Minister Harish Rao | జహీరాబాద్ : ఏ పార్టీ ఎన్ని ట్రిక్కులు ప్లే చేసినా.. ముఖ్యమంత్రి కేసీఆర్ దే హ్యాట్రిక్ అని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో సామాజిక కార్యకర్త ఢిల్లీ వసంత్ సోమవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనకు మంత్రి హరీశ్‌రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ చెరుకు రైతుల కోసం జహీరాబాద్ గల్లీ నుంచి ఢిల్లీకి పాదయాత్ర చేసిన ఉద్యమకారుడు వసంత్ అని కొనియాడారు. రైతుల కోసం నిస్వార్థంగా ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఉద్యమం చేశారని ప్రశ్నించారు. బీఆర్ఎస్తోనే రైతులకు మేలు జరుగుతుందని ఆయన పార్టీలో చేరారన్నారు.
కేసీఆర్‌ను చూసి మహారాష్ట్రలో రాజకీయ పార్టీలు గడగడలాడుతున్నాయన్నారు. జహీరాబాద్‌కు చెందిన ముగ్గురు ముఖ్య నాయకులు బీఆర్ఎస్లో చేరానని, మిగిలిన పార్టీలు బయటి నుంచి నాయకులను తెచ్చుకోవాల్సిందేనన్నారు. ‘ఆబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదం దేశం అంతా వినిపిస్తోందన్నారు. కేసీఆర్ అధికారంలోకి రాకముందు.. ఈ ప్రాంతంలో ఎకరా భూమి రూ.5లక్షలు ఉండేదని, ఇప్పుడు రూ.50లక్షలు అయ్యిందన్నారు. కేసీఆర్ తీసుకొచ్చిన రైతు సంక్షేమ పథకాల వల్లే భూముల రేట్లు పెరిగాయని, ఉమ్మడి రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు సంవత్సరాలు పాలించిన చంద్రబాబే తెలంగాణ భూముల ధరల పెరుగుదల గురించి చెబుతున్నారన్నారు. గతంలో ఆంధ్రాలో ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చేదని, కానీ.. కేసీఆర్ పాలనలో తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో వంద ఎకరాలు వస్తోంది అని చంద్రబాబు అన్నారని గుర్తు చేశారు. విద్యా, వైద్యం, ఉద్యోగాలు, ఐటీ, పరిశ్రమలు ఇలా అన్నీ రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందిందని చెప్పారు.
కాంగ్రెస్ హయాంలో ఎరువుల కోసం పోలీస్ స్టేషన్ ఎదుట లైన్లు, నీళ్ల కోసం నల్లా ఎదుట లైన్లు ఉండేవని గుర్తు చేశారు. కాంగ్రెస్ పోయింది కాబట్టే.. ఈ సమస్యలు పోయాయన్నారు. 60 ఏళ్లలో జరగని అభివృద్ధి కేసీఆర్ నాయకత్వంలో 9ఏళ్లలో జరిగిందన్నారు. బీఆర్ఎస్ లక్ష్యం లక్ష్యం తెలంగాణ అభివృద్ధి అని, ఇతర పార్టీల లక్ష్యం రాజకీయాలన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పదికి పది స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ సింగూర్ జలాలు మెదక్ జిల్లాకే అని ఎన్నికల హామీ ఇచ్చాయని.. గెలిచాక హామీని మర్చిపోయారని.. కేసీఆర్ సింగూర్ నీటిని ఉమ్మడి మెదక్ జిల్లాకే ఇచ్చారన్నారు.