Telangana | హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): సామాన్యులు, సంపన్నులకే కాదు; చివరికి దేవుళ్లకూ రేవంత్ సర్కారు నుంచి తిప్పలు తప్పడం లేదు. దేవుడి సొమ్ముపై మరో 7% పన్ను విధించాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 5% ఉన్న కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) కాంట్రిబ్యూషన్‌ను ఏకంగా 12 శాతానికి పెంచాలని ప్రభుత్వం నిశ్చయించింది. ఆదాయం ఆధారంగా ఆయా దేవాలయాలను నాలుగు రకాలుగా విభజించి, నాలుగు స్లాబుల్లో (5, 7, 10, 12 శాతాల్లో ) సీజీఎఫ్ వసూలు చేయాలని సర్కారు నిర్ణయం తీసుకున్నది. సీజీఎఫ్ కాంట్రిబ్యూషన్ పెంపు ద్వారా వసూలయ్యే మొత్తాన్ని చిన్న దేవాలయాల కోసం ఖర్చు పెట్టనున్నట్టు దేవదాయశాఖ వర్గాలు తెలిపా యి.
అసలు సీజీఎఫ్ కాంట్రిబ్యూషనే రాజ్యాం గ విరుద్ధమని ధార్మిక సంఘాలు వాదిస్తున్న నేపథ్యంలో, దానిని 12 శాతానికి పెంచడం తీవ్ర విమర్శలకు కారణమవుతున్నది. ‘రాష్ట్రంలో ఎక్కడా చర్చీలు, మసీదుల ఆదాయం పై పన్ను లేదు. అలాంటప్పుడు దేవాలయాల నుంచి మాత్రం ఎట్లా వసూలు చేస్తారు?’ అని ఒక అర్చక సంఘం నేత ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘భక్తులు హుండీలో వేసే కానుకలు, కొనుగోలు చేసే టికెట్లతోనే ఆలయానికి ఆదాయం సమకూరుతుంది.ఒకసారి భక్తులు ముడుపును సమర్పించారంటే ఆ సొమ్ము దేవుడిదేనన్నమాట. అటువంటి దేవుని సొమ్ముపై కాంట్రిబ్యూషన్ పేరుతో పన్ను వేయడం దారుణం. అయినా ఉన్న దేవుడి సొమ్మును తీసి లేని దేవుడికి ఇస్తామని చెప్పడానికి సర్కారు ఎవరు?’ అని ప్రధాన దేవాలయానికి చెందిన అర్చకుడొకరు ఆగ్రహం వ్యక్తంచేశారు.
టెంపుల్ టూరిజం ద్వారా, భక్తుల ద్వారా సర్కారుకు పెద్ద ఎత్తున ఆదా యం సమకూరుతుంది. ఈ నేపథ్యంలో సర్కారు సొమ్ముతో దేవాలయాలను అభివృద్ధి చేయాల్సింది పోయి, దేవుడి సొమ్ము నుంచి వసూళ్లేమిటి? ఆలయాలకు వస్తున్న ఆదాయంలో గండికొట్టడం ఏమిటనే అభ్యంతరం వ్యక్తమవుతున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటైనప్పటినుంచి ఆలయాలకు ఒక్కపైసా ఖర్చుచేసిన దాఖలాలు లేదు. ఆలయాల అభివృద్ధికి నయాపైసా వెచ్చించకపోగా,ధూప దీప నైవేద్యం స్కీమ్‌లో ఒక్క ఆలయాన్ని కూడా చేర్చలేదు. అంతేకాదు, డీడీఎన్ ఆలయాలకు వేతనాలు సక్రమంగా అందడం లేదు.
పుండు మీద కారం చల్లిన చందంగా సీజీఎఫ్ కింద ఆలయాల వాటా ను 5% నుంచి 12 శాతానికి పెంచాలని తాజాగా నిర్ణయించారు. రూ.25 లక్షలు, అంతకన్నా ఎక్కువ ఆదాయం వచ్చే ఆలయాలనుంచి 12%, అసలు ఆదాయం లేని చిన్న ఆలయాలు, మఠాల నుంచి 5% చొప్పున వసూలు చేయాలని నిశ్చయించారు. ఈ మేర కు ఆయా ఆలయాలు, వాటికి వస్తున్న ఆదాయాలనుబట్టి తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఈవోలకు ఆదేశాలు జారీచేశారు. ఈ పన్నుతో నియోజకవర్గాల వారీగా ఆదాయం లేని ఆలయాలను అభివృద్ధి చేస్తామయని చెప్తున్నారు.
