వ్యక్తిత్వాలు.. రెండు భిన్న ధ్రువాలు.. ఒకరు ప్రజలను తన వెంట నడిపించి గమ్యాన్ని ముద్దాడినవాడు. మరొకరు ప్రజలను కష్టాలపాలు చేసి ఊరేగుతున్నవాడు. ఒకరు దండుగన్న సాగును పండుగగా మార్చి రైతును రాజును చేసి సమున్నతంగా నిలిపిన వాడు. మరొకరు సేద్యాన్ని కష్టసాధ్యంగా మార్చి రైతులను అరిగోస పెడుతున్నాడు. ఒకరు ప్రాజెక్టులు కట్టి తెలంగాణ నీటిగోస తీర్చిన జలదాత. మరొకరు తాను ప్రాజెక్టులు కట్టకపోయినా, పగబట్టి ప్రాజెక్టులను పడావుపెట్టిన జలవిరోధి. ఒకరిది సంపద పెంచి నలుగురికీ పంచాలనే తపన. మరొకరిది చేతగాని, చేవలేని ఉచ్చిలి హుంకారం. అవును ఇప్పుడు తెలంగాణను నమ్ముకున్న కేసీఆర్ పాలనలో నుంచి తెలంగాణను తెగనమ్ముకునే పాలకుల బారిన పడింది. తెలంగాణను ప్లాట్లుగా వేసి అమ్ముకోవాలని ఉరుకులాడే రియల్టర్ చేతిలోకి చిక్కుకుపోయింది.

‘గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి.. నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు’
కేసీఆర్ అంటే జీవన గంగాసరితను భూమికి దింపిన భాగీరథుడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన చాతుర్య మూర్తి. కేసీఆర్ అంటే అజేయ స్ఫూర్తి. అమేయ కీర్తి. ఆ స్ఫూర్తి చెరగనిది. ఆ కీర్తి తరగనిది. అతడు తెలంగాణ అస్తిత్వ ప్రతీక. స్వాభిమాన పతాక. గాంధేయమనే గాండీవాన్ని చేబూని గమ్యం చేర్చిన విజయ ప్రదాత. దశాబ్దకాలంలోనే దీక్షాదక్షతలతో అద్భుతాలు సాధించి బంగారు తెలంగాణను ఆవిష్కరించిన దార్శనిక నేత. చేతగాని పదవిని చేపట్టి తంటాలు పడుతున్న రాజకీయ మరుగుజ్జులు ఏం పేలితేనేం? అనునిత్యం వైరభక్తితో మాటలు తూలితేనేం? జనం ఇవాళ జోతలు పడుతున్నరు కేసీఆర్ పరిపాలనా ప్రతిభకు.
రైతుబిడ్డే పాలకుడైతే భూమాత పులకరిస్తది. చెరువులు మత్తళ్లు దుంకుతయ్. కట్టపొంటి చెట్టు ఎదుగుతుంది. చెట్టు కొమ్మన పిట్ట వాలుతుంది. పిట్ట వాలిందంటే ఆ చెరువులో నీళ్లున్నట్టు గుర్తు. నీళ్లున్న చెరువులో చేపలుంటయ్. కొంగలుంటయ్. వల విసిరే బెస్తలుంటరు. మురిసిపోయే ముదిరాజులుంటరు. కట్ట కింది తూము పారి నీళ్లింకే నాగేటి సాల్లుంటాయ్. కట్టమైసమ్మ కడుపారా నవ్వితే.. పంట రాశులకు హామీ దొరికినట్టే. రైతు కండ్లల్లో ఆనందం ఉంటుంది. ఊరి మోతుబరి మూతిమీసం మిడిసిపడతది. గౌండ్లోళ్లు కాటమయ్య పండుగజేస్తరు. బైండ్లోళ్లకథలుంటయ్. చిందోళ్ల పాటలుంటయ్. పీర్లు దూలా ఆడుతయ్. సబ్బండవర్ణాలు సంబురంతో దుంకులాడుతయ్. ఊరుమ్మడి ఉత్సవాలు సాగుతయ్.
