KCR | హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కావాల్సినంత టైం ఇచ్చామని, ఇక ఉపేక్షించేది లేదని, ఉతుకుడేనని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడు నెలల పాలనతో ప్రజలు సంతృప్తిగా లేరని, చెప్పిన మాటలకు, ఆచరణకు పొంతనలేదని పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో మంగళవారం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ శాసనసభాపక్ష స మావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనను తూర్పారబట్టారు. డిసెంబర్ 9న చేస్తామన్న రైతురుణమాఫీ ఇప్పుడు మొదలుపెట్టారని, చెప్పినదానికి, చేస్తున్నదానికి పొంతనేలేదని విమర్శించారు. రైతులకు రుణమాఫీ కావడంలేదని, రైతుభరోసా ఇస్తామని చెప్పినా ఇప్పటి వరకు అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు రోడ్లపైనే పోరాటం చేస్తున్నారని గుర్తుచేశారు. ఉద్యోగుల డీఏ, పీఆర్సీపై ఇప్పటికీ ప్రభుత్వం ప్రకటన చేయలేదని మండిపడ్డారు.
కరెంటు విషయమైతే చెప్పాల్సిన పనేలేదని, కరెంటు సకగా వస్తున్నదని ఒకళ్లు కూడా చెప్తలేరని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేద్దామని, ప్రజలతోనే పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. పోరాట కార్యక్రమాలను రూపొందించుకుందామని, త్వరలోనే పార్టీ కార్యవర్గాలను, పార్టీ నిర్మాణాన్ని చేసుకుందామని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ప్రజల అండ, కార్యకర్తల బలం బీఆర్ఎస్కు ఉన్నంతకాలం పార్టీని ఎ వ్వరూ ఏమీ చేయలేరని కేసీఆర్ స్పష్టం చేశా రు. తెలంగాణకు క్లిష్ట పరిస్థితులు అంటూ లేవని, ఉన్నవి ఇష్ట పరిస్థితులేననే విషయాన్ని గమనంలోకి తీసుకొని పార్టీ శ్రేణులు ముందు కు సాగాలని దిశానిర్దేశం చేశారు. రాదనుకున్న తెలంగాణను కొట్లాడి సాధించుకున్నామని, రాజకీయాల్లో చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వంటివారితోనే కొట్లాడామని గుర్తు చేశా రు. తెలంగాణ రాకను అడ్డుకునే ప్రయత్నం చేయడమే కాకుండా పార్టీని కూడా వారు మింగేసే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేద్దామని, బీఆర్ఎస్కు ఎదురు ఉండదని పేర్కొన్నారు.
కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ మారారని, వారి గురించి ఆలోచించవద్దని కేసీఆర్ పేర్కొన్నట్టు సమాచారం. ఒకొకరికి రెండు, మూడుసార్లు పదవులు ఇచ్చామని, ఏం తకువ చేశామని ప్రశ్నించినట్టు తెలిసింది. పార్టీ మారిన వారు వారి భవిష్యత్తును వాళ్లే నాశనం చేసుకున్నారని పేర్కొన్నా రు. పోచారం గురించి సమావేశానికి వచ్చిన వారు ప్రస్తావించగా ఆయనకు ఇంతకన్నా ఎకువ ఏం చేస్తామని అన్నట్టు తెలిసింది. రెండుసార్లు టికెట్ ఇచ్చిన వాళ్లకు మరోసారి వద్దు అని చాలామంది తనతో చెప్పారని, కానీ, తానే పట్టుపట్టి మరీ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నానని, అలాంటివాళ్లు ఇప్పుడు పార్టీ మారారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయించిన వారిపై న్యాయపోరాటం కొనసాగుతుందని, ఇప్పటికే కేసులు వేశామని, దీనిపై కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. 24 ఏండ్లలో పార్టీ అనేకమందిని చూసిందని, ఎంతోమంది కొత్త నాయకులను తయారు చేసిన పార్టీ అని చెప్పారు. ఇప్పుడు కూడా కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుంటామని చెప్పారు. నేటి కార్యకర్తలే రేపటి నాయకులు అని స్పష్టం చేశారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం తప్పదని, కొట్లాడేందుకు సిద్ధమవ్వాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎన్ని రోజులు ఇబ్బంది పెడతారో చూద్దామని, ప్రజల కోసం చేసే పోరాటంలో కొన్ని ఆటుపోట్లు తప్పవని, అందుకు మానసికంగా సిద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు. మాజీమంత్రి మల్లారెడ్డిని ఉద్దేశించి.. ‘మల్లన్నా..కొట్లాడుదామా’ అని కేసీఆర్ ప్రశ్నించగానే ఆయన స్పందిస్తూ కొట్లాడుదామని బ దులిచ్చారు. పార్టీ సమగ్ర కార్యాచరణను రూ పొందిస్తున్నదని, ప్రజల సమస్యలను తీసుకొని పోరాటాలకు రూపునిస్తుందని చెప్పారు.
