నన్ను తిడితే ఫర్వాలేదు. నా ప్రజలు బాధపడితే నా ప్రాణం పోయినా సరే వాళ్లను వదిలిపెట్టను. చచ్చిపోయినా ఫర్వాలేదు. నా తెలంగాణ బిడ్డలకు, ప్రజలకు, నా కండ్లముందే మీరు ఘోరాలు చేస్తమంటే చూసుకుంట కూర్చుండే ప్రశ్నేలేదు. ఎంతవరకైనా తెగిస్తా.
న్యాయం జరగాలంటే ప్రజల పక్షాన కొట్లాడే పంచాయితీ పెద్ద కావాలి. ఆ పంచాయితీ పెద్ద కేసీఆరే. మళ్లీ మన రాజ్యమే వస్తుంది, ఎవరూ ఆపలేరు. అందులో ఎటువంటి అనుమానం లేదు. మనం కలలుగన్న బంగారు తెలంగాణ అయ్యేవరకు అద్భుతంగా పోరాడుతూ ముందుకు సాగాలి. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్కు బలమిస్తే అది తెలంగాణ ప్రజల బలమవుతుంది. అప్పుడు ఈ ప్రభుత్వం మెడలు వంచగలుగుతాం.
-రోడ్ షోలలో కేసీఆర్
KCR | హైదరాబాద్, ఏప్రిల్ 24(నమస్తే తెలంగాణ): తెలంగాణకు 1956 నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీయే ప్రధాన శత్రువని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. అప్పుడు ఆంధ్రాలో కలిపి తెలంగాణ ప్రజల్ని గోస పెట్టిందని, ఇప్పుడు అడ్డగోలు హామీలు ఇచ్చి మోసపూరితంగా గద్దెనెక్కిందని, తర్వాత ఆరు హామీలకు పంగనామం పెట్టిందని మండిపడ్డారు. బస్సుయాత్రలో భాగంగా బుధవారం మిర్యాలగూడ, సూర్యాపేటలో నిర్వహించిన రోడ్‌షోలలో కేసీఆర్ ప్రసంగించారు. ఒకప్పుడు తెలంగాణ సొంత రాష్ట్రంగా ఉన్నప్పుడు బ్రహ్మాండంగా బతికిందని గుర్తుచేశారు. 1956లో జరిగిన మోసంతో తెలంగాణ ఆంధ్రలో కలిసిందని, అప్పటి నుంచి 58 ఏండ్లపాటు ఘోరమైన బాధలు అనుభవించామని పేర్కొన్నారు. 2001లో తాను పిడికెడు మందితో అత్యంత సాహసోపేతమైన పోరాటం ప్రారంభించానని, చివరికి ఆమరణ నిరహార దీక్ష చేసి ప్రాణాల మీదికి తెచ్చుకొని తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామని గుర్తుచేశారు.
సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని పూల పొదరిల్లులా ఒక్కొక్కటి పేర్చుకుంటూ ఎవరి ఉహాలకూ అందకుండా అభివృద్ధి చేసుకున్నామని కేసీఆర్ తెలిపారు. నిమిషం పాటైనా కరెంటు పోకుండా అద్భుతంగా చేసుకున్నామని, పల్లెలు, పట్టణాలు పచ్చనిచెట్లతో ఎంతో బాగా చేసుకున్నామని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్న తరువాత అద్భుతమైన నీటి సదుపాయాన్ని తెచ్చుకున్నామన్నారు. సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గంలో గతంలో చెరువులు, కుంటలు ఏ విధం గా ఎండిపోయాయో అందరికీ తెలుసని, కాళేశ్వరం తర్వాత సూర్యాపేట, తుంగతుర్తి ప్రాం తాల్లో 2.50 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చాయని వివరించారు. మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి నాయకత్వంలో సూర్యాపేట పట్టణం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందని ప్రశంసించారు. సూర్యాపేటను జిల్లా చేసుకున్నామని, మెడికల్ కాలేజీ తెచ్చుకున్నామని,సద్దుల చెరువు సుందరీకరణతో ‘ముద్దుల చెరువు’గా తయారైందని చెప్పారు. గతంలో వచ్చినప్పుడు తానే ఆశ్చర్యపోయాయని పేర్కొన్నారు. లంబాడీతండాలను గ్రామ పంచాయతీలు చేసుకున్నామని చెప్పారు. దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చి దళితబంధు కార్యక్రమాన్ని అమలు చేశామని వివరించారు.