అని మహాభారతంలో రాజధర్మం గురించి చక్కగా చెప్పారు. ప్రజల సుఖమే పాలకుడి సుఖం. ప్రజాహితమే పాలకుడి హితం. అలాంటి, భూమిపుత్రుడే అధికారం చేపడితే.. ప్రభుత్వాన్ని పల్లె వాకిట నిలుపుతడు. నేలకు విలువను పెంచుతడు. అన్నదాతకు ఆదరువు అవుతడు. పంటనీరిచ్చి కంటనీరు తుడిస్తే.. పుడమి పునాసలా నవ్వుతుంది. కష్టం తెలిసినోడు భరోసా ఇస్తే.. కర్షకుడు హర్షధ్వానం చేస్తడు. రాష్ర్టాన్ని కొట్లాడి తెచ్చిన రైతే రాజ్యాధికారం చేపట్టినప్పుడు పదేండ్లపాటు తెలంగాణ పల్లె ముఖచిత్రం అట్లనే ఉన్నది.
తెలంగాణ సాధించానన్న కీర్తే నాకు వెయ్యి జన్మల పుణ్యఫలం. సాధించుకున్న తెలంగాణను చక్కదిద్దుకునే అవకాశం కలుగడమే నా భాగ్యం. తెలంగాణ అభివృద్ధి తప్ప మరో ఆలోచన లేదు. కావలసింది నీళ్ల సమస్యకు పరిషారం. ఎవరెన్ని ఆటంకాలు కల్పించినా.. కోటి ఎకరాలకు నీరందించి తీరుతం. బడుగు, బలహీన రైతు, కూలీల ముఖాలు వెలిగినప్పుడే, వాళ్ల కండ్లల్లో ఆనందం వెల్ల్లివిరిసినప్పుడే ఈ రాష్ట్రం ఏర్పడినందుకు సార్థకత ఉంటుంది. ఆ దిశగా మా ప్రస్థానం కొనసాగుతుంది. ఆపాలని అనుకుంటే అది వాళ్ల భ్రమ.
– కేసీఆర్
‘లోభః పాపస్య కారణం’ అని పురాణాల్లో అన్నట్టు డబ్బు ఆశతో పేట్రేగే
రియల్టరే పాలకుడైతే భూమి మారుబేరం అవుతుంది. మట్టి మనిషికి, జీవరాశికి స్థానం లేని ఫక్తు వ్యాపారమవుతుంది. ప్రతి ఆలోచనా గజాల చుట్టూ, ఎస్ఎఫ్టీల చుట్టూ గిరికీలు కొడుతుంది. ‘ఎంతకు అమ్ముకోవచ్చు?’ అనే వాణిజ్య విలువచుట్టే తిరుగుతుంది. సంక్షేమాన్ని పక్కకు తోసి.. ప్రతి లెక్క లాభాన్ని బేరీజు వేస్తుంది. ప్రతి అడుగులో కరెన్సీ కట్టలు వెతుక్కొనే మెదళ్లలో రక్తమాంసాల స్పర్శకు, మట్టి వాసనకు, మానవీయ ఉద్వేగాలకు చోటుండదు. పాలకుడి పాపాలన్నీ పాలసీలుగా రూపాంతరం చెంది.. రియల్ ఎస్టేట్ చుట్టూ పరిభ్రమిస్తుంటయ్. హైడ్రా నుంచి హిల్ట్ వరకు ప్రతీది భూమిని ఎట్లా గుంజుకుని, ఎట్లా బేరం పెడుదామనే ఆలోచనకు రూపమే.
