Congress | హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): ఏనుగెళ్లింది.. తోక చిక్కింది.. అన్న చందాన భాషా పండితులు, పీఈటీల అప్‌గ్రేడేషన్‌పై గల కోర్టు కేసు ఇటీవలే కొలిక్కివచ్చింది. చేసిందంతా కేసీఆర్ ప్రభుత్వం అయితే, ఉపాధ్యాయుల జీవితాల్లో తామే వెలుగులు నింపామంటూ కాంగ్రెస్ సర్కారు సొంత డబ్బా కొట్టుకుంటున్నది.
ఈ క్రెడిట్‌ను కొట్టేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పాకులాడుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో చెప్పతరం కాని బాధలు అనుభవించిన గ్రేడ్-2 భాషాపండితుల వెతలు తీర్చేందుకు గత కేసీఆర సర్కారు శతవిధాలా ప్రయత్నించింది. ఆఖరుకు అప్‌గ్రేడేషన్ ఆశను నెరవేర్చింది. ఈ దశలో ఎన్నో అడ్డంకులు, కోర్టు కేసులు వచ్చిపడ్డాయి. అయినా ఇచ్చిన మాటకు కట్టబడి భాషా పండితులు, పీఈటీల్లో నవోదయం నింపేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు.
ఈ దశలోనే ఎన్నికలు వచ్చి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కోర్టు కేసు ఇటీవలే కొలిక్కివచ్చింది. మల్టీజోన్-1లో పదోన్నతులు దక్కాయి. మల్టీ జోన్-2లో నేడో, రేపో దక్కనున్నాయి. రాష్ట్రంలో శనివారం వరకు 10,851 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కాయి. వీరిలో 8,630 మంది భాషా పండితులు, 1,849 మంది పీఈటీలు ఉన్నారు. మల్టీజోన్-2లో మరో 8 వేల మందికి రెండు మూడు రోజుల్లో పదోన్నతులు దక్కనున్నాయి. వీరిలో భాషాపండితులు, పీఈటీలు, సెకండరీ గ్రేడ్ టీచర్లు ఉన్నారు.
కేసీఆర్‌దే ఆ క్రెడిట్
రాష్ట్రంలో భాషాపండితులు, పీఈటీల అప్‌గ్రేడేషన్ అనే హామీని నెరవేర్చిన ఘనత ఒక్క కేసీఆర్‌కే దక్కుతుంది. ఇదే కాదు 2015 నుంచి ఉపాధ్యాయులకు పదోన్నతులు లేవు. 2018 నుంచి బదిలీలు చేపట్టలేదు. వీటిని 2023లో కేసీఆర్ సర్కారే ప్రారంభించింది. టీచర్ల తంటాలు తీర్చింది, పదోన్నతులు కల్పించేందుకు చొరవ తీసుకున్నది కేసీఆర్ సర్కారు అయితే ఈ క్రెడిట్‌ను నేటి రేవంత్‌రెడ్డి సర్కారు కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నది. చర్రితలో లేనట్టుగా తామే పదోన్నతులు ఇచ్చినట్టు ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం శుక్రవారం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేయడం విడ్డూరం.
2023లోనే పదోన్నతులు, బదిలీల షెడ్యూల్
వివిధ కారణాలతో 2015 నుంచి టీచర్లకు పదోన్నతులు లేవు. 2018 నుంచి బదిలీలు చేపట్టలేదు. ఎట్టకేలకు 2023 జనవరిలో టీచర్ల బదిలీలు, పదోన్నతులకు కేసీఆర్ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సవివరమైన మార్గదర్శకాలతో కూడిన జీవో నంబర్-5ను 25-1-2023న జారీ చేసింది. ఆ తర్వాత కొన్ని సవరణలు చేస్తూ తేదీ 7-2-2023న జీవో నంబర్-9ని జారీచేసింది. బదిలీల షెడ్యూల్‌ను సైతం విడుదల చేసి, ఉపాధ్యాయుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించింది.
ఈ షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలోని 79,000 మందికి పైగా టీచర్లు బదిలీలు కోరుతూ దరఖాస్తులు సమర్పించారు. సవ్యంగా బదిలీలు జరగాల్సిన తరుణంలో సీనియారిటీ జాబితాల రూపకల్పనపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ కొందరు, టెట్ అర్హత గల వారికే ఇవ్వాలని పలువురు టీచర్లు కోర్టును ఆశ్రయించడంతో ప్రక్రియ నిలిచింది. ఆ తర్వాత జీవో-5, జీవో-9 చట్టబద్ధతను ప్రశ్నిస్తూ కొందరు హైకోర్టులో కేసు వేశారు. ఈ రెండు జీవోలకు చట్టబద్ధత లేకపోవడంతో అసెంబ్లీలో ప్రవేశపెట్టి బదిలీల జీవోలకు ప్రభుత్వం చట్టబద్ధతను కల్పించింది. ఆ తర్వాత 2023 ఆగస్టులో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ప్రారంభించారు.