చెడ్డీలు గుంజుకుని ఏం చేసుకుంటవ్ జైల్లో వేస్తాం, నీ పేగులు తీసి మెడలో వేసుకుంటాం, నీ గుడ్లుపీకి గోలీలు ఆడతాం, పండబెట్టి తొక్కుతం, చెడ్డీ గుంజుతం అంటున్నారు. ఇదేనా ముఖ్యమంత్రి మాట్లాడే భాష. చెడ్డీ గుంజుకుని ఏం చేసుకుంటరు? పదిహేనేండ్లు పోరాడి తెలంగాణ తెచ్చిన వ్యక్తిని, పదేండ్లపాటు కులమతాలకు అతీతంగా పాలించిన వ్యక్తిని పట్టుకొని ఇటువంటి భాషేనా మాట్లాడేది.
-కేసీఆర్
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని కేసీఆర్ విమర్శించారు. ఆ తర్వాత ఒక్క హామీనీ అమలు చేయలేదని మండిపడ్డారు. అన్నీ అబద్ధాలు, బోగస్ మాటలు చెప్తూ, శ్వేతపత్రాలు విడుదల చేస్తూ, ఆరు హామీలకు పంగనామం పెట్టి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన హయాంలో నాగార్జున సాగర్‌లో ఎంతో బాగా నీరు వచ్చేదని, పంటలు బాగా పండేవని చెప్పారు. నాగార్జున సాగర్ కింద 18 పంటలు పండించామని, చివరి భూములకు కూడా నీళ్లు అందించినట్టు గుర్తుచేశారు. కృష్ణానదిలో నీళ్లు తక్కువైనా కాళేశ్వరం నీటిని మూసీ ద్వారా ఉదయ సముద్రానికి తరలించి, అక్కడినుంచి పెద్దదేవులపల్లి రిజర్వాయర్‌కు కలిపి శాశ్వతంగా ఈ ప్రాంత ప్రజలకు నీటి సమస్య లేకుండా చేయాలని ఆనాడు తాము ప్రణాళికలు రచించినట్టు చెప్పారు. నేడు అన్నీ బందైపోయాయని, కేసీఆర్ ఆనవాళ్లు కూడా తీసేస్తామని చెప్తున్నారని పేర్కొన్నారు. ‘వాళ్లకు సాగునీళ్ల పట్టిలేదు. మంచినీళ్ల పట్టిలేదు. కరెంటు పట్టి లేదు’ అని మండిపడ్డారు. రూ.4వేల పెన్షన్‌కు ఎగనామం పెట్టారని, రూ.రెండు వేల పెన్షన్ కూడా ఒక నెల ఎగవెట్టారని విమర్శించారు. బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ సందర్భాల్లో బట్టల ఆర్డర్ ఇచ్చి చేనేత కార్మికులకు గతంలో తాము పని కల్పించామని గుర్తు చేశారు. ఇప్పడు ఆర్డర్లు బంద్ చేసి వాళ్లు చనిపోయే పరిస్థితి తెస్తున్నరని ఆవేదన వ్యక్తంచేశారు. తాము 1100 గురుకులాలు పెట్టామని, అందులో చదువుకునే విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారని చెప్పారు. ఇప్పుడు వారిని పట్టించుకునే పాపాన పోవడం లేదన్నారు.రైతుబంధు కావాలని అడిగితే.. ఓ మంత్రి ‘చెప్పుతో కొడతా’ అన్నాడని, అప్పుడు ‘మంత్రిగారూ.. చెప్పులు మీకే కాదు రైతులకు కూడా ఉంటయి. వాళ్ల చెప్పులు ఇంకా చాలా బందబస్తుగా ఉంటా యి’ అని బదులిచ్చానని గుర్తుచేశారు. ‘రైతుబంధు ఉంటదో, ఊడగొడుతరో తెలియదు. రైతుబీమా ఉంచుతరో ముంచుతరో తెలియదు. కరెంటు మాయమైపోయింది. అద్భుతంగా ఇంటింటికీ వచ్చిన మిషన్ భగీరథ నీళ్లు మాయమైపోయాయి’ అని ఆవేదన వ్యక్తంచేశారు. ‘మరి.. మీరు ఏ వర్గం గురించి పనిచేస్తున్నరు?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇటీవలి ఎన్నికల్లో కేవలం 1.8 శాతం ఓట్ల తేడాతో తాము అధికారాన్ని కోల్పోయామని చెప్పారు. ప్రజలు ఏ పాత్ర ఇచ్చినా అందులో పనిచేస్తామని స్పష్టంచేశారు.
కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రెప్పపాటు కూడా పోని కరెంట్, ఇప్పుడు కట్క బంద్ చేసినట్లే మాయమైందని అన్నారు. మరి ఈ కరెంట్‌కు ఏమైంది? ఈ కరెంట్ ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా గడ్డపారలు పట్టి తవ్వి పనిచేయాల్సిన అవసరం లేదని, కేసీఆర్ వేసిన మార్గంలో తొమ్మిదేండ్లపాటు నిరంతరంగా ఇచ్చిన కరెంట్‌ను కూడా ఇవ్వలేని అసమర్థులు రాజ్యాన్ని ఏలుతున్నారని ఎద్దేవా చేశారు. కరెంట్ ఎందుకు ఆగమైందో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజలను ఎందుకు బాధ పెడుతున్నారని నిలదీశారు. తమ ప్రభుత్వంలో కష్టపడి మిగులు కరెంట్ ఉండేలా చేశామని, ఆ మాత్రం కూడా చేయడం చేతనైతలేదా అని ప్రశ్నించారు.
సూర్యాపేటలో 30 ఏండ్లపాటు మూసీ మురికి నీళ్లు తాగించింది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వమంటూ కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మిషన్ భగీరథను కూడా నాశనం చేస్తున్నారని, అది కూడా నడిపించే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తంచేశారు. పట్టణాల్లో, పల్లెల్లో అన్ని వర్గాల వారికి మంచినీళ్లు అందించాలనే ఉద్దేశంతో మిషన్ భగీరథ చేపట్టి రూపాయికే ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చి మంచినీళ్లు అందించినట్టు తెలిపారు. ఉమ్మడి నల్లగొండలో పెద్ద దేవులపల్లి నుంచి, టెయిల్ పాండ్ నుంచి, పాలేరు నుంచి శుద్ధిచేసిన నీళ్లు తెచ్చి ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చి ప్రతి పేదవాడి ఇంటికి నీటిని సరఫరా చేశామన్నారు. కానీ ఈ రోజు మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు మంచినీళ్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, తెలివితక్కువతనం కారణం కాదా అని నిలదీశారు. కేసీఆర్ పక్కకు జరిగిన4నెలలకే మళ్లీ నీళ్ల గోస వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు.