లగచర్ల నుంచి సున్నంచెరువు దాకా, మూసీ నుంచి హెచ్‌సీయూ దాకా.. కాళ్ల కింది నేలను లాగేసుకుని కాసులుగా మార్చుకునే దందా సర్కారు విధానమవుతుంది. నిజమైన రైతు, అసలైన జనం ఆఖరి వరుసలోకి వెళ్లిపోతరు. ఊరూరూ యూరియా గోసతో బావురుమంటుంది. పొలమారిన పొలం గుక్కెడు నీటికీ నోచుకోక ట్యాంకర్‌ను కొనితెచ్చుకుంటుంది. చేనుపక్క చెట్టుకు ఉరితాడు వేలాడుతుంది. రియల్టీ బేహారి పాలకుడైతే.. కలలకు కూడా వెలకట్టి ఎట్లా అమ్ముకుంటరో రెండేండ్లుగా తెలంగాణ చూస్తూనే ఉన్నది.
రేవంత్‌రెడ్డి అనంగనే గుర్తుకు వచ్చేది రియల్ ఎస్టేట్. ఆ రియల్ ఎస్టేట్ ఫ్యామిలీ నుంచి వచ్చినోడిని నేను. ఔటర్ రింగ్ రోడ్డు వేయకముందే.. కోకాపేటలో గేటెడ్ కమ్యూనిటీ కట్టినోడిని నేను. రియల్ ఎస్టేట్‌ను ఏవిధంగా డెవలప్ చేయాలనే నాకున్న యూఎస్పీ వల్లనే రాజకీయాలల్ల నేను అంతోఇంతో మనుగడ సాధిస్తున్న. రియల్ ఎస్టేట్ అనేది ఒక సెంటిమెంట్. ఆ సెంటిమెంట్‌ను మీరు ఎంత పాజిటివ్‌గా ముందుకు తీసుకుపోతే.. అంత ప్రయోజనం ఉంటది. తెలంగాణ అంటేనే బిజినెస్. ఎవ్వరైనా రావొచ్చు, పెట్టుబడులు పెట్టొచ్చు. పెట్టుబడులకు అనుమతులతోపాటు లాభాలు ఇప్పించే బాధ్యత నాది రేవంత్‌రెడ్డి.
కేసీఆర్‌ది నమ్మకం! రేవంత్‌ది అమ్మకం!
ఒకరిది మట్టిబంధం.. మరొకరిది వట్టి బేరం
కేసీఆర్.. ఇరిగేషన్ ప్రాజెక్టు!
రేవంత్.. రియల్ఎస్టేట్ వెంచర్!
శ్రవణకుమారుడి కావడి ఒకరు!
మారుబేరగాడి తక్కెడ మరొకరు!
ఇప్పుడు ఆ కల చెదిరింది. మోసకారి మాటలతో ఓటు చేజారింది. మాయదారి పాలనలో తెలంగాణ కథ మారింది. ఇంతలో ఎంత మార్పు?
పదేండ్ల కేసీఆర్ పాలన, రెండేండ్ల రేవంత్ ఏలుబడి చూసినవారికి తెలంగాణ ఎటునుంచి ఎటు పోతున్నదో, ఎట్లా పడిపోతున్నదో స్పష్టంగా అర్థమవుతున్నది. రైతు సంక్షేమమే కేంద్రంగా నడిచిన ప్రభుత్వ పాలసీలు.. ఇప్పుడెట్లా భూముల అమ్మకం ప్రధానంగా సాగుతున్నవో అవగతమవుతున్నది. ‘నేల’ విడిచిన పాలన ఎంత ప్రమాదకరమో తెలియజెప్తున్నది. భారత్ వ్యవసాయిక దేశం. ఇప్పటికీ సగటు భారతీయుడికి ప్రతీక అంటే రైతే! ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్లుగా చెప్పబడే పదీ పన్నెండు మెట్రో నగరాలను వదిలేస్తే మిగిలిన దేశమంతా గ్రామాల్లోనే ఉన్నది. ఆ గ్రామాల జీవిక వ్యవసాయం చుట్టూ పరిభ్రమిస్తున్నది. ఆ వ్యవసాయానికి రైతే ఇరుసు.
