కోహెడ/హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి శనివారం రాత్రి కన్నుమూశారు. గుండె, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ దవాఖానలో చేరగా పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని ఆదివారం తెల్లవారుజామున అతడి స్వగ్రామమైన సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి తీసుకువచ్చారు. ఆయన మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ తదితరులు శ్రీహరి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
మాజీ మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్‌కుమార్, పుట్ట మధు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు తదితరులు కూడా శ్రీహరి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రీహరి అంత్యక్రియల సందర్భంగా హరీశ్‌రావు, గంగుల కమలాకర్, బోయినపల్లి వినోద్‌కుమార్, వొడితెల సతీశ్‌కుమార్, దేశపతి శ్రీనివాస్ తదితరులు ఆయన పాడె మోశారు.
కర్ర శ్రీహరి మరణం బాధాకరమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. శ్రీహరి మృతికి సంతాపం తెలుపుతూ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. రాజకీయాల్లో గ్రామస్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగారని కొనియాడారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నాలుగు దశాబ్దాలపాటు సర్పంచ్‌గా, ఫ్యాక్స్ చైర్మన్‌గా, ఎంపీటీసీగా, ఎంపీపీగా, జడ్పీటీసీగా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న కర్ర శ్రీహరి మరణం విచారకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. నిజాయితీ, అంకితభావం, నిస్వార్థ సేవకు ఆయన మారుపేరని ఆదివారం ఒక ప్రకటనలో కొనియాడారు. ఆయన మృతి హుస్నాబాద్ నియోజకవర్గానికి తీరనిలోటని పేర్కొన్నారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. హరీశ్‌రావు, వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రజల పక్షాన నిలిచిపోరాటం చేసిన నాయకుడు శ్రీహరి అని కొనియాడారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని అన్నారు. శ్రీహరి మృతికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు.