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో 15 రోజులైనా వడ్లు కొనకపోవడంతో తట్టుకోలేక, వాటిని ఆరబెడుతూ అక్కడే గుండె ఆగి రైతు చనిపోయిన విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పేరుతో అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణ ప్రజలను దగా చేసిందని, మోసం చేసిందని నిప్పులు చెరిగారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లోనూ మళ్లీ కాంగ్రెస్ గెలిస్తే ఇక హామీలను అమలు చేయకున్నా ఏం కాదని, వాగ్దానాలన్నీంటినీ పండబెడతుందని హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని, ప్రజల తరఫున నిలబడుతున్న బీఆర్ఎస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు.
బీజేపీ ఒక్క పనన్నా చేసిందా?
బీజేపీ విధానాలపై నిప్పులు చెరిగిన కేసీఆర్.. మోదీ ప్రభుత్వంలో ఈ దేశంలో ఒక్క పని అయినా అని ప్రశ్నించారు. ఎవరికైనా రూ.15 లక్షలు వచ్చాయా? అని నిలదీశారు. ‘భేటీ పడావో-భేటీ బచావో’, ‘అమృత్కాల్’ వంటివి నినాదాలే తప్ప ఏ ఒక్క పనీ జరగలేదని ధ్వజమెత్తారు. ఇప్పుడేమో మోదీ మన గోదావరిని ఎత్తుకుపోతామని అంటున్నా, ముఖ్యమంత్రి మాత్రం నోరుమూసుకుని ఉన్నాడని మండిపడ్డారు. కృష్ణానదిని ఇప్పటికే కేఆర్ఎంబీకి అప్పగించాడని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కరెంటు ఎక్కడికి పోయింది?
ఖమ్మం పట్టణంలో మురికినీళ్లు వస్తున్నాయని, మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేటలో తాగునీటి సమస్య నెలకొందని కేసీఆర్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు మంచిగ నడిచిన కరెంటు ఏమైపోయిందని, మిషన్ భగీరథ ఎక్కడికెళ్లిందని ప్రశ్నించారు. ప్రజలు ఈ విషయాలను ఆలోచించాలని కోరారు. 70 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఎనాడూ, ఎక్కడా గిరిజనులను గౌరవించలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో సేవాలాల్ బంజారా భవనాన్ని సత్యవతిరాథోడ్ నేతృత్వంలో కట్టించామని, 10 శాతం రిజర్వేషన్లు పెట్టుకున్నామని, తండాలన్నీ పంచాయతీలుగా చేసుకున్నామని వివరించారు.
ఎట్టిపరిస్థితుల్లోనూ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తమ ప్రతాపం చూపాలని కోరారు. “రైతులకు కేసీఆర్ రూ.10 వేలు ఇస్తుండు. మేం రూ.15 వేలు ఇస్తామన్నారు? కానీ, రూ. 15వేలు కాదు కదా పాత రూ.10వేలు కూడా రాలేదు. రైతు కూలీలకు నెలకు రూ. 1200 ఇస్తామన్నారు. ఏ రైతు కూలీకైనా వచ్చిందా? ఒక్క ఉచిత బస్సు తప్ప ఆరు గ్యారెంటీలను మొత్తం ఆగం చేసిండు. అందరినీ ఆగం పట్టే పనిచేశారు.
ఇవాళ తాగునీళ్ల బాధ, కరెంట్ బాధ, వడ్లు కొనే పరిస్థితి లేదు. 500 బోనస్ లేదు. వచ్చే పరిస్థితి కూడా లేదు” అని కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఈ ఎన్నికల్లో యువకులు, లంబాడా యువకులు, మేధావులు, గిరిజనులు అందరూ ఏకమై, ఆలోచనతో పనిచేయాలని, అప్పుడే విజయం సాధిస్తామని తెలిపారు. విచక్షణతో ఆలోచించి బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లుండె, కాంగ్రెస్ వచ్చాక ఈ 5 నెలల్లో ఎట్ల అయిపోయింది? కారణం ఏంది? అనేది ఆలోచించాలని కోరారు.
అన్యాయం జరగనివ్వను
“ఇంత వయసొచ్చినా తెలంగాణ ప్రజలను కాపాడాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ వారిని ఆగం కానివ్వద్దని వచ్చిన. నా ప్రాణమున్నంత వరకూ తెలంగాణకు ఎట్టిపరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వను. నేను హామీ ఇస్తున్నా? ఎన్నికల కమిషన్ నిషేధం వల్ల ఎక్కువ మాట్లాడలేకపోతున్న. కవిత బ్రహ్మండమైన నాయకురాలు. మచ్చలేని మనిషి. అందరి ఆదరాభిమానాలు పొంది ఐదేండ్లు గొప్పగా పనిచేశారు.
మరోసారి అవకాశమిస్తే తెలంగాణ హక్కులను, నీళ్లను కాపాడడానికి, నిధులను రాబట్టడానికి, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకు పనిచేస్తారు. కాబట్టి కవితను కచ్చితంగా గెలిపించాలె. మహబూబాబాద్‌లో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఒక ఉప్పెనలా తరలివచ్చారు. మహబూబాబాద్‌లో నేల ఈనిందా అన్నట్లుగా తరలివచ్చారు. ఆవేశపూరితంగా తరలివచ్చిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు” అని కేసీఆర్ ముగించారు.
మహిళల కోసం ఉచిత బస్సు పథకం తీసుకురావడం మంచిదే. కానీ, దానివల్ల వచ్చే బాధలు, ఇబ్బందులను కూడా గమనించాలె. ఆటోకార్మికులకు తగిన న్యాయం చేయాలె. వారికి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ అండగా ఉండి కొట్లాడుతుంది.
-కేసీఆర్
70 ఏండ్ల పాలనలో కాంగ్రెస్ ఏనాడూ గిరిజనులను గౌరవించలే. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్‌లో సేవాలాల్ బంజారా భవనాన్ని నిర్మించాం. వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించాం. తండాలను పంచాయతీలు చేశాం.
-కేసీఆర్
మారుమూల ప్రాంతమైన మహబూబాబాద్‌ను అభివృద్ధి చేయాలని ఎంతో ప్రేమతో ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసుకున్నం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడీ జిల్లాను రద్దు చేస్తామంటున్నది. మరి ఈ జిల్లా ఉండాల్నా? వద్దా?
-కేసీఆర్