భూమి అంటే ఆస్తి మాత్రమే కాదు. అది వారసత్వం. భావోద్వేగం. ఆత్మాభిమానం. ప్రాణ సమానం! ఆ జీవనాడి తెలిసిన పాలకుడు, స్వతహాగా కర్షకుడు కేసీఆర్. అందుకే అయన మాటల్లో మట్టివాసన ఉట్టిపడుతుంది. ప్రతి పల్లెగుండెనూ తట్టిలేపుతుంది. ఈ సమస్త జీవరాశికి భూదేవే తల్లి అని కేసీఆర్ నమ్మారు. ఈ జగత్తంతా భూమిమీదే ఆధారపడి మనుగడ సాగిస్తున్నదని విశ్వసించారు. అందుకే, ముఖ్యమంత్రిగా ఆయన పథకాలలో నదులు దిశను మార్చుకొని బీడు భూముల మీదికి మళ్లినయ్. పసిడిరాశులు పండించినయ్. భూమిపుత్రుడు కాబట్టే మట్టిని బంగారం చేసేందుకు ఏమేం కావాల్నో అవన్నీ ఒకటి తర్వాత ఒకటి చేశారు. ఒక్కొక్క వ్యవస్థను ప్రక్షాళన చేసుకుంటూ పోయారు.
త్వమ్ మాతా పృథివీ దేవి, త్వయి సర్వమ్ ప్రతిష్ఠితమ్! (ఓ పృథ్వీ దేవి! నీవే సమస్త జీవులకు తల్లి.. ఈ జగత్తంతా నీ మీదే ఆధారపడి ఉన్నది)- వరాహపురాణంలో భూదేవి స్తుతి.. ఉమ్మడి రాష్ట్రంలో ధ్వంసమైన వ్యవసాయానికి కేసీఆర్ జవసత్వాలను అందించారు. తాంబాలంలా మారిన చెరువులను పునర్నిర్మించి మత్తడి దుంకేలా చేశారు. నీళ్లు, కరెంటు, పెట్టుబడి, విత్తనం, భద్రత, గిట్టుబాటు ధరలు.. ఇలా పరిపాలన మొత్తం రైతు చు ట్టూ, భూమి చుట్టూ, పల్లె చుట్టూ తిప్పారు. చినుకు పడగానే చేతికందే రైతుబంధు ఎరువులు, విత్తనాల కొరత తీరిస్తే.. రైతుబీమా కర్షక కుటుంబాల్లో భద్రతను ప్రోది చేసింది.
నీటికోసం ఆకాశాన్ని అర్థించే తెలంగాణ రైతుకు ‘మిషన్ కాకతీయ’ ముక్కారు పంటకు భరోసా ఇచ్చింది. కరెంటు గోస తీర్చడమే కాదు.. పండిన ప్రతి గింజనూ సర్కారే కొనుగోలు చేసింది. అందుకే సాగు సంబురమైంది. స్వల్పకాలంలోనే తెలంగాణ అన్నపూర్ణగా మారింది. దేశానికి రోల్‌మాడల్‌గా నిలిచింది. మార్కెట్ శక్తుల గుప్పిట్లోకి ప్రపంచం వెళ్లిపోయిన ఈ దశలోనూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లాంటి ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన ఈ కాలంలోనూ పల్లెగురించి, నేల గురించి ఆలోచించే కేసీఆర్ లాంటి నేత సమకాలీన రాజకీయాల్లో మరొకరు కనపడరు. కరోనా కష్టకాలంలో ప్రపంచం అంతా పస్తు లు పడుకుంటే.. తెలంగాణ పల్లెతల్లి తన బిడ్డలను పిలుచుకొని పైలంగా సాకుకున్నది. అలాంటి పల్లెతల్లికి కేసీఆర్ ఎల్లప్పుడూ ప్రణమిల్లుతూనే ఉన్నారు.
నమస్తే సర్వభూతానామ్ ధాత్ర్యై ధారిణి భూమయే! (సమస్త భూతాలకు ఆధారమై వాటిని రక్షించే భూమికి నమస్కారం)- వరాహపురాణం భూదేవి స్తుతి
మైనర్ ఇరిగేషనే మేజర్ ఇరిగేషన్ అని గట్టిగ నమ్మిన నేత కేసీఆర్. చెరువుల పునరుద్ధరణకే తొలిప్రాధాన్యమిచ్చిండు. మిషన్ కాకతీయ అని పేరు పెట్టిండు. రాష్ట్రంలో మొత్తం 46,531 చెరువులున్నట్టు గుర్తించారు. వాటిలో 12,000 గొలుసుకట్టు చెరువులు, 38,411 సాధారణ చెరువులు, మిగతావి చిన్న కుంటలని, వాటికింద 24.5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నదని నిర్ధారించారు. నాలుగుదశల్లో రూ.9,155 కోట్లతో 27,627 చెరువులను పునరుద్ధరించారు. వీటికి కాళేశ్వరం, ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, నిజాంసాగర్ , సింగూరు, ఎగువ మానేరు, దిగువ మానేరు, కడెం, వరదకాలువ ప్రాజెక్టులను అనుసంధానం చేస్తే.. ఊరూరూ మురిసిపోయింది. ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు, భక్తరామదాసు ఎత్తిపోతల, మహబూబ్‌నగర్ జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా, ఎలిమినేటి మాధవరెడ్డి పెండింగ్ ప్రాజెక్టుల కాలువలను వాటి పరిధిలోని చెరువులకు కలిపితే.. ప్రతి పల్లె జలసవ్వడులతో తుళ్లిపడింది.
జలం ఇచ్చిన బలంతో 15.05 లక్షల ఎకరాల్లో పచ్చదనం విచ్చుకున్నది. తెలంగాణ పుడమి హరితశోభను సంతరించుకున్నది. చెరువులు, చేపలు, చెట్లు, పక్షులు, చేను, చెలక, చెలిమె అన్నీ పల్లె జీవనానికి కొత్త శోభను తెచ్చిపెట్టినయ్. మరుగునపడిన మహాసంస్కృతి ఏదో మళ్లీ వేళ్లూనుకున్నట్టు సరికొత్త జీవావరణం రూపుదిద్దుకున్నది. ఒకనాడు నెర్రెలిచ్చిన నేల మీదే.. కరువును తరిమిన ఎకోసిస్టమ్ పురుడుపోసుకుంది. ఆ పునఃసృష్టి వెనుక ఉన్న ఏకైక వ్యక్తి కేసీఆర్. తెలంగాణలో సాగువిప్లవ సృష్టికర్త కేసీఆర్. తమను కంటికి రెప్పలా కాపాడిన ఆ భూమిపుత్రున్ని తెలంగాణ తల్లే కాదు.. తెలంగాణ బిడ్డలూ ఇంకా మరిచిపోలేదు. అందుకే, కేసీఆరే రావాలంటూ ఇప్పుడు నినదిస్తున్నారు. కేసీఆర్ లాంటి వీరులను ఆ భూమాత సర్వదా ఆశీర్వదిస్తూనే ఉంటుంది.
