నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 26 : రాష్ట్రంలో ఆరాచకపాలన సాగుతుందని, అందుకు పోలీసులు వంతపాడుతూ బడుగు బలహీన వర్గాలపై దాడులకు పూనుకుంటున్నారని మాజీ మంత్రి సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. నాగర్‌కర్నూల్ మండలం కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన ఘటనపై నాగర్‌కర్నూల్‌లో న్యాయం కోసం ఏర్పాటు చేసి ధర్నా శిబిరాన్ని గురువారం తలసాని సందర్శించి బాధిత గణేశ్ కుటుంబాన్ని పరామర్శించారు. జాతరలో జరిగిన ఘటనలను కుటుంబ సభ్యులతో అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులు పెరిగి పోయాయని, ఇలాంటి ఘటన సీఎం సొంత జిల్లాలో జరగడం దురదృష్టకరమన్నారు.
రజక కుటుంబంపై దాడి చేసినా, పసికందు చనిపోయినా సీఎం నేటికీ స్పందించకపోవడం సిగ్గు చేటన్నారు. రజక కుటుంబాన్ని రూమ్‌లో వేసి కొట్టే అధికారం ఎవడిచ్చిండని, మేం తిరిగి కొట్టలేకనా, రాష్ట్రంలో ఉన్న మావాళ్లంతా కలిసి కొట్టడం ప్రారంభించి మీరు మిగులుతారా, ఎంత అహంకారం ఉంటే ఆ నిరుపేద కుటుంబం దాడి చేస్తారని ప్రశ్నించారు. స్వాతం త్య్రం వచ్చి 79 సంవత్సరాలు అయినా కుల వివక్ష ఇంకా కొనసాగడం దురదృష్టకరమని, ఆలయాలకు వెళితే అంటరాని వారిగా చూడడం అనేది దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయదర్శనానికి రజక తల్లి తన కుటుంబంతో వెళితే ఆమె కుటుంబంపై జరిగిన దాడి చేయడం, తన భర్త గణేశ్‌ను కొట్టొద్దని వేడుకునేందుకు తన పసికందుతో వెళ్లిన మౌనికపై సైతం దాడి చేయడంతో చిన్నారి కూడా మృతి చెందడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఘటన అన్నారు.
ఎంతో భవిష్యత్ ఉన్న ఆ పసిబిడ్డ ప్రాణాలు పోవడం, ఆ తల్లి కడుపుకోతను ఎవరు తీర్చగలమని ఆవేదన వ్యక్తం చేశారు. మనలో ఐక్యత లేకపోతే ఇలాంటి ఆగడాలు జరుగుతూనే ఉంటాయని, మన సమస్యలపై బహుజనులు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు అంతా ఐక్యంగా ఉండి ఇలాంటి ఘటనలపై ఎదిరించినపుడే ప్రభుత్వాల మెడలు వంచడానికి అవకాశం ఉంటుందన్నారు. కుమ్మెర ఘటనలో పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శించినట్లుగా స్పష్టమవుతుందని, కేసు లు నమోదు చేసి బాధితులకు న్యాయం చేయాల్సిం ది పోయి సీఐ ఒక విధంగా, డీఎస్పీ ఒక విధంగా, ఎస్పీ మరో విధంగా ఈ ఘటనపై మాట్లాడుతూ ఘటనకు సంబంధించిన రిపోర్టు కాలేదని, కోర్టు నుంచి డైరెక్షన్ రాలేదని చెప్పడం సిగ్గు చేటన్నారు.
జరిగిన సంఘటనపై బాధితుడు గణేశ్ ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి కేసు నమోదు చేయాల్సి ఉన్నా మూడు గంటలపాటు స్టేషన్లో కూర్చోబెట్టుకోవడమే కాకుండా, వారి ఫిర్యాదు తీసుకోకుండా దాడి చేసిన వారు వచ్చిన తర్వాత కౌంటర్ పిటిషన్ తీసుకొని ఇద్దరిపై కేసులు పెట్టేందుకు ప్రయత్నం చేశారే తప్పా.. బాధితులకు న్యాయం చేయాలనే ఆలోచన పోలీసులకు ఏకోశాన లేకున్నదనేది తేలిపోయిందన్నారు. ఘటన అనంతరం రెండు నెలల పాప మరణిస్తే వారి దాడితోనే గాయాలై చనిపోయిందని కన్న తల్లి చెబుతున్నా నిందితులపై మర్డర్ కేసు పెట్టకుండా నిర్లక్ష్యం చేసున్నారని పోలీసులపై తలసాని మండిపడ్డారు. ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఎంతో మందిపై కేసులు బనాయించారు కదా ఆ కేసులను కోర్టును అడిగే పెట్టారా అంటూ ఎద్దేవా చేశారు.
