MLA Harish Rao | హైదరాబాద్, ఆగస్టు 1(నమస్తే తెలంగాణ): ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా స్వాగతిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. దీంతో వర్గీకరణపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషి ఫలించిందని చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో తొలిసారిగా ఏకగ్రీవ తీర్మానం చేసి, ఆ తీర్మానాన్ని ప్రధాన మంత్రికి అందజేసిందే కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమని గుర్తుచేశారు.
గురువారం ఆయన శాసనసభలో ఎస్సీవర్గీకరణ అంశంపై మాట్లాడుతూ.. తెలంగాణ తొలి ప్రభుత్వం ఏర్పాటుకాగానే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2014 నవంబర్ 29న ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానం చేశారని చెప్పారు. అంతేకాకుండా కేసీఆర్ నాటి మాదిగ నేతలను వెంట తీసుకెళ్లి ప్రధానమంత్రిని కలిసి వర్గీకరణ ఆవశ్యకతను వివరించి, తీర్మాన కాపీని అందజేశారని తెలిపారు. నాడు ప్రధాని కూడా కేసీఆర్ చెప్పిన అంశంపై సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.
ఎస్సీ వర్గీకరణ పోరాటం ఎంతో సుదీర్ఘమైనదని, ఎంతోమంది ప్రాణాలు అర్పించారని ఆవేదన వ్యక్తంచేశారు. అమరుల కుటుంబాలను, బాధితులను బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం అదుకొని అండగా నిలిచిందని పేర్కొన్నారు. ఉద్యమానికి మద్దతుగా గాంధీభవన్‌లో పెట్రోలు పోసుకొని ఆత్మాహుతికి పాల్పడితే నాటి కాంగ్రెస్ ప్రభుత్వం వారిని పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే బాధితులకు ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబాలను అదుకున్నదని తెలిపారు.
ఎస్సీ వర్గీకరణ చేయకుండా కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ద్రోహం చేసిందంటూ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో పెద్ద ఎత్తున మాదిగలు గాంధీభవన్‌కు వచ్చి పోరాటం చేసిన రోజులను గుర్తు చేసుకోవాలని సూచించారు. ఏదిఏమైనా దశాబ్దాల కల నెరవేరిన సందర్భమని, చాలా సంతోషకరమైన రోజు అని చెప్పారు. ఎస్సీ వర్గీకరణతోపాటు స్కిల్ యూనివర్సిటీకి కూడా తమ పార్టీ మద్దతు ఇస్తున్నదని స్పష్టంచేశారు.
ఎస్సీ వర్గీకరణ, ఇతర అంశాలపై సభలో బీఆర్ఎస్ నుంచి ఎవరు మాట్లాడాలి? ఎవరికి మైక్ ఇవ్వాలి? అనే అంశంపై స్పీకర్‌కు, మాజీ మంత్రి హరీశ్‌రావుకు మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఒక అంశంపై ప్రతిపక్షం నుంచి ఎవరు మాట్లాడుతారో పేరు తీసుకొని వారికి మైక్ ఇచ్చే సంప్రదాయం సభలో ఉన్నదని, కానీ ఇప్పుడు సభా సంప్రదాయాలను తుంగలో తొక్కుతున్నారంటూ హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై స్పీకర్ స్పందిస్తూ.. మీరు నాకు, చైర్‌కు నేర్పించాల్సిన అవసరం లేదని అన్నారు. హరీశ్‌రావు మాట్లాడాలని, ఎస్సీ వర్గీకరణ తప్ప మరే అంశంపై మాట్లాడితే వెంటనే మైక్ కట్ చేస్తానని స్పష్టంచేశారు. హరీశ్‌రావు ఎస్సీ వర్గీకరణపై మాట్లాడటం పూర్తయిన తర్వాత రెండు రోజులపాటు సభలో జరిగిన పరిణామాలను ప్రస్తావించే ప్రయత్నం చేశారు. ‘నిన్న, ఈ రోజు సభ జరిగిన తీరు మా హృదయాలను గాయపరిచింది’ అని హరీశ్‌రావు అనగానే మైక్ టక్కున కట్ అయిపోయింది.
