అన్నపురెడ్డిపల్లి, మార్చి 9: సీతారామ ప్రాజెక్టు కాలువ నిర్మాణం కోసం భూములిచ్చిన తమకే ముందుగా సాగునీళ్లివ్వాలని భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాలువల ద్వారా చెరువులను నింపాలని, వాటి ద్వారా తమ పంట పొలాలకు నీళ్లందించాలని కోరారు. ఈ మేరకు సీతారామ కాలువ నిర్మాణానికి భూములిచ్చిన రైతులు నల్లబ్యాడ్జీలు ధరించి అన్నపురెడ్డిపల్లి మండల గుంపెన గ్రామ శివారులోని సీతారామ కాలువ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రాజెక్టు కాలువ కోసం భూములు కోల్పోయిన తమకు ప్రస్తుత ప్రభుత్వం సాగునీళ్లివ్వడం లేదని ఆందోళన వ్యక్తంచేశారు. లింక్ కెనాళ్లతో ఇతర జిల్లాలకు తరలిస్తే ఊరుకోబోమని స్పష్టంచేశారు. రైతులు, బీఆర్ఎస్ నాయకులు వేముల హరీశ్, మామిళ్లపల్లి రామారావు, వెంకటేశ్, ప్రవీణ్, గోపాలరావు, కిరణ్, సుధాకర్, చిరంజీవిరావు, సుబ్బారావు, శ్రీనివాసరావు, సత్యనారాయణ, ప్రసాద్, వెంకటేశ్వరరావు, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ ఫ్లెక్సీకి అభిషేకాలు
ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సీతారామ ప్రాజెక్టును నిర్మించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు తాము జీవితాంతం రుణపడి ఉంటామని అన్నపురెడ్డిపల్లి మండల రైతులు కొనియాడారు. ఈ మేరకు నిరసన దీక్షాశిబిరం వద్ద కేసీఆర్కు రైతులందరూ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం, గోదావరి జలాలతో అభిషేకం చేశారు. ‘జై కేసీఆర్’, ‘జైజై కేసీఆర్’ అంటూ రైతులు చేసిన నినాదాలు మిన్నంటాయి.