ఈ జిల్లా మంత్రులకు కేసీఆర్‌ను తిట్టడం తప్ప మరో పనిలేదని కేసీఆర్ ఎద్దేవా చేశారు. రైతులకు మేలు చేయాలన్న ఆలోచన వారికి లేదని విమర్శించారు. పంటలు ఎండబెట్టారని, రైతుబంధు ఎగబెట్టారని, రైతుబంధు ఐదెకరాలకే ఇస్తామంటున్నారని పేర్కొన్నారు. ‘రైతుబంధు ఎందుకు ఇవ్వడం లేదు. ఏం పోయింది.. మీ అబ్బ సొత్తా? ఇవ్వడానికి మీకేం బాధ’ అని ప్రశ్నించారు. ఇందుకోసం ఏడాదికి రూ. 15-16 వేల కోట్ల బడ్జెట్ కేటాయించి రైతులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా, ఆలస్యం లేకుండా రైతుబంధు ఇచ్చామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ‘టింగ్ టింగ్’ మంటూ ఫోన్లలో రైతుబంధు పైసలు పడేవని, కానీ ఈ రోజు అది ఎందుకు మాయమైందని ప్రశ్నించారు. ‘రైతుబంధును మూడు ఎరాలకే ఇస్తం, ఐదు ఎకరాలకే ఇస్తం, వ్యవసాయం చేసినోళ్లకే ఇస్తమంటున్నరు. అడిగితే ఎన్నో గలీజ్ మాటలు మాట్లాడుతున్నరు. రైతులంటే బిచ్చగాండ్ల లెక్క కనిపిస్తున్నరా?’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఆ హామీలకు వాళ్ల నోటికి మొక్కాలె. 420 హామీలిచ్చి సక్కగ ఉన్న తెలంగాణలో ఉడుముల్లాగా చొచ్చి మనకు ఈ అవస్థలు తెచ్చిపెడుతున్నారు
-కేసీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి 225 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. తాను వస్తుంటే కొందరు రైతులు తన బస్సును కొనుగోలు కేంద్రం వద్ద ఆపి గోడు వెళ్లబోసుకున్నట్టు చెప్పారు. ‘సార్ ధాన్యం తెచ్చి 20 రోజులైంది. ధాన్యం ఎత్తడం లేదు, ధాన్యం కొనడం లేద’ని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిపారు. ‘బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ రైతుల వడ్లు కొనబోమని మొండికేస్తే నాతో సహా తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరం పోయి ఢిల్లీలో ధర్నా చేసి నరేంద్రమోదీ మెడలు వంచి మా తెలంగాణ రైతులు ధాన్యం పండిస్తున్నరు, మీరు కచ్చితంగా కొనాల్సిందేనని చెప్పి వడ్లు కొనేటట్లు చేసినం’ అని తెలిపారు. మొన్నీ ఈ మధ్య ఎండిపోలాలను పరిశీలించడానికి తాను తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో పర్యటించానని, కేసీఆర్ వస్తుండు అనంగానే కాలువల నీళ్లు ఇడిసి, ఎళ్లిపోంగానే మళ్లీ నీళ్లు బంద్ చేశారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒకటో రెండో పిల్లర్లు మునిగిపోతే, ప్రపంచమే మునిగిపోయినంత దుష్పప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 60, 70 టీఎంసీల నీళ్లను సముద్రానికి వదిలి పెట్టారని ఆరోపించారు. నీళ్లు ఎత్తిపోసి ఉండి ఉంటే, ఒక ఎకరం కూడా పంట ఎండిపోయేది కాదని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రెండు దఫాలుగా రూ. 30వేల కోట్ల రుణాలను మాఫీచేసి రైతులను ఆదుకున్నామని కేసీఆర్ తెలిపారు. ఎన్నికలప్పుడు డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ చెప్పారని, మరి చేశారా? అని రైతులను అడిగారు. మహాలక్ష్మి అని పేరుపెట్టి ప్రతి మహిళకు రూ. 2500 ఇస్తామని చెప్పారని, ఇస్తున్నరా? అని ప్రశ్నించారు. నిరుద్యోగులకు రూ. 4వేల నిరుద్యోగ భృతి ఇచ్చారా? అని ప్రజలను ప్రశ్నించారు. ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ‘మేము నిరుద్యోగ భృతి ఇస్తామని అనలేదు’ అని చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే ఈ ప్రభుత్వ మెడలు వంచి అన్ని కార్యక్రమాలను అమలు చేయించే అవకాశం కలగుతుందని, ఈ బాధ్యత తనదేనని కేసీఆర్ భరోసా ఇచ్చారు.
