వరంగల్, మే 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/భద్రాద్రి కొత్తగూడెం: నేల ఈనిందా అన్నట్టుగా నలుదిక్కులా మానుకోటలో జనం పోటెత్తారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రోడ్‌షోకు భారీ ఎత్తున తరలివచ్చిన జనంతో ఇందిరా జంక్షన్ కిటకిటలాడింది. జై కేసీఆర్.. సీఎం కేసీఆర్ నినాదాలతో ఆ ప్రాం తమంతా మార్మోగింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మహబూబాబాద్‌లో కేసీఆర్ నిర్వహించిన రోడ్‌షో విజయవంతమైంది.
కొత్తగూడెం నుంచి వచ్చే రోడ్డులో కేసీఆర్‌కు స్వాగతం పలికేందుకు జనం బారులు తీరారు. రెండు కిలోమీటర్ల పొడవునా ప్రజలు కేసీఆర్‌కు అపూర్వస్వాగతం పలికారు. కేసీఆర్ బస్సు యాత్ర ప్రవేశించినప్పటి నుంచి మహబూబాబాద్ పట్టణంలో నుంచి రోడ్ షో ముగిసే వరకు బస్సుతోపాటే వేలాది జనం వెంట నడిచారు.
డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట, ములు గు, ఇల్లందు, పినపాక, భద్రాచలం నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో వచ్చిన ప్రజలతో పట్టణంలోని వీధులన్నీ కికిరిసిపోయాయి. కేసీఆర్‌ను చూసేందుకు, ఆయన ప్రసంగం వినేందుకు జనం ఓపికగా వేచి చూశారు. కేసీఆర్ ప్రసంగానికి మధ్యలో పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
తెలంగాణ మలి ఉద్యమంలో మహబూబాబాద్‌తో ఉన్న అనుబంధం, అక్కడి పోరాటాలను కేసీఆర్ గుర్తు చేసినప్పుడు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. సమైక్య రాష్ట్రంలో ఈ ప్రాంతానికి, గిరిజన వర్గాలకు జరిగిన అన్యాయాన్ని కేసీఆర్ వివరించారు. కేసీఆర్ ప్రసంగానికి అడుగడుగునా నినాదాలు హోరెత్తాయి. ఈలలు, చప్పట్లు మార్మోగాయి.
కొత్తగూడెంలో నీరాజనం
ఉద్యమనేత, గులాబీ దళపతి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సుయాత్ర భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో విజయవంతమైంది. అడుగడుగునా జ నం నీరాజనం పలికారు. ఖమ్మం, మహబూబాబాద్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు ఇచ్చారు. ముఖ్య నేతలతో మంగళవారం రాత్రి ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి దిశానిర్దేశం చేశారు. కొత్తగూడెం సింగరేణి అతిథి గృహంలో రాత్రి బసచేసిన కేసీఆర్‌ను బుధవారం కలిసేందుకు జనం బా రులుదీరారు. కేసీఆర్ కోసం భద్రాచలం, మణుగూరు, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో సింగరేణి గెస్ట్‌హౌస్ అభిమానులతో సందడిగా మారింది.
వనమా ఇంటికి వెళ్లిన కేసీఆర్
కొత్తగూడెంలో బస చేసిన కేసీఆర్‌ను మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు పాల్వంచలోని తన ఇంటికి ఆహ్వానించారు. బుధవారం సాయంత్రం బస్సులో కేసీఆర్ పాల్వంచకు వెళ్లారు. కేసీఆర్‌కు మాజీ మంత్రి వనమా కుటుంబసభ్యులు ఘనస్వాగతం పలికారు. వనమా ఇంట్లో తేనేటి విందు స్వీకరించిన కేసీఆర్ వారి కుటుంబసభ్యులతో మాట్లాడి మహబూబాబాద్‌కు బయలుదేరి వెళ్లారు.