హైదరాబాద్, డిసెంబర్ 24(నమస్తే తెలంగాణ) : యేసుక్రీస్తు పుట్టినరోజు వేడుకలు పురసరించుకొని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పాపులను సైతం క్షమించమనే త్యాగశీలత, ఓర్పు, సహనం, మానవ సమాజానికి క్రీస్తు చూపిన అత్యద్భుతమైన అహింసా, శాంతిమార్గమని పేర్కొన్నారు.
పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో క్రిస్టియన్ మైనారిటీలకు అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను దేశానికే ఆదర్శంగా అమలు చేశామని గుర్తుచేశారు. క్రిస్మస్ పర్వదినాన్ని అధికారికంగా నిర్వహించే సెక్యులర్ సంప్రదాయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని తెలిపారు. పీడన నుంచి విముక్తి లభించేలా దీవిస్తూ, రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని కేసీఆర్ యేసుక్రీస్తును ప్రార్థించారు.