KCR | హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): ‘ఏడాదిలోనే తెలంగాణ అల్లకల్లోలమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను నిర్దయగా ఏడిపిస్తున్నది. బట్టల దుకాణం నుంచి బంగారం షాపు దాకా బాధపడని మనిషి లేడు. వాళ్లకు 15 నెలల సమయం ఇచ్చినం. ఆ గడువు చాలు. ఇక చీల్చిచెండాడండి’ అని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పార్టీ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. మంగళవారం తెలంగాణభవన్‌లో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. బుధవారం నుంచి ప్రారంభం కానున్న శాసనసభ, శాసనమండలి సమావేశాల్ల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై చీల్చిచెండాడాలని సూచించారు. రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై రణభేరి మోగించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎండిన పంటలు, దొరకని సాగునీరు, అందని కరెంటు, కాలిపోతున్న మోటర్లు మొదలైన రైతాంగ సమస్యలపై ఉభయసభల్లో పోరాటం చేయాలని సూచించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న మంచినీటి కొరత తదితర అంశాలపై శాసనమండలి, శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో ప్రభుత్వం అనుసరిస్తున్న మోసపూరిత వైఖరిని నిలదీయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న రైతాంగ స్థితిగతులను కండ్లకు కట్టి ఆ సమస్యల పరిష్కారం విషయంలో సర్కార్ మెడలు వంచి రైతాంగానికి న్యాయం చేసే దిశగా కార్యాచరణ ఉండాలని, ఆ దిశగా సభలో ప్రస్తావించాలని కేసీఆర్ ఉద్బోధించారు.
బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ బిల్లులకు మద్దతుగా బీఆర్ఎస్ తన గొంతు వినిపించాలని ప్రజాప్రతినిధులకు కేసీఆర్ సూచించారు. గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ కార్యక్రమాల అమలులో విఫలమైనందుకు ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా దయనీయంగా మారి, గురుకుల పాఠశాలలు నిర్వీర్యం అవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. గురుకులాల నిర్వహణ విషయంలో ప్రభుత్వ తీరును ఎండగట్టాలని సూచించారు. విద్యార్థుల ఓవర్సీస్ సాలర్షిప్స్ విడుదల చేయకపోవడం, వైద్యరంగంలో దిగజారుతున్న ప్రమాణాలు తదితర ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ప్రయోజనాలు, డీఏలు, పీఆర్సీ అమలు కోసం ఉద్యోగ సోదరుల పక్షాన సభలో ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేలా కొట్లాడాలని సూచించారు. దళితబంధు నిలిపివేతపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలు వెలుగులోకి తెచ్చి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి గొంతుకగా ఉభయసభల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కేసీఆర్ ఉద్బోధించారు. ఉభయసభలు ప్రారంభమయ్యే నిర్దేశిత సమయానికి ముందే సభ్యులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. బీఆర్ఎస్ మీద రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని, వేస్తున్న నిందలను బలంగా తిప్పికొట్టాలని చెప్పారు. దాదాపు మూడు గంటలపాటు సాగిన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం పలు అంశాలను చర్చించింది. ప్రజా సమస్యల మీద ఉభయసభల్లో ప్రతిభావంతంగా పోరాడేందుకు, సభ్యులను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకునేందుకు వీలుగా డిప్యూటీ లీడర్లను నియమించనున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. సమావేశంలో పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.