Telangana | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 31 (నమస్తే తెలంగాణ): అన్నం ఉడికిందో లేదో తెలుసుకునేందుకు ఒక్క మెతుకు పట్టుకుంటే సరిపోతుంది. దీనికి తగ్గట్టుగానే.. ‘కేసీఆర్.. అసెంబ్లీకి రా! కేసీఆర్ ఫాంహౌజ్ విడిచి బయటికి ఎందుకొస్తలేరు!’ అంటూ తరచూ వ్యాఖ్యానిస్తున్న ప్రభుత్వ పెద్దలతోపాటు అధికార పార్టీ నేతలకు శుక్రవారం ఒక్క మెతుకును పట్టుకోగానే ‘సుర్రున’ కాలిపోయింది. నిజంగా కేసీఆర్ బయటికొస్తే ఏమవుతుందో కానీ, ఆయన ఫాంహౌజ్‌లోనే ఉండి మాట్లాడితేనే ఏం జరుగుతుందో కాంగ్రెస్ నేతలకు అవగతమైంది. శుక్రవారం ఎర్రవల్లి ఫాంహౌజ్‌లో సంగారెడ్డి జిల్లా మేదపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంలో కేసీఆర్ కాసేపు ప్రసంగించారు. రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితులను కొన్నింటిని వివరించి, సర్కారు పనితీరుపై జనంలో ఎట్లున్నదో వివరించారు. అంతే! కేసీఆర్ ప్రసంగంపై తెలంగాణ సమాజంలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
దీంతో నిన్నటిదాకా కేసీఆర్ బయటికి రావాలంటూ డిమాండ్ చేసిన వారంతా ఉలిక్కిపడ్డరు. ఒకరెనక ఒకరు.. మీడియా ముందుకొచ్చి నష్ట నివారణ చర్యల్లో మునిగిపోయారు. పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు, చివరకు ముఖ్యమంత్రి సైతం తాను పాల్గొన్న కార్యక్రమం ఏమిటనే విషయాన్ని కూడా మరచిపోయి అసహనాన్ని తిట్ల రూపంలో వెళ్లగక్కారు. తాము నోటికొచ్చినట్టు మాట్లాడితే, కేసీఆర్ చెప్పిన వాస్తవాలు, చేసిన వ్యాఖ్యలపై మరింత చర్చ జరగకుండా ఈ తిట్లపైనే చర్చ జరుగుతుందనే ఉద్దేశంతో దుస్సాహసానికి ఒడిగట్టారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన హోదాను సైతం మరిచి కేసీఆర్‌పై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారు. నిజానికి, ఏడాదికిపైగా రాష్ట్రంలో సాగుతున్న కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పెద్దగా స్పందించలేదు. నిత్యం ప్రజాక్షేత్రంలో సామాన్యులు పడుతున్న వెతలు, సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలపై కేటీఆర్, హరీశ్‌రావు, మాజీ మంత్రులు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పోరాటాన్ని సాగిస్తున్నారు. దీంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రభుత్వ పెద్దలు ప్రజలకు ఏ సమాధానం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు.
మేకపోతు గాంభీర్యంతో తరచూ కేసీఆర్ బయటకు రావాలంటూ డిమాండ్లు వినిపించడం పరిపాటిగా మారింది. ముఖ్యంగా ‘దమ్ముంటే అసెంబ్లీకి రా..’ అంటూ సీఎం మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలు మీడియా ముందు మాట్లాడారు. ఈ నేపథ్యంలో నిజంగా కేసీఆర్ బయటికొస్తే సర్కారు పెద్దల పరిస్థితి ఏమిటనే దానిపై తెలంగాణ సమాజంలోనూ కొంత ఆసక్తి ఉందనేది వాస్తవం. కానీ, కేసీఆర్ బయటికి రావడం కాదు.. ఆయన మాట్లాడితేనే ప్రభుత్వ, కాంగ్రెస్ పెద్దల మానసిక పరిస్థితి ఎలా మారుతుందనేది శుక్రవారం తెలంగాణ సమాజం కండ్లారా చూసింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని మేదపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, ఉద్యమకారులు 140 కిలోమీటర్ల పాదయాత్ర చేసి శుక్రవారం ఎర్రవల్లి చేరుకుని కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారితో ఆత్మీయంగా మాట్లాడారు.
ఆ వీడియో బయటికి వచ్చిందే తడవు.. రాష్ట్రంలో ప్రజలు ఎంతో ఆసక్తిగా వినడంతోపాటు చర్చ పెట్టారు. రెండు రోజుల క్రితం తన అధికారిక అకౌంట్లో ఫాంహౌజ్ పాలన, ప్రజల వద్దకు పాలన అంటూ ఓటింగ్ పెట్టి కాంగ్రెస్ సెల్ఫ్‌గోల్ చేసుకొని అభాసుపాలైంది. అది జరిగిన గంటల వ్యవధిలోనే కేసీఆర్ నోరు తెరవడంతో తెలంగాణ సమాజంలో ఎక్కడ చూసినా అదే చర్చ జరిగింది. దీంతో ప్రభుత్వంలోని పెద్దలు, కాంగ్రెస్ నేతలు పలువురు తమ పనులు వదులకొని అనివార్యంగా మీడియా ముందుకు వచ్చి నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఏదో ఒకటి మాట్లాడాల్సి వచ్చింది. ఒకరిద్దరు కాదు.. సీఎం రేవంత్‌రెడ్డి అధికారిక కార్యక్రమాల్లోనూ ఇదే ప్రధాన ఎజెండాగా మాట్లాడగా… పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎంపీ మల్లు రవి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇలా ఒకరెనక ఒకరు స్పందించారు. జనబాహుళ్యంలోకి పెద్దగా రాని స్పందనలు ఇంకా చాలానే ఉండవచ్చు.
సీఎం హోదాలో అసహనంతో తిట్ల పురాణం
సాధారణంగా రాజకీయ నాయకులు అందునా అధికారంలో ఉన్నవారు అసహనానికి గురయ్యారంటే దాని వెనక పెద్ద కారణమే ఉంటుంది. సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం ఒక వేదికపై అసహనంతో ఊగిపోవడం ఆ కోవలోనిదే. షాద్‌నగర్ నియోజకవర్గంలోని ఫరూఖ్‌నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామ ఉన్నత పాఠశాల 150వ వార్షికోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రులు బూర్గుల రామకృష్ణారావు, మర్రి చెన్నారెడ్డి, ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ సత్యనారాయణరెడ్డి, మాజీ విద్యా శాఖ మంత్రి శ్రీనివాస్‌రావు, విద్యావేత్త ప్రొఫెసర్ హరగోపాల్ వంటి ప్రముఖులను అందించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల కావడంతో ఈ కార్యక్రమానికి ఎనలేని ప్రాధాన్యం లభించింది. ఇలాంటి కార్యక్రమంలో తెలంగాణ సీఎం ఏం మాట్లాడతారు? అక్కడ చదువుకున్న ప్రముఖుల స్ఫూర్తిని తన ప్రసంగంలో విద్యార్థులకు ఎలా అందిస్తారు? అని అందరూ ఎదురుచూశారు. కానీ, ఆ కార్యక్రమానికి వెళ్లిన సీఎం రేవంత్ అలాంటి గొప్ప వేదికను రాజకీయం చేశారు.
కేసీఆర్‌పై తిట్ల దండకాన్ని అందుకుని ఊగిపోయారు. గతంలోనూ అనేకసార్లు కేసీఆర్‌పై రేవంత్ ఇష్టానుసారంగా మాట్లాడటం తెలంగాణ సమాజానికి అనుభవంలో ఉన్నదే. కానీ, శుక్రవారం మాత్రం ఫాంహౌజ్‌లోని ఆత్మీయ సమావేశంలో కేసీఆర్ చెప్పిన వాస్తవాలు, ఎక్స్‌లో కాంగ్రెస్ సెల్ఫ్గోల్పై ప్రజల్లో అభాసుపాలైన తీరు మీద జరుగుతున్న చర్చను పక్కదారి పట్టించేందుకు తీవ్రంగా యత్నించినట్టు అర్థమవుతున్నది.
తన పోరాటంతో తెలంగాణను సాధించి, పదేండ్లపాటు ముఖ్యమంత్రిగా సేవలందించిన 70 ఏండ్ల పెద్ద మనిషిపై రేవంత్‌రెడ్డి తన హోదాను మరిచి ఇష్టారీతిన నోరు పారేసుకోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఏడు పదుల వయసులో యాక్సిడెంటల్‌గా కేసీఆర్ ప్రమాదానికి గురికాగా, కాలుకు స్వల్పంగా ఫ్రాక్చర్ అయింది. వైద్యుల సలహా మేరకు చేతికర్ర సాయంతో కొంతకాలం నడిచారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి ‘కర్ర పట్టుకోకుండా నిలబడు చూద్దాం… మెదడు కూడా కోల్పోయావు’ అంటూ అమానవీయంగా మాట్లాడారు. ఆ అసహనంలో ఆయన తనను తాను సల్మాన్‌ఖాన్‌తో పోల్చుకున్నారు. దీంతో అసలు సీఎం ఏ కార్యక్రమానికి వచ్చారు? దాని స్ఫూర్తి, ఉద్దేశం ఏమిటి? ఆయన ప్రసంగం ఏమిటి? అని పలువురు చర్చించుకోవడం కనిపించింది.