హిందూ ఆలయాలు ఇప్పటికే సర్కారీ పన్నుపోటుతో సతమతమవుతున్నాయి. సీజీఎఫ్ కాంట్రిబ్యూషన్‌కు అదనంగా, ప్రతి దేవాలయం నుంచి ఎండోమెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఫీజు కింద 12% వసూలు చేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ వేతనం కోసమని గతంలో 5% ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఫీజును ప్రభుత్వం మరో 7% పెంచి 12% చేసింది. చివరికి ఆలయాల లెక్కలు చూడటం కోసమని 1.5% ఆడిట్ ఫీజు వసూలు చేస్తున్నది. అర్చక వెల్ఫేర్ ఫండ్ కింద 3%, గ్రాంట్ ఇన్ ఎయిడ్ వేతనాలు పొందుతున్న ఉద్యోగులున్న ఆలయాల్లో వారి వేతనాల కోసమని 10 నుంచి 20% వరకు ప్రభుత్వం పన్ను వసూలు చేస్తున్నది. వీటన్నింటినీ కలుపుకుంటే దేవుడి సొమ్ములో దాదాపు 45-50% దాకా సర్కారుకే జమ అవుతున్నది.
‘అసలు ఆలయాలపై సర్కారు పెత్తనాన్ని ఎవరు అడిగారు. ఆలయ సిబ్బందికి వేతనాల కోసం దేవుడి సొమ్ము వాడుతారా? ఆలయం లెక్కలు చూడటానికి దేవుడు పన్ను కట్టాలా? ప్రభుత్వంలోని మిగతా అన్ని శాఖల్లో ఉద్యోగుల వేతనాల కోసం ఆయా శాఖల నుంచి పన్ను వసూలు చేస్తున్నారా? వాటికి లేని పన్ను హిందూ దేవుళ్లపైనే ఎందుకు?’ అని ధార్మిక సంస్థ నాయకుడు ప్రశ్నించారు. మసీదులు, చర్చిలు ప్రభుత్వానికి ఎలాంటి పన్నులూ చెల్లించకున్నా వాటి అభివృద్ధికి, వేతనాలకు నిధులు కేటాయిస్తున్నారని, అదే హిందూ ఆలయాలకు వచ్చే సరికి దేవుడి సొమ్మును లాక్కుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో దాదాపు రూ. 2000 కోట్లు వెచ్చించి యాదగిరిగుట్ట ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఎస్డీఎఫ్ (స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్) ద్వారా నిధులు కేటాయించి ఆలయంలో అభివృద్ధి పనులు నిర్వహించగా, ఇతర నిర్మాణాలు ఆర్అండ్బీ సహా ఇతర శాఖల ద్వారా చేపట్టారు. అనేక ప్రధాన ఆలయాల్లో పెద్దఎత్తున నిధులు వెచ్చించి భక్తుల సౌకర్యాలను మెరుగుపర్చారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల కోసం 35 ఎకరాల భూమిని సేకరించడంతోపాటు ఆలయ అభివృద్ధికి రూ.70 కోట్ల వరకు ఖర్చుచేశారు.
కొండగట్టు ఆంజనేయస్వామి, బాసర జ్ఞానసరస్వతి, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి, భద్రాచలం రామాలయం తదితర ఆలయాల అభివృద్ధికి ప్రణాళికలుసిద్ధం చేసి నిధులు కేటాయించారు. ఇవికాకుండా సీజీఎఫ్ నిధుల ద్వారా 150 గ్రామీణ ఆలయాలను అభివృద్ధి చేసేందుకు కూడా ప్రతిపాదించారు. స్థానికులు రూ. 3లక్షలు సమకూర్చుకుంటే… ప్రభుత్వం సీజీఎఫ్ ద్వారా ఒక్కో ఆలయానికి రూ.10 లక్షల చొప్పున మంజూరు చేయాలనేది ఈ ప్రతిపాదన. అలాగే, ధూప దీప నైవేద్య పథకం(డీడీఎన్) కింద 7,000 పైచిలుకు ఆలయాలకు ప్రతినెలా రూ.10,000 చొప్పున నిధులు విడుదల చేశారు. కాగా, ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ఆలయాలకు ఇంతవరకు నయాపైసా ఖర్చు చేయకపోగా, ఉన్న పన్నులను మరింత పెంచి సర్కారు ఖజానా నింపుకొనేందుకు చర్యలు చేపట్టడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది.