KCR | హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): హామీలు ఇచ్చుడే తప్ప కాంగ్రెస్‌కు వాటి అమలు చేతకాదని కేసీఆర్ విమర్శించారు. అడ్డగోలుగా హామీలు ఇచ్చారని, తమను మించిన సిపాయిలు లేరని జబ్బలు చరిచారని పేర్కొన్నారు. ఆదివారం ఎల్కతుర్తి సభలో కేసీఆర్ మాట్లాడుతూ “కాంగ్రెస్ వచ్చి యాడాదినర్ధమాయే. ఏం మాయరోగమమొచ్చే. ఏం బీమారి వచ్చే. ఏమేమి చెప్పిరి. వరుస బెట్టి గోల్మాల్ దింపుట్ల, అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్‌ను మించినోడు లేడు. రైతుబంధు కింద 15 వేలు ఇస్తామని చెప్పిండ్రు. పబ్లిక్‌ను బోల్తా కొట్టించేందుకు క్వింటాల్‌కు 500 బోనస్ ఇస్తామని చెప్పిండ్రు. 420 హామీలు ఇచ్చారు. వాళ్ల నోటికి మొక్కాలే. కల్యాణలక్ష్మి కింద తులం బంగారం కలిపి ఇస్తామని చెప్పిండ్రు.
ఎకడన్నా వస్తున్నదా?
మమ్మల్ని మించిన సిపాయిలు లేరన్నరుమాది 120 ఏండ్ల పెద్దపార్టీ.. మమ్మల్ని మించిన సిపాయిలు లేరన్నారు. ఉచిత బస్సు అని పెడితే జుట్లు పట్టుకుని కొట్టుకునేందుకు పనికి వస్తుంది తప్ప ఉపయోగం లేదు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, కంటి వెలుగు పథకాలను పెట్టమని ఎవరూ అడగలే. మన రాష్ట్రం, మన ప్రజలని, వారిని బాగు చేయాలని మా అంతట మేమే పెట్టినం. మేం పారిశ్రామిక రంగం మీద దృష్టిపెట్టినం. పెట్టుబడులు ఆకర్షించినం. సుమారు 20 నుంచి 25 లక్షల మందికి ఉద్యోగాలిప్పిచ్చినం. బీఆర్ఎస్ పాలనలో మతకల్లోలాలు లేవు. కర్ఫ్యూల్లేవు. శాంతిభద్రలను కాపాడినం. మా అంత సిపాయిలు లేరు. ఆ చందమామలు పెడతం. ఏడు సూర్యుళ్లను పెడతమని నమ్మబలికి మంచిగున్న తెలంగాణను ఆగంబట్టించి ఓట్లేయించుకుని ప్రజలను దగా చేసిండ్రు.
కేసీఆర్ పక్కకు పోంగనే ఆగమైతదా
తెలివితక్కువ పనితో, అవివేకంతో, అజ్ఞానంతో పరిపాలన చెయ్యరాక సర్వనాశనం చేసిండ్రు. నా కండ్ల ముందే తెలంగాణ సర్వనాశనమవుతుండటం నాకు దుఃఖం కలిగిస్తున్నది. కేసీఆర్ పక్కకు పోంగనే ఇంత ఆగమైతదా? నేను అసెంబ్లీల నిలబడి ఛాలెంజ్ చేసిన ఐదేండ్ల లోపల మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా పెట్టి, నీళ్లు ఇవ్వకపోతే మళ్లా వచ్చే ఎన్నికల్లో నిలబడం, ఓట్లు అడగమని చెప్పిన. ఇలా ఎవరు చెప్తారు. దమ్మన్నోడే ఇట్లా చెప్తాడు. చేసి చూపిచ్చినం. అమలవుతున్న పథకం. గా మంచినీళ్లు కూడా ఇవ్వడం శాతనైతలేదా? మేమింత సిపాయిలం.. అంత సిపాయిలం అన్నళ్లోకు మంచినీళ్లు కూడా ఇవ్వడం శాతనైతలేదా? మళ్లా 2014కు ముందటి పరిస్థితులొస్తున్నాయి. రైతాంగం దోపికీ గురవుతున్నది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధత కాదా? ఇది కాంగ్రెస్ శాపం కాదా?” అని కేసీఆర్ ప్రశ్నించారు.