వ్యవసాయ యూనివర్సిటీ, జనవరి 31 : పదేండ్ల కేసీఆర్ హయాంలో తెలంగాణలో చేపట్టిన రైతు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివిధ రాష్ర్టాల రైతులు గుర్తుచేసుకున్నారు. రాష్ట్రంలో క్షేత్ర ప్రదర్శనకు వచ్చిన వారు ‘మేము ము ఖ్యంగా కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని స్వయంగా చూసేందుకే వచ్చాం’ అని తెలుపడం గమనార్హం. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ అనుబంధ నూనెగింజల పరిశోధన సంస్థను శనివారం వారు సందర్శించారు.
ఐసీఏఆర్- ఐఐఓఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్- ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయిల్‌సీడ్స్ రీసెర్చ్) డైరెక్టర్ డాక్టర్ ఆర్కే మాథుర్ ఆధ్వర్యంలో పరిశోధనా సంస్థ ఫామ్‌లో నిర్వహించిన ‘జాతీయ నూనెగింజల కిసాన్ మేళా’లో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశా రు. ‘కేసీఆర్‌కే శాసన్ కో దేఖ్నే కేలియే ఆయే హమ్.. కిసాన్ భరోసానే రాష్ర్ట్కో నయీ పెహచాన్ దిలాయీ.. బంజర్ భూమికో ఉప్జావూ బనానేవాలా నాయక్ కేసీఆర్.. వో నహోతేతో హా లత్ కుచ్హౌర్ హోతే’ అంటూ ప్రశంసించారు. గత సీఎం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, 24 గంటల కరెంట్, సాగు నీటి సౌకర్యం, రైతు బంధు, రైతు భీమా తదితర రైతులకు అండగా నిలిచిన పథకాల అమలు తీరును విశ్లేషించారు.
వాటి ఫలితాల వల్లే వరి ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే ముందున్నదని గుర్తుచేశారు. కేసీఆర్ ఈ సారి కూడా అధికారంలో ఉండి ఉంటే ఇంకా బాగా చేసేవారని, దేశమంతా కేసీఆర్ వైపు చూసేది అంటూ రైతులు ముచ్చటించారు. వారు కేసీఆర్‌ను కొనియాడుతుంటే రాష్ట్ర రైతులు సైతం హర్షం వ్యక్తంచేశారు. ఓవైపు దేశంలోని వివిధ రాష్ర్టాల రైతులు కూడా కేసీఆర్ ఔన్నత్యాన్ని గుర్తించి ఆయన సేవలను కొనియాడుతుంటే తెలంగాణలో కాంగ్రెస్ పాలకులు మాత్రం బీఆర్ఎస్ పాలనపై దుష్ప్రచారం చేస్తున్నారని స్థానిక రైతులు వాపోయారు.
కేసీఆర్ పదేండ్ల పాలనలో రైతుల సంక్షేమమే తొలి ప్రాధాన్యతగా పనిచేశారని, అతి తక్కువ కాలంలోనే అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి, రైతులకు అన్ని విధాలా ప్రోత్సాహం అందించి వ్యవసాయంలో ముఖ్యంగా వరి సాగులో రాష్ర్టాన్ని అగ్రస్థానంలో నిలబెట్టారని గుర్తుచేసుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర సర్వే సంస్థలు గుర్తించినా రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు కావాలనే రాజకీయ కక్షతో తప్పడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. క్షేత్ర సందర్శనలో మహారాష్ట్ర, కర్ణాటక , తమిళనాడు, రాజస్థాన్, మణిపూర్, మేఘాలయ, త్రిపుర రాష్ర్టాలకు చెందిన రైతులు ఉన్నారు. నూనెగింజల పరిశోధనా సంస్థలో క్షేత్ర ప్రదర్శన అనంతరం రైతులు పీజేటీఏయూలో క్షేత్ర ప్రదర్శనను తిలకించారు. వారి సందేహాలను ప్రధాన శాస్త్రవేత్తలు డీ సతీష్ కుమార్, డాక్టర్ జీ సురేశ్ తీర్చారు.