తాను కూడా అసెంబ్లీకి వస్తానని, బడ్జెట్ సందర్భంగా ఏం చెప్తారో చూద్దామని కేసీఆర్ పేర్కొన్నారు. కాళేశ్వరంపై దుష్ప్రచారమే ఎ కువ జరిగిందన్నారు. సుందిళ్లలో పుషలం గా నీళ్లు ఉన్నాయని మాజీ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. పార్టీ బృందం ఒకసారి మేడిగడ్డకు వెళ్లి వస్తే బాగుంటుందని ఎమ్మెల్యే లు ప్రతిపాదించారు. కేసీఆర్ కూడా అందుకు సరేనన్నారు. బడ్జెట్ సమావేశాలు పూర్తి అయి న తరువాత అయిన ఎమ్మెల్యేల బృందం మేడిగడ్డ సందర్శనకు వెళ్లాలని నిర్ణయించారు.
గడచిన 24 ఏండ్లలో ఎంతోమంది నాయకులను తయారుచేసుకున్నం. ఇప్పుడు కూడా కొత్త నాయకత్వాన్ని తయారుచేసుకుందం. నేటి కార్యకర్తలే రేపటి నాయకులు.
-కేసీఆర్
శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా పార్టీ వ్య వస్థాపక సభ్యుడు, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారిని నియమిస్తున్నట్టు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు. పార్టీ శాసనసభాపక్ష సమావేశంలోనే మధుసూదనాచారి పేరు ను ఆయన ప్రకటించారు. పార్టీ కోసం పనిచేయాలని, రాష్ట్రస్థాయి సమస్యలపై పోరాటం చేయాలని, భూపాలపల్లి నియోజకవర్గంలో గండ్ర వెంకటరమణరెడ్డి పనిచేసుకుంటారని, ఆయనతో సమన్వయం చేసుకోవాలని సిరికొండకు సూచించారు. భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జిగా, పార్టీ అభ్యర్థిగా గండ్రనే ఉంటారని కేసీఆర్ స్పష్టం చేసినట్టు తెలిసింది. పార్టీ కోసం పనిచేసే వారికి పార్టీ ఎప్పటికీ అండదండగా ఉంటుందని చెప్పారు. సమావేశం నుంచే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డికి పార్టీ నాయకులతో కేసీఆర్ ఫోన్ చేయించి మధుసూదనాచారికి పార్టీ శాసనసభాపక్ష నేత పదవి ఇస్తున్నట్టు సమాచారం అందించారు. మధుసూదనాచారి రాష్ట్రస్థాయి పదవిలో కొనసాగుతారని, ఆయనకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తున్నట్టు తెలిపారు.
శాసనసభలో బడ్జెట్‌పై జరిగే చర్చలో పార్టీ తరఫున హరీశ్‌రావు మాట్లాడతారని కేసీఆర్ తెలిపారు. ద్రవ్యవినిమయ బిల్లుపై కేటీఆర్, రైతు రుణమాఫీ, రైతు భరోసాపై పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతారని, పార్టీ తరఫున ప్రతీ ఒకరు మాట్లాడాలని, మంత్రులుగా పనిచేసిన జగదీశ్‌రెడ్డి వంటివారు బాగా మాట్లాడుతున్నారని ఇదే ఒరవడిని కొనసాగించాలని సూచించారు. ప్రతి ఒకరు ఒక్కో సబ్జెక్టు తీసుకొని మాట్లాడాలన్నారు. సబితా ఇంద్రారెడ్డి విద్యపై మంచిగా మాట్లాడతారని, గంగుల కమలాకర్ సివిల్ సప్లయ్స్తోపాటు బీసీ అంశాలపై మాట్లాడాలని, బీసీ తదితర అంశాలపై కూడా గంగుల బాగా మాట్లాడగలరని పేర్కొన్నారు. యువకుడు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద కూడా బాగా మాట్లాడుతున్నారని ఈ సమావేశాల్లోనూ మాట్లాడాలని సూచించారు.
సొంతబిడ్డ జైళ్లో ఉంటే కన్న తండ్రిగా బాధ ఉండదా..? నేనిప్పుడు అగ్నిపర్వతంలా ఉన్న. రాజకీయకక్షతోనే నా కూతురును జైళ్లో పెట్టారు’ అని బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో కేసీఆర్ అన్నారు. కవిత గురించి మాట్లాడాల్సి వచ్చినపుడు ఆయన ఒకింత ఉద్విగ్నతకు లోనయ్యారు.