భూః దేవిః స్థిరా మహతీ వీరముఖా! (భూదేవి స్థిరమైనది, మహత్తరమైనది, వీరులను ఆ మాత కాపాడుతుంది) అథర్వవేదం 12.1.1
ఫాంహౌస్ పాలన అని కేసీఆర్ మీద కాంగ్రెస్ నేతలు రాళ్లు వేశారు. రైతు పొదరిల్లును, రాచరికపు ఫాంహౌస్‌ను ఒకేగాటన కట్టి కేసీఆర్ మీద నిందలు మోపారు. వ్యవసాయక్షేత్రం అంటే పాడిపంటకు, చేనూ చెలకకు కాపుదల కవచం. అందులో కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం ప్రత్యేకం. ఆరు దశాబ్దాలుగా ఎవుసం గోసపడిన తెలంగాణలో సాంప్రదాయిక సాగుకు పాతరేసి, సరికొత్త వ్యవసాయిక విప్లవం తీసుకొచ్చిన పరిశోధనాలయం. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత వరిపంట మీద ఎవరికైనా సోయి ఉండెనా? ఆంధ్రావాళ్ల కోసం రూపొందించిన వంగడాలను బలవంతంగా మన రైతుకు అంటగట్టారు. కేసీఆర్ ఆలోచన చేసేంతవరకు మన గాలికి, తేమకు తగినట్టు ఒక విత్తనమైనా ఉండెనా? చెరువుల పునరుద్ధరణ జరిగి తెలంగాణ జరంత నిమ్మలపడ్డ తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ మన గాలికి తగ్గట్టుగా వరి వంగడాల సృష్టిపై దృష్టి పెట్టిండు.
ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలను పురమాయిస్తే బతుకమ్మ విత్తనాలు మొలకెత్తి, భూమికి బరువయ్యేంత ధాన్యం పండింది. తెలంగాణ సోనా (ఆర్ ఎన్ ఆర్ -15048) బీజాలు జీవం పోసుకొని దేశ ధాన్యం మారెట్నే కుదిపేశాయి. క్వింటాలు ధర రూ.3,545 పలికింది. అటు జలవిప్లవం, ఇటు హరిత విప్లవంతో తెలంగాణ సాగు ముఖచిత్రమే మారిపోయింది. కరువులు, చెడగొట్టు వానల తెలంగాణ వ్యవసాయం.. మొదటిసారిగా నాలుగు డబ్బులు కండ్లచూసింది. రైతన్నలు సావుముఖం నుంచి బయటపడి సాగు దిక్కు చూసిండ్రు. పుట్లకొద్దీ పంటతో భూమి బంగారమైంది. నేల విలువ పెరిగింది. మారుమూల పల్లెల్లోనూ ఎకరం లక్షలు పలికింది.
రోడ్లు వేసి, నాలుగు మాస్టర్ ప్లాన్లు గీసి, ప్రభుత్వ సంస్థలను అడ్డుపెట్టి, పారిశ్రామిక కంపెనీలను ఆశపెట్టి భూముల విలువలు పెంచడం వేరు. పంటలు పండే భూమికి దిగుబడినిచ్చే సౌకర్యాలు జతచేసి విలువను పెంచడం వేరు. కేసీఆర్ మనుసులో భూమి అంటే ఎకరాలు, గజాల లెక్కలు కాదు. భూమి అంటే భూమాత. అన్నంపెట్టే అన్నపూర్ణ. ధాన్యపు రాసులందించే మహాలక్ష్మి, రైతు కుటుంబాలకు జీవనాధారం. రాష్ట్ర ప్రగతిని మార్చగలిగే అద్భుతమైన ఆర్థిక వనరు. వ్యవసాయ ఉత్పాదకతలో ఎకడో అట్టడుగున ఉండే తెలంగాణ అతి స్వల్పకాలంలో దేశంలోనే అగ్రభాగానికి చేరిందంటే.. కేసీఆర్‌కు తెలంగాణ భూమి మీదున్న నమ్మకమే కారణం. ఆయన భూమాత పుత్రుడు.
