హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): తాము అధికారంలోకి వస్తామంటూ కాంగ్రెస్ నేతలు పగటి కలలు కంటున్నారని, ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో బలం లేదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ గాలి వీస్తున్నదనేది కేవలం ప్రచారమేనని కొట్టిపారేశారు. రాష్ట్రంలో కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన తన చాంబర్లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న పథకాలు కొనసాగాలన్నా, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్‌లు పూర్తి కావాలన్నా కేసీఆర్ మూడోసారి సీఎం కావాల్సిందేనని, వేరే వారికి వాటిని పూర్తి చేయడం సాధ్యం కాదని చెప్పారు. గతంలో కాంగ్రెస్ హైకమాండ్‌ను కలవాలంటే హైదరాబాద్ టు ఢిల్లీ ఉండేదని, ఇప్పుడు హైదరాబాద్ టు ఢిల్లీ వయా బెంగళూరుగా మారిందని ఎద్దేవా చేశారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12కి 12 స్థానాలు బీఆర్ఎస్ గెలుస్తుందని గుత్తా సుఖేందర్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. పొద్దున ఒకలా, సాయంత్రం ఒకలా, రాత్రి 10 తర్వాత ఒకలా మాట్లాడే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాటలు పట్టించుకుంటే టైంవేస్ట్ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను ఢీకొనగల నాయకుడు ఏ పార్టీలోనూ లేడని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి హోదాలో ఉన్న మోదీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబంపై పనిగట్టుకొని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉన్నదని గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. కుటుంబ రాజకీయాల గురించి బీజేపీ మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని పేర్కొన్నారు. అవినీతి, ఆశ్రితపక్షపాతానికి లోనై మోదీ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర క్యాబినెట్లో అవినీతిపరులు లేరా? బీజేపీలో చేరితే అవినీతి పరులందరూ పవిత్రులైపోతారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీకి సింగిల్‌డిజిట్ దాటదని చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ద్వారా బీజేపీకి ఎన్నికల్లో పెద్దగా ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు.
గవర్నర్ వ్యవస్థ పూర్తిగా రాజకీయ అవసరాలు తీర్చే వేదికగా మారిందని గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక కోణాలను పరిశీలించి గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను ప్రతిపాదిస్తుందని, రాజకీయ నాయకులు ఉన్నారని వాటిని తిరస్కరించడం సరికాదని స్పష్టంచేశారు. కులగణన ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకునే విధంగా చట్టాన్ని మార్చాలని కోరారు.
సుదీర్ఘకాలం రాజకీయాలు చేసిన నాయకుడు, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్టు బాధాకరణమని గుత్తా సుఖేందర్ పేర్కొన్నారు.