ఏ కారణంతోనైనా రైతు మరణిస్తే ఆ కుటుంబం ఆగం కావొద్దు. అందుకే దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబీమా పథకాన్ని ప్రారంభిస్తున్నాం. రైతు మరణించిన పది రోజుల్లోనే ఆ ఇంటికి రూ.5 లక్షల చెక్కు వస్తుంది. నా జీవితంలో నేను చేసిన అత్యంత గొప్ప పనిగా దీన్ని భావిస్తున్నా.
-2018-19లో రైతుబీమా ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్
బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో పథకాలు కనబడవు. సంక్షేమ ఫలాలు కనబడతాయి. అందులో ఎన్నికల లాభం కనబడదు. ప్రజలపై కేసీఆర్‌కు ఉన్న బాధ్యత కనబడుతుంది. అందుకే.. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ఒకదానికి మించి ఒకటిగా ఉన్న హేమా‘హామీలు’ ఎన్నో..
రాష్ట్రంలోని పేద కుటుంబాలకు బీమా భరోసా ఇస్తున్నారు కేసీఆర్. ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి.. సుమారు 93 లక్షల కుటుంబాలను పాలసీ పరిధిలోకి తేవడం సాధారణ విషయం కాదు. ఇది చారిత్రకం. ప్రతి కుటుంబానికి బీమా దేశంలోనే తొలిసారి. ఇది భారత సంక్షేమరంగాన శిఖరాయమాన హామీ.
కొందరు తెలివిడిలేని విపక్ష నేతలు.. ‘చచ్చిపోతే పరిహారం ఇస్తరట’ అంటూ ఏదేవో మాట్లాడుతున్నరు. కేసీఆర్ హామీలతో వారిలో కలిగిన భయం నుంచి వస్తున్న మాటలవి. వారి వాదన నిజమైతే.. ప్రపంచంలో ‘బీమా’ అన్న పదమే అవసరం లేదు. ఇన్సూరెన్స్ కంపెనీలూ అనవసరం. బీమా హామీ కాదు.. ఒక భరోసా. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించని దశలో అది ఒక రక్షణఛత్రం. ఇటు పేద ప్రజలకేకాదు, అటు ప్రభుత్వరంగ సంస్థ ఎల్ఐసీ రక్షణకూ బాధ్యతగల పార్టీగా బీఆర్ఎస్ ఇస్తున్న హామీపత్రం.
KCR Bima | హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పథకం ప్రారంభించినా ఓ సంచలనమే. ఏ కార్యక్రమం చేపట్టినా దేశ పాలనా రంగ చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించేదే. ఏ పని మొదలు పెట్టినా కేంద్ర, రాష్ర్టాల ప్రభుత్వాలకు నూతన మార్గదర్శిగా నిలిచేదే. ఎందుకంటే ఆయా పథకాలు, కార్యక్రమాలన్నీ ప్రజలే కేంద్రంగా రూపుదిద్దుకుంటాయి. వారి అవసరాలను తీర్చేవిగా, జీవన స్థితిగతులను మార్చేవిగా ఉంటా యి. ఇందుకు ఆసరా పెన్షన్లు, రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, చేనేత బీమా వంటి పథకాలే ఉదాహరణ. ఇవి లబ్ధిదారుల ఆర్థిక, సామాజిక, జీవన స్వరూపాన్ని మార్చేశాయి. రైతుబంధుతో వ్యవసాయం పండుగైతే, రైతుబీమాతో అన్నదాతల కుటుంబాలకు భరోసా దొరికింది.
దళితబంధుతో నిరుపేద ఎస్సీలు వ్యాపారవేత్తలు, యజమానులుగా మారారు. ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. ఇదే కోవలో ఇప్పుడు సీఎం కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన పథకం.. ‘కేసీఆర్ బీమా-ప్రతి ఇంటికి ధీమా’. ఈ పథకం ద్వారా దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి బీమా సదుపాయం కల్పిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలువనున్నది. ఈ మేరకు ఎన్నికల మ్యానిఫెస్టోలో ఈ పథకాన్ని పొందుపరిచారు. కుటుంబ యజమాని ఏదైనా ప్రమాదం వల్లనో, సహజంగానో మరణిస్తే వారంలోనే ఆ కుటుంబానికి రూ.5 లక్షలు అందనున్నాయి. సంపాదించి, కుటుంబాన్ని పోషించే ఇంటిపెద్దను కోల్పోయిన కుటుంబం కుంటుపడకుండా, ఆగం కాకుండా ఈ డబ్బు వారికి ఆసరాగా నిలువనున్నది. రాష్ట్రంలో 93 లక్షలకుపైగా కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. కేసీఆర్ బీమాతో 93 లక్షల కుటుంబాలకు భరోసా దక్కనున్నది.
