Harish Rao |కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, పదేండ్లు పాలించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిండని హరీశ్‌రావు తెలిపారు. ప్రాణాన్ని ఫణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. అలాంటి నాయకుడు తెలంగాణను మోసం చేస్తాడా అని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన దీక్షా దివాస్ సన్నాహక సమావేశంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కొన్ని దశాబ్దాల కలను, కోట్ల మంది కలను కేసీఆర్ నిజం చేసిండని తెలిపారు.
అబద్ధాలు చెప్పి మాయమాటలు చెప్పి రేవంత్ రెడ్డి గద్దెనెక్కిండని హరీశ్‌రావు విమర్శించారు. రేవంత్ రెడ్డికి ఎంతసేపు ఓట్ల రాజకీయం తప్ప రాష్ట్రం మీద ప్రజల మీద శ్రద్ధ లేదని మండిపడ్డారు. 42 శాతం రిజర్వేషన్లు అని బీసీలను రేవంత్ రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌కు, ఈ కాంగ్రెస్ నాయకులకు పోలిక లేదని అన్నారు. కాళేశ్వరం కూలిందని ప్రచారం చేస్తారు.. మరి మలన్నసాగర్ లో కొండపోచమ్మలో నీళ్ళెక్కడివి అని ప్రశ్నించారు. ఎక్కడ కాలువలు తవ్వి నీళ్ళు ఇస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందని ఆ పని ఆపేశారని అన్నారు. అలాంటి రాజకీయాల కోసం చూసే కాంగ్రెస్ నాయకులకు మనకు పొంతన లేదని స్పష్టం చేశారు.
ఇక దీక్షా దివస్ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు హరీశ్‌రావు ఒక ప్రతిపాదన చేశారు. ఉద్యమంలో నేను అనే ట్యాగ్‌లైన్‌తో.. తెలంగాణ ఉద్యమం నాటి జ్ఞాపకాలు, అనుభూతులు, పోరాట సన్నివేశాలను గుర్తుచేస్తూ ఫొటోలను సోషల్‌మీడియా హ్యాండిల్స్‌లో షేర్ చేయాలని పిలుపునిచ్చారు. నవంబర్ 29వ తేదీ నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు ఉద్యమ ఫొటోలను రోజుకు ఒకటి షేర్ చేయాలన్నారు. నాలుగేండ్ల పాటు సిద్దిపేటలో దీక్షా శిబిరం నడిపించుకున్నామని హరీశ్‌రావు అన్నారు. ఆ ఉద్యమ జ్ఞాపకాల కోసం క్యాంపు ఆఫీస్ ముందు ఆ పైలాన్ ఏర్పాటు చేసుకోబోతున్నామని తెలిపారు. మీరందరూ ఏకాభిప్రాయంతో సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసుకొని దీక్షా దివస్ ను ప్రారంభించుకుందామని పిలుపునిచ్చారు. అక్కడి నుండి కోటిలింగాల వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి వందనం సమర్పిద్దామని.. ముస్తాబాద్ చౌరస్తా లో జయశంకర్ సార్ విగ్రహనికి పూల మాల వేసి, పాత బస్టాండ్ మీదుగా క్యాంప్ ఆఫీస్ వద్దకు వెళ్లి పైలాన్ శంకుస్థాపన చేసుకుందామని షెడ్యూల్ తెలిపారు. పార్టీ కార్యాలయంలో ఉద్యమ ఫోటో గ్యాలరీ పెట్టుకుందామన్నారు. మీ దగ్గర ఇంకా అరుదైన ఫొటోలు ఉంటే క్యాంపు ఆఫీస్ లో అందించాలని కోరారు. ఆ రోజు అమరుల కుటుంబాలను కూడా సన్మానం చేసుకుందాం. ఆ కుటుంబాలను గౌరవించుకుందామన్నారు. మీ మీ మండలాల్లో ఎవరైనా ఉంటే ఎల్లుండి తీసుకొని రండి.. మంచిగా వారిని గౌరవించుకుందామని చెప్పారు. ఎంత వీలైతే అంత మందిని రమ్మని చెప్పండి. పార్టీ శ్రేణులు, అభిమానులు, ఉద్యమ కారులను తీసుకురావాలన్నారు.