KCR | హైదరాబాద్, ఆగస్టు1 (నమస్తే తెలంగాణ): దశాబ్దాల పోరాటం ఫలించింది. ఎస్సీ వర్గీకరణకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించే అధికారం రాష్ర్టాలకు ఉందని దేశ అత్యున్నత న్యాయస్థానం దళితజాతికి తీపికబురు అందించింది. ఈ మేరకు 7సభ్యులతో కూడిన బెంచ్ తీర్పు ను వెలువరించడంతో దళితవర్గాల్లోనే కాకుం డా, రాజకీయవర్గాల్లోనూ సర్వత్రా హర్షాతీరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఎస్సీలకు రాజ్యాంగబద్ధంగా 15 శాతం రిజర్వేషన్ అమలవుతున్నది. ఆ కోటాలో మాలలే ఎకువగా లబ్ధి పొందుతున్నారనే చర్చ 1970లోనే మొదలైంది.జనాభాపరం గా మాలలకన్నా మాదిగల సంఖ్య ఎకువై నా, విద్యా, ఉద్యోగావకాశాల్లో మాదిగలు చాలా తకువ స్థాయిలో ఉన్నారనేది వర్గీకర ణ ఉద్యమానికి మూలం. అన్యాయంపై మాదిగలు పోరుబాట పట్టడంతో 1995లో అప్పటి ప్రభుత్వం జస్టిస్ రామచంద్రరాజు కమిషన్‌ను నియమించింది.మాదిగల వాదన నిజమేనని సమర్థిస్తూ ఆ కమిషన్ 1996లో నివేదికను సమర్పించగా, 1997జూన్‌లో ఆనాటి తెలుగుదేశం (ఎన్డీఏ భాగస్వామ్యం) ప్రభుత్వం 15శాతం ఎస్సీ కోటాను ఏ, బీ, సీ, డీగా విభజిస్తూ జీవోను విడుదల చేసింది.
‘ఏ’ గ్రూపులో రెల్లి, దాని అనుబంధ కులాలు సహా మొత్తం 12 కులాలను కలుపుతూ వారికి ఒక శాతం కోటాను ఇచ్చారు.
‘బీ’ గ్రూపులో మాదిగ, దాని ఉపకులాలు మొత్తం 18 కులాలను చేరుస్తూ వారికి 7శాతం కోటాను కేటాయించారు.
‘సీ’ లో మాల, దాని ఉపకులాలు మొత్తం 25 కులాలను చేరుస్తూ వారికి 6శాతం కోటా ఇచ్చారు.
‘డీ’ లో ఆది ఆంధ్రులతో మొత్తం 4 కులాలను చేర్చి, 1శాతం కోటా నిర్ణయించారు.
ఇందులో ఆనాటికి ఏ,బీ గ్రూపుల కులా లు తకువ లబ్ధిపొందాయని, సీ, డీ గ్రూపుల కులాలు జనాభాశాతానికి మించి లబ్ధిని పొం దాయని గుర్తించారు. 2000 సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం ఎస్సీలను వర్గీకరిస్తూ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ అనే చట్టం చేసింది. అవిభాజిత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఈ చట్టాన్ని ఏకగ్రీవంగా ఆమోదించగా, అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ఆమోదంతో అమల్లోకి వచ్చింది. ఎస్సీలను ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా వర్గీకరిస్తూ,వెనుకబాటుతనం, జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ కోటాను అమలు చేశారు. 2004 నవంబర్‌లో సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేయడంతో ఈ చట్టానికి మరోసారి చుకెదురైంది. ఎస్సీ కులాల జాబితాలో జోక్యం, పునర్వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని తేల్చిచెప్పింది. నాటి నుంచి ఈ పంచాయతీ పెండింగ్‌లోనే ఉన్నది. తాజాగా సుప్రీంకోర్టుకు చెందిన 7 సభ్యుల ధర్మాసనం ఎస్సీ రిజర్వేషన్‌ను వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ర్టాలకు ఉందని తేల్చిచెప్పడంతో దళితవర్గాల్లో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఎస్సీ వర్గీకరణ అమలుకు దళితవర్గాలు దశాబ్దాలుగా అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నాయి. ఎన్నికలప్పుడు జాతీయ పార్టీలు హామీ ఇవ్వడం, అధికారంలోకి వచ్చాక అటకెక్కించడం పరిపాటి. 2004లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం రాజ్యాంగ సవరణ కోరు తూ అసెంబ్లీలో తీర్మానం చేయగా, దానికి ప్రతిస్పందనగా సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఉషా మెహ్రా కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 2008 మేలో అప్పటి మంత్రి మీరాకుమార్‌కు కమిషన్ నివేదికను సమర్పించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341ని సవరించాలని, ఆ ఆర్టికల్‌లో 3వ క్లాజును చేర్చడం ద్వారా, రాష్ట్ర అసెంబ్లీలు ఏకగ్రీవ తీర్మానం చేసిన పక్షంలో కులాల వర్గీకరణను పార్లమెంటును ఆమోదించవచ్చని కమిషన్ సిఫార్సు చేసింది.
కానీ కేంద్రంలోని కాంగ్రెస్ దానిని పట్టించుకోలేదు. 2014 ఎన్నికలప్పుడు తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని ప్రకటించిన మోదీ అండ్ బీజేపీ నేతలు ఇప్పటి వరకూ దానిని పట్టించుకోలేదు. గతేడాది నవంబర్‌లో హైదరాబాద్ వేదికగా నిర్వహించిన విశ్వరూప సభ వేదికగా ఎస్సీవర్గీకరణపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని ప్రధాని మోదీనే వాగ్ధానం చేశారు. ఆ తరువాత వర్గీకరణ అంశంపై మళ్లీ కమిటీ వేస్తామని ప్రకటించారు. 2నెలలకు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పరిష్కరించేందుకు కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా నేతృత్వంలో 5సభ్యుల కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించి చేతులు దులుపుకున్నది. ఇప్పటికీ ఆ కమిటీ అతీగతి లేకుండా పోయింది.
ఎస్సీ వర్గీకరణకు ఉద్యమకాలం నుంచే కేసీఆర్ బాసటగా ఉన్నారు. రిజర్వేషన్ల వర్గీకరణ ప్రాధాన్యతపై గళాన్ని వినిపించారు. దళితవర్గాలు చేసిన ధర్నాల్లోనూ పాలుపంచుకున్నారు. 2014లో పార్టీ మ్యానిఫెస్టోలో పొందుపరిచి మద్దతు తెలిపారు. అధికారంలోకి వచ్చిన అనంతరం ఎస్సీ వర్గీకరణ కోసం 2014 నవంబర్ 29న అసెంబ్లీలో తీర్మానం చేశారు. 2016 మే11వ తేదీన ప్రధాని నరేంద్రమోదీని స్వయంగా కలిసి ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరించాలని విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను 2017లో తీసుకొచ్చారు.