హామీలు అమలు చేయాలని అడిగితే కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని, చర్లపల్లి జైలులో వేస్తామని బెదిరిస్తున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ జైళ్లకు కేసీఆర్ భయపడతడా? భయపడితే తెలంగాణ వచ్చేదా? అని ప్రశ్నించారు. ఇది తెలంగాణ జాతికి గౌరవమా? అని ప్రశ్నించారు. దేశవిదేశాల్లో ఎక్కడైనా ‘తెలంగాణ ఎవరు తెచ్చారు?’ అని అడిగితే తన పేరే చెప్తారని పేర్కొన్నారు. ‘58 ఏండ్లు గోసపడి, దుఖంపడి రెండో తరగతి పౌరులుగా పరిగణించబడి, తాగు, సాగునీళ్లు లేక, కరెంటు లేక బాధలు పడ్డ తెలంగాణను, అనేక పోరాటాలు చేసి విముక్తి చేసిన కేసీఆర్‌ను ఇలా అనొచ్చునా’ అని ప్రశ్నించారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే ఈ ప్రభుత్వం మెడలు వంచి అన్ని కార్యక్రమాలను అమలు చేయించే అవకాశం కలగుతుందని, ఈ బాధ్యత తనదేనని కేసీఆర్ భరోసా ఇచ్చారు.
కేసీఆర్ పక్కకు జరంగగానే కటక బంద్ చేసినట్టుగానే కరెంటు బంద్ అయితదా? కటక బంద్ చేసినట్టే నీళ్లు బంద్ అవుతాయా?
-కేసీఆర్
అంబేద్కర్ పుణ్యమా అని, రాజ్యాంగంలోని ఆర్టికల్-3 వల్ల తెలంగాణ రాష్ట్రం సిద్ధించినదని, అంబేద్కర్‌ను గౌరవించుకోవాలనే ఉద్దేశంతో ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా 125 అడుగుల ఎత్తులో ఆయన విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసినట్టు కేసీఆర్ చెప్పారు. అంబేద్కర్ జయంతినాడు ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరూ కనీసం అక్కడికి వెళ్లలేదని, విగ్రహానికి పుష్పాంజలి ఘటించలేదని, ప్రజలెవరూ వెళ్లకుండా గేటుకు తాళం వేశారని ఆవేదన వ్యక్తంచేశారు. వేరే రాష్ర్టాల నుంచి వచ్చిన ప్రజలు ఇదేం దిక్కుమాలిన ప్రభుత్వమని తిట్టుకుంటూ వెళ్లారని చెప్పారు.
‘ఉన్నోడుంటడు లేనోడుంటడని పేద బిడ్డల పెండ్లి చేయాలని రూ. లక్ష ఇచ్చేలా కల్యాణలక్ష్మి పథకం పెట్టినం. కాంగ్రెసోళ్లు ఏం చెప్పారు? కేసీఆర్ రూ. లక్ష ఇస్తున్నడు కదా, మేం తులం బంగారం కూడా ఇస్తమని చెప్పారు. మరి ఎవరికైనా తులం బంగారం వచ్చిందా? వారు ఇవ్వరు. బంగారం కాదు, ఇనుము కూడా ఇయ్యరు’ అని కేసీఆర్ తేల్చి చెప్పారు.
