హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): ‘నాడు తెలంగాణ ఉద్యమనేతగా కేసీఆర్ చేపట్టిన దీక్ష ఒక చరిత్ర.. ఆనాడు కేసీఆర్ లేకపోతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం లేనేలేదు’ అని తలసాని శ్రీనివాస్‌యాదవ్ స్పష్టంచేశారు. ‘కేసీఆర్ తెలంగాణను సాధించకపోతే, ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్, కాంగ్రెస్ సర్కారు ఎక్కడివి’ అని ప్రశ్నించారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష సందర్భాన్ని పురస్కరించుకొని శనివారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో నిర్వహించనున్న ‘దీక్షాదివస్’ కార్యక్రమ ఏర్పాట్లను ఆయన శుక్రవారం పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘అయినా కొందరు కేసీఆర్‌ను ఉద్దేశించి సోయిలేకుండా మాట్లాడుతున్నారని.. అవాకులు, చవాకులు పేల్చినంత మాత్రాన ఆయన చరిత్ర మారదు’ అని ధ్వజమెత్తారు.
‘కొత్త బిచ్చగాడు పొద్దెరుగడు’ అన్నట్టుగా కొంతమంది వ్యవహారం ఉన్నదని దుయ్యబట్టారు. తెలంగాణ గోస 70 ఏండ్ల నాటిదని, 1969 నాటి ఉద్యమంలో అనేక మంది విద్యార్థులు అమరులయ్యారని చెప్పారు. నీళ్లు నిధులు, నియామకాలతో కేసీఆర్ సాధించిన తెలంగాణ.. స్వయంపాలనలో ఎంతో అభివృద్ధి జరిగిందని వివరించారు. నాడు కనీసం తాగునీళ్లు లేని దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్న తెలంగాణలో కేసీఆర్ మిషన్ భగీరథ తీసుకొచ్చి, ఇంటింటికీ నల్లా నీళ్లు ఇచ్చేలా చేశారని తెలిపారు. తెలంగాణ కోసం 1969, 72లో జరిగిన ఉద్యమాల గురించి అందరికీ తెలియదని, కేసీఆర్ ఆధ్వర్యంలో 2001 నుంచి 2014 వరకు జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు అందరికీ గుర్తున్నాయని తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు.
తెలంగాణ భవన్లో దీక్షాదివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నామని తలసాని వివరించారు. కేసీఆర్ ఆమరణ దీక్షపై 7 నిమిషాల నిడివి గల డాక్యుమెంటరీ వీడియో ప్రదర్శన ఉంటుందని తెలిపారు. కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారని తెలిపారు. మాజీ మంత్రుల నుంచి కార్యకర్తల వరకు అందరూ భాగస్వాములు అవుతారని తెలిపారు.