విచ్చలవిడిగా ఎవరిపైన అంటే వారిపై కేసులు పెట్టిన పోలీసులు అగ్రకులస్తుల దాడిలో చనిపోయిన చిన్నారి విషయంలో మర్డర్ కేసు పెట్టడానికి ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రజాపాలన ఇంటే ఇదేనా ముఖ్యమంత్రి గారు అని తలసాని సూటిగా ప్రశ్నించారు. వెంటనే నిందితులపై మర్డర్‌కేసు పెట్టి జైలులో పెట్టకపోతే ఈ ఉద్యమం ఇక్కడితోనే ఆగదని, రాష్ట్ర వ్యాప్తంగా బహుజనులమంతా కలిసి రోడ్లపైకి వచ్చి ఉద్యమించే సమయం ఆసన్నమైందన్నారు. పదిహేను రోజులు సమయం ఇస్తున్నాం. ఆ లోగా ఏదో విషయం తేల్చకపోతే హైదరాబాద్‌ను దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. కుమ్మెర ఘటన విషయంలో చిన్నారి కుటుంబానికి న్యా యం జరిగేవరకు పోరాటం చేద్దామన్నారు.
చిన్నారి మరణించిన విషయంలో కేసులు పెట్టమంటే పోస్టుమార్టం రిపోర్టు కావాలని తిరకాసు పెడుతున్నారు. అదే అగ్రకులాల వారిని స్టేషన్‌కు పిలిపించి వారి నుంచి ఫిర్యాదు తీసుకొని ఇరువురిపై కౌంటర్ కేసు పెట్టేందుకు ప్రయత్నిస్తారా..? ఇదేం పోలీస్ వ్యవస్థ అంటూ మండిపడ్డారు. ముందు కుమ్మెర జాతర ఘటనలో మరణించిన చిన్నారి విషయంలో నిందితులపై మర్డర్ కేసు పెట్టిన తర్వాత విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. పోస్టుమార్టం రిపోర్టు లేకుండా పాపకు దెబ్బలు తగలలేదని మీరెలా చెబుతారు.. మీదేం పద్ధతి, మీదేం విచారణ అంటూ ప్రశ్నించారు.
ఈ విషయంలో నిందితులపై మర్డర్ కేసు నమోదై జైలుకు పంపే వరకు బహుజనులమంతా ఒక్కటై ఐక్య మత్యంగా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అగ్రవర్ణాలు చూస్తున్న చిన్నచూపు ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలంటే మనలో ఐక్యత చాలా అవసరమన్నారు. ఇప్పటికీ గ్రామాలు, పట్టణాల్లో సంఖ్య బలం మనది అధికారం వారిది సాగుతుందని, ఇది ఎంతకాలం సాగనివ్వమని, మనలో చైతన్య వచ్చే వరకు వారి రాజ్యమే కొనసాగుతుందని దానిని గుర్తించి మన లో ఐక్యత పెరగాలన్నారు. తప్పకుండా గణేశ్ కు టుంబానికి అండగా ఉంటామని, ఈ విషయంలో మా నాయకుడు కేటీఆర్ హామీ ఇచ్చారని, అన్ని విధాలుగా ఆదుకుం టామన్నారు.
అసెంబ్లీలోనూ ఈ ఘటనపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. పోలీసులు కూడా జరిగిన ఘటనపై పూర్వ పరాలు తెలుసుకొని న్యాయం వైపు నడిచే విధంగా చూడాలన్నారు. గుడిలో అన్ని పనులు మేమే చేయాలే కానీ దేవున్ని మొక్కే అధికారం మాకు లేదా అంటూ నిలదీశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలని, అలా జరగకపోతే రాష్ట్రంలో బహుజనులమంతా తప్పకుండా మీ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు వదిలిపెట్టమని హెచ్చరిం చారు.
గణేశ్ కుటుంబానికి న్యాయం చేసేందుకు పార్టీకు అతీతంగా ఆందోళన చేస్తున్న బహుజనులు, రజకులు, వివిధ కుల సంఘాలకు కృతజ్ఞతలు తెలుపుతూ బాధిత కుటుంబానికి న్యా యం జరిగే వరకు అందరం కలిసి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ఆయన వెంట బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బైకాని శ్రీనివాస్‌యాదవ్, స్థానిక బీఆర్ఎస్ నాయకులు, వామపక్ష నాయకులు, బహుజన నాయకులు పాల్గొన్నారు.