‘ఒక రైతు ఏదైనా కారణం వల్ల మరణిస్తే ఆ కుటుంబం వీధిన పడొద్దు, అనాథగా మారొద్దు’ అన్నదే రైతుబీమా అమలు వెనుక ఉద్దేశం. ఆ తర్వాత ఆ బీమా పథకాన్ని చేనేత, మత్స్యకారులకు కూడా ప్రభుత్వం వర్తింపజేసింది. ఇప్పటికే సుమారు 41 లక్షల మంది రైతులకు, 3.73 లక్షల మంది మత్స్యకారులకు, 36 వేల మంది చేనేత కార్మికులకు ప్రభుత్వం బీమా కల్పిస్తున్నది. మూడోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ బీమా సదుపాయం కల్పిస్తామని సీఎం కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించారు. ఈ పథకం అమలుతో రాష్ట్ర ప్రభుత్వంపై అదరపు భారం పడుతుంది. అయినా సరే ప్రతి ఇంటికి ధీమా కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీంతో రాష్ట్రంలోని కోటికి పైగా కుటుంబాలకు బీమా రక్షణ అందనున్నది. పాలసీదారు సహజ మరణమైనా, వేరే ఏ కారణాల వల్ల మరణించినా రూ.5 లక్షలు ఆ కుటుంబానికి వారం పదిరోజుల్లోనే అందనున్నాయి. పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబాలకు ఆసరా కానున్నది. దేశ పాలనా రంగానికి తెలంగాణ మరోసారి దిక్సూచిగా మారనున్నది.
ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం.. దేశంలో లైఫ్ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకునే వారి సంఖ్య గణనీయంగా పడిపోతున్నది. గత ఏడాది జీవిత బీమా కలిగి ఉన్నవారిలో 47 శాతం మంది తమ పాలసీలను రెన్యువల్ చేసుకోలేదు. ఒకటి, రెండేండ్లు చెల్లించినా సంపాదన సరిపోకపోవటం, ఇతర ఖర్చుల భారం, బీమా కట్టాలని గుర్తులేకపోవడం, అదనపు ఖర్చుగా భావించడం వంటి అనేక కారణాతో బీమా చెల్లించడం లేదు. ఈ సమస్యకు కేసీఆర్ బీమా చెక్ పెట్టనున్నది. ఈ పథకం కింద ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది. దీంతో ప్రతి కుటుంబానికి పాలసీ ఖర్చు ఆదా అవడంతోపాటు బీమా రక్షణ అందనున్నది. ప్రస్తుతం అమలవుతున్న పథకాల్లో పాలసీదారులకు ఏమైనా జరిగితే వెంటనే అధికారులు క్లెయిమ్ చేస్తున్నారు. వారం, పది రోజుల్లోనే రూ.5 లక్షలు పడుతున్నాయి. ఇలాంటి భరోసానే ఇకపై అన్ని కుటుంబాలకు 365 రోజుల పాటు దక్కనున్నది.
