రాయికల్, జనవరి 13 : బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలకు విలువనిచ్చారని, రాయికల్ మండలం బోర్నపెల్లి వంతెన నిర్మాణానికి రూ.70 కోట్లు కావాలని విన్నవించగానే మంజూరు చేశారని మాజీ మంత్రి టీ జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో నాయకులు, కార్యకర్తలతో మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2014లో కేసీఆర్ సీఎం అయ్యారని, కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన ఓ మీటింగ్‌లో వ్యక్తిగతంగా తనను గౌరవించారని గుర్తుచేసుకున్నారు.
అప్పుడు బోర్నపెల్లి వంతెన విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, నిధులు మంజూరుచేయాలని విన్నవించగానే రూ.70కోట్లు విడుదల చేశారని గుర్తుచేశారు. నిధులు మంజూరు చేశారని తాను బీఆర్ఎస్లో చేరలేదని, పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నానని చెప్పారు. పదేండ్లపాటు జెండా మోసినం, ఫలితాలు అనుభవించే సమయానికి వచ్చి పొత్తు కూడుతామంటే ఎట్లా ఊరుకుంటామని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ను ఉద్దేశించి జీవన్‌రెడ్డి భగ్గుమన్నారు. కష్టపడినోళ్లే ఫలితాలు అనుభవించాలని తెలిపారు. ప్రత్యర్థి పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, అభివృద్ధి కోసం కాంగ్రెస్ అంటూ చెప్పుకోవడం విడ్డూరమన్నారు.