హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): అన్ని రంగాల్లో వివక్షారహిత సామాజిక సమానత్వం కోసం కృషి చేసిన మహాదార్శనికుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు కొనియాడారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. వర్ణ, కుల, మత, లింగ బేధాలు లేకుండా భారతదేశ ఔన్నత్యాన్ని నిలిపే దిశగా అంబేద్కర్ చేసిన కృషి అజరామరం అని వివరించారు. భారత సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాల్లో మానవీయత పరిఢవిల్లి, విశ్వనరుడుగా భారత పౌరులు ఎదిగేందుకు దోహదం చేసేలా, రాజ్యాంగాన్ని నిర్మించిన అంబేద్కర్ ప్రపంచ మేధావి అని కొనియాడారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగంలోని ఆర్టికల్-3 ద్వారానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని, దేశ ఫెడరల్ వ్యవస్థ బలోపేతానికి అంబేద్కర్ కృషి మహోన్నతమైందని పేర్కొన్నారు. దళిత, బహుజన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ ఆశయాల సాధన కోసం పదేండ్ల పాలనలో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం విప్లవాత్మక కార్యాచరణను అమలు చేసిందని గుర్తు చేశారు.
ఔన్నత్యాన్ని చాటేందుకే అంబేద్కర్ విగ్రహం
కొత్త రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరుతో సచివాలయాన్ని నిర్మించుకుని, రాష్ట్ర పరిపాలనలో అంబేద్కర్ స్ఫూర్తిని నింపే దిశగా చర్యలు చేపట్టామని కేసీఆర్ వివరించారు. అంబేద్కర్ ఆశయాలను నిత్యం స్మరించుకుంటూ, వారి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేందుకు, రేపటి తరాల్లో నిత్యం చైతన్యం కలిగించేందుకు, దేశంలో మరే రాష్ట్రం ఏర్పాటు చేయని విధంగా, ఆకాశమంత ఎత్తున అంబేద్కర్ ప్రతి రూపాన్ని, విగ్రహం రూపంలో హైదరాబాద్ నడిబొడ్డున ప్రతిష్టించుకున్నామని వివరించారు. శతాబ్దాల కాలంగా సామాజిక వివక్షకు గురువుతున్న ఎస్సీ కులాల ఆత్మగౌరవం ద్విగుణీకృతం చెందాలనే లక్ష్యంతో, వారికి మునుపెన్నడూ లేని విధంగా రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని దళితబంధు పథకం ద్వారా అందించిన విషయాన్ని గుర్తుచేశారు. తద్వారా దళితులు ప్రభుత్వం అందించే పెట్టుబడితో వ్యాపారవేత్తలుగా ఎదిగి స్వయం ఉపాధి కల్పించుకోవడమే కాకుండా, పది మందికి ఉద్యోగాలు అందించే ఆంత్రప్రెన్యూర్లుగా ఎదిగే విధంగా చేసి, అద్భుతమైన ఫలితాలు సాధించినట్టు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ సహా, బీసీల ప్రగతి కోసం, మహిళాభ్యున్నతికి, నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని పేర్కొన్నారు. వాటి కొనసాగింపు ద్వారా మాత్రమే రాష్ట్రంలో బహుజన అభ్యున్నతి సాధ్యమవుతుందని, తద్వారా మాత్రమే మనం అంబేద్కర్‌కు ఘన నివాళులు అర్పించిన వారమవుతామని కేసీఆర్ స్పష్టం చేశారు.