ఓ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో నిర్వహించిన సర్వే ప్రకారం దేశంలో సగటున ప్రతి పది మందిలో ముగ్గురికి మాత్రమే జీవితబీమా సదుపాయం ఉన్నది. పట్టణ ప్రాంతాల్లో 75 శాతం మంది వరకు లైఫ్ ఇన్సూరెన్స్ కలిగి ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 20 శాతానికే పరిమితమయ్యారు. అంటే వందకు 80 మంది ఇన్సూరెన్స్‌కు దూరంగా ఉన్నారు. ఇందుకు అవగాహనలేమితోపాటు అనేక కారణాలు ఉన్నాయి. అకస్మాత్తుగా ఆ ఇంటి పెద్ద దూరమైతే కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి. మహిళలు పనులకు వెళ్తూనే కుటుంబ భారాన్ని మోయాల్సి వస్తున్నది. వారిపై ఆధారపడిన పిల్లలు చదువులు ఆపేసి, బాలకార్మికులుగా పనుల్లో చేరిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
ఏటా ఖర్చు: రూ.20 కోట్లకు పైగా
ఒక్కొక్కరికి చెల్లించిన ప్రీమియం: రూ.3,800 చొప్పున (ఏటా)
మొదటి ఏడాది లబ్ధిదారులు – 31.25 లక్షల మంది రైతులు
2023-24లో లబ్ధిదారులు 41.04 లక్షల మంది రైతులు
ఆరేండ్లలో ప్రభుత్వం చెల్లించిన మొత్తం ప్రీమియం: రూ.6,861 కోట్లు
ఇప్పటిదాకా బీమా సొమ్ము లబ్ధిదారులు: 1.08 లక్షల కుటుంబాలు
అందిన మొత్తం : రూ.5,402 కోట్లు (రూ.5 లక్షల చొప్పున)
ఒక్కొక్కరికి చెల్లించిన ప్రీమియం: రూ.5,426
లబ్ధిదారులు : 36 వేల మంది
బీమా సొమ్ము అందింది: 50 కుటుంబాలకు (రూ.5 లక్షల చొప్పున)
లబ్ధిదారులు: 3.73 లక్షల మంది
చెల్లించిన ప్రీమియం: రూ.1.50 కోట్లు (ఈ ఏడాది)
ప్రస్తుతం రైతు, చేనేత, మత్స్యకారుల బీమాలకు ప్రభుత్వం చేస్తున్న ఖర్చు: రూ.1,500 కోట్లు (ఏటా)
కోటి కుటుంబాలకు బీమా చెల్లించాలంటే అయ్యే ఖర్చు: రూ. 4-5 వేల కోట్లు (అంచనా-ఏటా)
ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీని కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్‌కు అమ్మేసి నిర్వీర్యం చేయాలని కంకణం కట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంత వాటాను అమ్మేసింది. బంగారు గుడ్లు పెట్టే ఎల్ఐసీని ప్రైవేట్ పరం చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సంస్థను కాపాడాలని ప్రయత్నిస్తున్నది. ఒక్క రైతుబీమా ద్వారానే ఆరేండ్లలో రూ.6,861 కోట్ల ప్రీమియంను సంస్థకు చెల్లించింది.
నా భర్త బ్రెయిన్ డెడ్‌తో చనిపోయాడు. వైద్య ఖర్చులకు రూ.3 లక్షలు అప్పు చేసిన. ఆయన చనిపోయిన 15 రోజుల్లోనే రైతుబీమా కింద రూ.5 లక్షలు అందినయ్. సీఎం కేసీఆర్ సాయం జన్మలో మర్చిపోం. ఆ పైసలే రాకపోతే దినాలకు, వైద్యం కోసం చేసిన ఖర్చుకు మా భూమంతా అమ్మేవాళ్లం. ఇప్పుడు పొలం నిలబడ్డది, వ్యవసాయం చేసుకుంటున్నం. ఇప్పుడు పేద కుటుంబాలన్నింటికీ కేసీఆర్ బీమా ఇస్తాననడం చాలా సంతోషం.
-పడిగల రాజ్యం, యం.వెంకటాయపాలెం (ఖమ్మం)
రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి బీమా సౌకర్యం కల్పిస్తానని ప్రకటించి సీఎం కేసీఆర్ భరోసానిచ్చారు. నిరుపేద ప్రజలకు ఈ ప్రకటన ఎంతో నచ్చింది. సాధారణంగా పేద ప్రజలు బీమా చేసుకునే పరిస్థితి ఉండదు. ఏ రోజుకు ఆ రోజు పూట వెళ్లదీసుకోవడమే కష్టమంటే ఇక బీమా ఎక్కడ? ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేలా మ్యానిఫెస్టోలో వరాలు ప్రకటించడం కేసీఆర్‌కే చెల్లింది.
– జగిడి రాము, రైతు, లక్ష్మీనగరం, దుమ్ముగూడెం మండలం, భద్రాద్రి జిల్లా
నా భర్త పదేండ్ల కిందటే చనిపోయిండు. అప్పుడు మాలాంటి పేదోళ్ల గురించి ఆలోచించే కేసీఆర్ సర్కార్ లేకుండే. ఎవ్వలు కూడా మా కుటుంబాన్ని ఆదుకోలే. నా ఇద్దరి బిడ్డలను నేనే కష్టపడి పెంచి పెద్ద చేసిన. ఉన్న ఎకరం పొలం సాగు చేసుకుంటూ, కూలీ పనులకు వెళ్తూ కుటుంబాన్ని సాకుతున్నా. గప్పుడే కేసీఆర్ సర్కార్ ఉంటే నా భర్త పేరు మీద రైతు బీమా వచ్చేది. నాకు నా బిడ్డలకు ఆసరా అయ్యేది. కేసీఆర్ సీఎం అయినంక పేదల తలరాతలు మారిపోయినయి. కేసీఆర్ బీమా పథకాన్ని తీసుకొస్తామని కేసీఆర్ ఇచ్చిన హామీ ఎన్నో పేద కుటుంబాలకు ఆసరా అయితది. రూ.5 లక్షల బీమా అంటే మామూలు విషయం కాదు. కొండంత ధైర్యం. నిరుపేదల బాగు కోసం పాటుపడుతున్న కేసీఆర్ సర్కార్ మూడోసారి వస్తది.
– చీర్ల సుగుణ, షట్పల్లి, కోటపల్లి మండలం, మంచిర్యాల జిల్లా
పేదోడికి ఆర్థిక ధీమానిచ్చేలా కేసీఆర్ బీమా పథకం మారనున్నది. ఇన్సూరెన్స్ రంగంలో సుదీర్ఘ అనుభవం, స్వీయానుభవంతో చెప్తున్న విషయమేమింటే ప్రతి కుటుంబానికి తప్పనిసరిగా బీమా ఉండాలి. ఎలాంటి బీమా పథకం లేక కరోనా సమయంలో ఇంటి పెద్ద దిక్కును కోల్పోయినవాళ్లు డబ్బుల్లేక ఇబ్బందులు పడ్డారు. అలా ఆర్థికంగా చితికిపోయిన ఎన్నో కుటుంబాలను కండ్లారా చూశాను. ఇందులో చాలా మంది ఇన్సూరెన్స్ కొనుగోలు చేయలేని నిరుపేదలే. కేసీఆర్ బీమా సామాజిక భద్రతను పెంచటంలో విప్లవాత్మక మార్పుకు నాంది కానున్నది. దేశంలో బీమాపై ఇప్పటికీ కనీస అవగాహన లేని ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఈ పథకం పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తుంది. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేయడం హర్షనీయం. ప్రభుత్వం ఇచ్చేది రూ. 5లక్షలే అయినా, ఆ కుటుంబంలో చిన్నారుల పిల్లల చదువులు, పెంపకానికి ఇబ్బందులు ఉండవు.
– అన్నపూర్ణ, టీమ్ లీడర్, టాటా ఏఐఏ ఇన్సూరెన్స్, హైదరాబాద్
కామధేనువు లాంటి ఎల్ఐసీ సం స్థను కేంద్రం ప్రైవేట్‌పరం చేస్తుంటే తె లంగాణ ప్రభుత్వం దాన్ని బతికించి పునర్వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నది. ప్రభుత్వమే చొరవ తీసుకొని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వాళ్లకు బీమా కల్పించి ధీమాగా బతికేలా చేయనుండటం సంతోషకరం. ఈ పథకం రెక్కాడితే డొక్కాడని కూలీల జీవితాల్లో వెలుగులు నింపనున్నది. ఆరోగ్య బీమా అయినా, ప్రమాద బీమా అయినా ఇన్సూరెన్స్ అంటే ఏమిటో తెలియని అట్టడుగు వర్గాలకు బీమాతో కేసీఆర్ ధీమాగా నిలుస్తున్నారు. రాష్ట్ర ప్రజలంతా స్వాగతించాల్సిన అంశం.
– డాక్టర్ బ్రిజేశ్, తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