హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రూ. 1000 కోట్ల విలువైన 50 ఎకరాల ప్రభుత్వ భూములను కొట్టేయాలని పక్కాగా ప్లాన్ చేసిన ఇద్దరు కబ్జాదారుల కుట్రను కేసీఆర్ నేతృత్వంలోని గత ప్రభుత్వం విజయవంతంగా అడ్డుకుంది. పక్కా ఆధారాలతో హైకోర్టులో వాదించి ఆ భూములను తిరిగి సొంతం చేసుకుంది. అవి ప్రభుత్వ భూములేనంటూ ఈ నెల 14న హైకోర్టు తీర్పు చెప్పడంతో కబ్జాకోరల నుంచి వాటికి శాశ్వత విముక్తి లభించింది. శంషాబాద్ ఔటర్ రింగురోడ్డు నుంచి జాతీయ రహదారి మధ్యనున్న 50 ఎకరాలు 1997 నుంచి కబ్జాదారుల ఆధీనంలోనే ఉన్నాయి. హైకోర్టు తీర్పు తర్వాత ఆ భూములను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) తాజాగా స్వాధీనం చేసుకుంది. రెండు దశాబ్దాలకుపైగా వివాదంలో ఉన్న ఈ భూములను స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం చుట్టూ ఫెన్సింగ్ వేసేందుకు రెడీ అవుతున్నది. ఈ భూముల విషయంలో అటు హెచ్ఎండీఏ కానీ, ఇటు పోలీసులు కానీ జోక్యం చేసుకోరాదంటూ హైకోర్టు రెండు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందంటూ ఇద్దరు పిటిషనర్లు ఇన్నాళ్లు కోర్టుకు నివేదిస్తూ వస్తున్నారు. అయితే, ఇవి బోగస్ ఉత్తర్వులని ఇటీవల తేలడంతో కుట్ర బయటపడింది. వాదనల అనంతరం నవంబర్ 18న హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును రిజర్వు చేసింది. ఈ నెల 14న తుది తీర్పు వెల్లడిస్తూ ఆక్రమణదారుల రిట్ పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆ భూముల్లో ఉన్న ఆక్రమణలను అధికారులు తొలగించి భూములు స్వాధీనం చేసుకున్నారు. ఈ భూముల్లో ట్రక్పార్క్ నిర్మించడంతోపాటు మిగిలిన భూములను ఇతర అవసరాలకు ఉపయోగించుకోనున్నారు.