రేవంత్‌రెడ్డి చీఫ్ మినిస్టర్‌గా కాకుండా, చిల్లరగా మాట్లాడే చీప్ మినిస్టర్‌గా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఈ మేరకు గురువారం ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘నాకు మంత్రి పదవి ఎవరి భిక్ష వల్లనో రాలేదు. సోనియాగాంధీ కోరిక మేరకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరాము తప్ప పదవుల కోసం కాదు. నాకు మంత్రి పదవి వచ్చినప్పుడు టీఆర్ఎస్లోనే ఉన్నావు. ఆ ఊరేగింపులోనూ ఉన్నావు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు కూడా నా వెనకే ఉన్నావ్.. నికి నికి చూశావ్. ఇదంతా నీ కండ్ల ముందు జరిగిందే. కానీ ఇవేమీ తెలియనట్టు చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నావు. పదవులు, విలువల గురించి మాట్లాడే హకు నీకెకడిది రేవంత్‌రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో పదవులను గడ్డిపోచలుగా త్యజించిన చరిత్ర మాది. పూటకో పార్టీ మారిన రాజకీయ చరిత్ర నీది. పదవుల కోసం పెదవులు మూసుకున్న చరిత్ర నీది. ముఖ్యమంత్రి అయినప్పటికీ హుందాగా ప్రవర్తించడం లేదు. చీఫ్ మినిస్టర్‌గా కాకుండా, చిల్లరగా మాట్లాడే చీప్ మినిస్టర్‌గా వ్యవహరిస్తున్నారు’ అని ట్వీట్ చేశారు.
స్పీకర్: ఎస్సీ వర్గీకరణ అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ నుంచి ఎవరు మాట్లాడుతారో డిసైడ్ చేసి చెప్తే అవకాశం ఇస్తాను. ఒకవేళ ఎస్సీ వర్గీకరణ అంశం కాకుండా మరో విషయం మాట్లాడితే మైక్ కట్ చేస్తా.. ఈ విషయాన్ని ముందే చెప్తున్నా.
హరీశ్‌రావు: శాసనసభాపక్షం తరుపున సభా సంప్రదాయ ప్రకారం పార్టీ తరుపున ఎవరు మాట్లాడుతారో ఆ పార్టీని అడిగి, వాళ్లు ఎవరికి సూచిస్తే వాళ్లకు మైక్ ఇచ్చే సంప్రదాయం ఉన్నది. కానీ మీరు సభా సంప్రదాయాల ప్రకారం అవకాశం ఇవ్వడం లేదు.
స్పీకర్: ఈ సభలో ప్రతి సభ్యుడికి మాట్లాడే అర్హత ఉన్నది. మీరు(హరీశ్‌రావు) చైర్‌కు(స్పీకర్ కుర్చీకి) నేర్పించాల్సిన అవసరం లేదు. మీకు అవకాశం ఇచ్చిన మాట్లాడండి అంతే. నాకు నేర్పించాల్సిన అవసరం లేదు, చైర్‌కు నేర్పించాల్సిన అవసరం లేదు. మీరు మాట్లాడండి.
హరీశ్‌రావు: సభలో అందరికీ మాట్లాడే హక్కు ఉన్నప్పటికీ ఏదైనా ఒక అంశంపై ప్రధాన ప్రతిపక్షం నుంచి ఎవరు మాట్లాడుతారో అని అడిగి, ఆ ప్రధాన ప్రతిపక్షం ఇచ్చిన పేరు తీసుకొని వారికి అవకాశం ఇచ్చే సంప్రదాయం సభలో ఉన్నది. కానీ, సభా సంప్రదాయాలను తుంగలో తొక్కినందుకు నిరసన తెలియజేస్తున్నాను. అంతిమంగా పాండవులే గెలుస్తారు, న్యాయమే గెలుస్తది, ధర్మమే నిలబడుతది. ఈ రోజు మీకు మందబలం, అధికారం ఉన్నదని అహంకారంతో చేస్తున్న పనుల్ని ప్రజలు గమనిస్తున్నారు. మీకు తప్పకుండా గుణపాఠం చెప్పే రోజు వస్తది’ అని హరీశ్‌రావు అధికార పక్షాన్ని హెచ్చరించారు.
ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పును బీఆర్ఎస్ స్వాగతిస్తున్నది. ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ చిత్తశుద్ధితో కృషి చేసింది. మిగతా రాజకీయ పార్టీలన్నీ ఓట్ల రాజకీయం చేశాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక్కరే ఈ అంశాన్ని సామాజిక న్యాయ కోణంలో ఆలోచించారు. అందుకే బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేశారు. ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీకి లేఖ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణ తన బాధ్యత అని కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారు. ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పించటం శుభపరిణామం. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వర్గీకరణ ప్రక్రియను ప్రారంభించాలి. బీఆర్ఎస్ తరపున ప్రభుత్వానికి సహకారం ఉంటుంది.
– బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునివ్వడం శుభపరిణామం. ఈ తీర్పును స్వాగతిస్తున్నాం.ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగకు శుభాకాంక్షలు. తెలంగాణ ఉద్యమం నుంచి ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపాం. సుప్రీంతీర్పు ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను ప్రారంభించాలి.
-మాజీ ఎంపీ వినోద్‌కుమార్
సుప్రీం తీర్పుతో మాదిగలు చేసిన పోరాటం ఫలించిం ది. ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ చిత్తశుద్ధితో కృషి చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ను గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వర్గీకరణ ప్రక్రియను ప్రారంభించాలి.
– రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర
సుప్రీం తీర్పుతో మా బిడ్డల చిరకాల వాంఛ నెరవేరింది. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. తెలంగాణ ఉద్యమం నుంచి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచారు. కేసీఆర్ చేసిన కృషిని మాదిగ సమాజం గుండెల్లో పెట్టుకుంటుంది. అమరుల ఆత్మలు సుప్రీం కోర్టు తీర్పుతో హర్షిస్తాయి.
– ఎమ్మెల్యే మాణిక్‌రావు
ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం తీర్పు చారిత్రాత్మకమైనది.మాదిగల దశాబ్దాల కల నెరవేరిన రోజు. మాదిగ జాతి పోరాట ఫలితం, అమరుల త్యాగ ఫలితం, మంద కృష్ణమాదిగ అలుపెరుగని పోరాటమే ఈ తీర్పు విజయం.
– కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి
అధర్మం తాతాలికంగా గెలిచినా ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని ఆనాడు కన్నీళ్లతో ఇకడి నుంచి వెళ్లిపోయాం. ఈ విజయం కోసం 30 ఏండ్లు తపనతో కూడిన పోరాటం చేశాం. అమరులైన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి బిడ్డలకు ఈ విజయం అంకితం. ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు జరిగాయి. కొంతమంది వెన్నుపోటు పొడిచారు. ఎన్నో రాజకీయ పార్టీలు, వ్యక్తులు మా వైపు నిలబడ్డారు. న్యాయాన్ని, ధర్మాన్ని బతికించడం కోసం మా వైపు నిలబడ్డ అందరికీ ధన్యవాదాలు. సమాజంలో పెద్దలు, మీడియాకు కృతజ్ఞతలు. ప్రధాన న్యాయమూర్తులతోపాటు, ఇతర న్యాయమూర్తులకు ధన్యవాదాలు. మాకు అండగా నిలబడ్డ ప్రధాని మోదీ, అమిత్‌షా, భుజాన వేసుకొని మా వైపు ఉన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి కృతజ్ఞతలు. చంద్రబాబు ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతుందన్న నమ్మకం మాకు ఉంది. సుప్రీంకోర్టు తాజా తీర్పును తెలుగు రాష్ట్రాల్లో విద్య, ఉద్యోగ నియామకాల్లో అమలు చేయాలి. ప్రభుత్వాల దగ్గర ఎస్సీ జనాభా లెకలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుత ఉద్యోగ నియామకాల్లో కూడా అమలు చేయాలి.
– ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
50 ఏండ్ల ఎస్సీ వర్గీకరణ కల నెరవేరింది. ఈ వర్గీకరణ ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. అందరికీ సమన్యాయం, సమధర్మం కోసమే ఈ తీర్పు. ఇది చరిత్రలో నిచిలిపోయే రోజు. వర్గీకరణకు కృషి చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు.
– మంత్రి దామోదర రాజనర్సింహ
ఎస్సీ వర్గీకరణకు అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపాయి. తెలుగుదేశం, బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు వర్గీకరణకు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. సుప్రీం తీర్పున అందరూ ఆహ్వానించాలి.
– ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ముప్పై ఏండ్లుగా మాదిగలు పడుతున్న ఆవేదనను సుప్రీం కోర్టు న్యాయమూర్తులు అర్థం చేసుకుని తీర్పు ఇచ్చారు. ఈ తీర్పులో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదు. పార్లమెంటులో బిల్లు పెడుతామని రాజకీయ పార్టీలు మోసం చేశాయి. ఎంతో మంది మాదిగ బిడ్డల త్యాగాల ఫలితమే వర్గీకరణ తీర్పు.
– ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్
ఎస్సీ వర్గీకరణకు సహకరించినందుకు గురువారం తెలంగాణభవన్‌లో పార్టీ వర్కింగ్‌ప్రెసిడెంట్ కే తారకరామారావు, మాజీ మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలుపుతున్న ఎమ్మార్పీఎస్ నేత వంగపల్లి శ్రీనివాస్ తదితరులు