21 ఏండ్ల క్రితం కోదాడ నుంచి హాలియా పాదయాత్రలో భాగంగా మిర్యాలగూడకు వచ్చిన నాటి రోజుల్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఆ రోజు కూడా నీళ్ల కోసం పోరాటం చేసేందుకే వచ్చినట్టు తెలిపారు.ఇప్పుడు కూడా అదే పోరాటంపై వస్తున్న తనకు అపూర్వ స్వాగతం పలకడంపై ఆనందం వ్యక్తం చేశారు. నాలుగు నెలల క్రితం ధీమాగా ఉన్న రైతులు ఈ రోజు దిగాలు పడి చాలా బాధలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఆనాడు రైతులు, ప్రజల గోస చూడలేక నేనే నీళ్ల కోసం, నిధుల కోసం, కరెంట్ కోసం ఉద్యమిస్తే, 15 ఏండ్ల పోరాటం తర్వాత రాష్ర్టాన్ని సాధించుకున్నాం’ అని తెలిపారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు మన పోరాటం నీళ్ల కోసమేనని, తెలంగాణ బతుకే నీళ్లపైన అని పేర్కొన్నారు.ఈ జిల్లాలో మంత్రులున్నారని, స్వయంగా ఇరిగేషన్‌శాఖ మంత్రే ఈ జిల్లా నుంచి ఉన్నారని గుర్తుచేశారు. కానీ వీళ్లు దద్దమ్మలుగా వెళ్లి నాగార్జునసాగర్‌పై అధికారాన్ని కేఆర్ఎంబీకి, కేంద్ర ప్రభుత్వానికి అప్పగించారని, దీన్ని ప్రజలంతా కళ్లారా చూశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ పదేండ్లు అధికారంలో ఉంటే 18 పంటలకు సాగర్ ఆయకట్టుకు నీళ్లు ఇచ్చి బంగారు పంటలు పండిచేలా చేసినట్టు తెలిపారు. నీళ్లు ఇవ్వగలిగే అవకాశం ఉన్నా ఈ దద్దమ్మలకు దమ్ములేక ప్రాజెక్టును కేఆర్ఎంబీ చేతిలో పెట్టి పంటలను ఎండబెట్టారని మండిపడ్డారు. తెలంగాణ వచ్చిన తర్వాత పంటలు ఎండటం ఇదే మొదటిసారని తెలిపారు. ‘టెయిల్‌పాండ్ నుంచి 5 టీఎంసీల నీళ్లు దర్జాగా ఏపీ తీసుకుపోయింది. నువ్వు ఎక్కడున్నవ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి? నిద్రపోయావా? మర్చిపోయావా? మన నీళ్లు పోతుంటే చూసుకుంటూ కూర్చుంటవా?’ అని నిలదీశారు.టెయిల్‌పాండ్ నుంచి మిషన్ భగీరథ కనెక్షన్ ఉన్నదని, అక్కడ నీళ్లు ఖాళీ అయితే మన గతి ఏం కావాలని ప్రశ్నించారు.
న్యాయం జరగాలంటే ప్రజల పక్షాన కొట్లాడే పంచాయితీ పెద్ద కావాలని, ఆ పంచాయితీ పెద్ద కేసీఆరేనని, బీఆర్ఎస్ పార్టీయేనని కేసీఆర్ స్పష్టంచేశారు. మళ్లీ మన రాజ్యమే వస్తుందని, అందులో అనుమానం లేదని ధీమా వ్యక్తంచేశారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్కు బలమిస్తే అది తెలంగాణ ప్రజల బలమవుతుందని, ఈ ప్రభుత్వం మెడలు వంచగలుగుతామని భరోసా ఇచ్చారు. ప్రజలు చూపిస్తున్న ఆదరణను ఈ జన్మలో మర్చిపోలేనన్నారు. మే 13వరకు ఇదే ఉత్సాహాన్ని కొనసాగించి ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి కృష్ణారెడ్డిని గెలిపించాలని కోరారు. కృష్ణారెడ్డి నిజాయితీపరుడని, మంచివాడని, సీనియర్ నాయకుడని కొనియాడారు. ‘సూర్యాపేట గడ్డమీద గులాబీ జెండా ఎగిరినట్టే. సూర్యాపేట నుంచి 50వేలకు తగ్గకుండా మెజా ర్టీ ఇయ్యాలె, సూర్యాపేట ఓట్లతోనే నల్లగొండ ఎంపీ కావాలని కోరుతున్నా’ అని పేర్కొన్నారు. పది పన్నెండు ఎంపీ సీట్లు గెలిస్తే భూమి ఆకాశం ఒక్కటి చేసేంత పోరాటం చేస్తామని, మీరిచ్చే బలంతోనే తాము పోరాటం చేయగలమని,హామీలు అమలు చేయించగలుగుతామని, కాంగ్రె స్ ప్రభుత్వం మెడలు వంచగలుగుతామ ని, రైతులకు న్యాయం జరుగుతుందని, అందుకే వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి కృష్ణారెడ్డిని గెలిపించాలని ప్రజలకు కేసీఆర్ విజ్ఞప్తిచేశారు.