మాతా భూమిః పుత్రోయహం పృథివ్యాః! (భూమాత నా తల్లి.. నేను ఆమె పుత్రుడిని) అథర్వవేదం 12.1.12-భూ సూక్తం (ప్రసిద్ధ భూమాత స్తుతి)
పంటకాలనీల వంటి ఆయన ఆశయం అమలు జరిగిననాడు తెలంగాణలో భూమి బంగారం విలువతో పోటీ పడుతుంది. పల్లె భూముల విషయం ఇలాఉంటే పట్టణాల భూములకు కేసీఆర్ అద్దిన సొబగులు మరో అద్భుతం. పాలనా వికేంద్రీకరణ కింద నూతన జిల్లాల సృష్టి తెలంగాణ పురోభివృద్ధిలో ఒక కొత్త మలుపు. కొత్త కలెక్టరేట్లు, కమిషనరేట్లు, మెడికల్ కళాశాలలు, గురుకులాలు.. ఇలా అనేక నిర్మాణాలు పట్టణాల్లో భూముల విలువలను ఆకాశానికి తీసుకువెళ్లాయి. ఫలితంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ టార్గెట్‌వైపు రాకెట్లా దూసుకువెళ్లింది. భూమికి విలువ జోడింపులో ఎకడా మాయల్లేవు. మర్మాల్లేవు. తప్పుడు మార్గాలు లేవు. అంతా సహజసిద్ధమైన వృద్ధి. ఆర్గానిక్ పెరుగుదల.

ప్రభుత్వం మారింది. పరిస్థితి తారుమారైంది. ఈసారి అధికారంలోకి వచ్చింది ఫక్తు రియల్ఎస్టేట్ వ్యాపారి. ఉద్యమంతో ఏ బంధ మూ లేనివాడు. ఉద్యమకారులపై తుపాకీ గురిపెట్టినవాడు. ‘జై తెలంగాణ’ అనడానికే నోరు తిరగని వ్యక్తి.. తెలంగాణ పీఠమెక్కి కూర్చున్నడు. కంటికి కనిపించిన భూములన్నీ హిరణ్యాక్షుడిలా చాపచుట్టి సొమ్ము చేసుకునే పాలకుడి రాకతో ప్రభుత్వ విధానాలే మారిపోయాయి. కోట్లు పలికే భూములను ఆక్రమించి కరెన్సీ పిండుకోవాలని ఆశించే బ్రోకర్ల పాలన వచ్చింది. అధికారులు, గూండాలు, పోలీసులు, జేసీబీలను ప్రయోగించి.. నోరులేని బడుగుజీవుల భూములు బలవంతంగా లాకునే గూండాల గుంపు పాలన మొదలైంది.
రెండేండ్లుగా రాష్ట్రంలో ఎకడా ఏ భూమికీ రక్షణ లేదు. ఈ పాలకులకు భూమి అంటే తల్లి కాదు. కండ్ల ముందు ఊరించే కరెన్సీ కట్ట. అందుకే ఎకడ ఏ భూమి కనిపించినా.. వాలిపోయి గద్దల్లా తన్నుకుపోతున్నారు. లగచర్ల కావచ్చు. ఫ్యూచర్‌సిటీ కావ చ్చు. మూసీ సుందరీకరణ కావచ్చు. ఇవ్వాళ్టి హిల్ట్ పాలసీ కావచ్చు. అయితే ‘కొట్టేసేయ్! లేదా కమీషన్లకు అమ్మేయ్! రెండేండ్లుగా తెలంగాణలో ఇదే పాలసీ అమలవుతున్నది.
సున్నంచెరువులో పేద గుడిసెలపై విరుచుకుపడిన బుల్డోజర్.. పెద్దల సౌధాల వైపు ఎందుకు పోలేదు? హైడ్రా దుష్టశిక్షణ కోసమే పుట్టినట్టుగా, కూల్చివేతలు పరమ నిజాయితీ వ్యవహారం అన్నట్టుగా మాట్లాడిన ముఖ్యమంత్రి.. సొంత తమ్ముడి కొంప చెరువు శిఖంలో ఉంటే స్వచ్ఛందంగా కూల్చలేదెందుకు? తమ భూములు ఇవ్వమన్నందుకు లగచర్ల గిరిజన రైతుకుటుంబాల పట్ల కర్కశంగా వ్యవహరించిందీ ఏ ప్రజాప్రభుత్వం? మూసీ సుందరీకరణ ముసుగులో పేదల బస్తీలను వెళ్లగొట్టే పథక రచన చేసిందెవరు? ఫార్మాసిటీ కోసం భూములు తీసుకుని, ఫ్యూచర్ సిటీ ముసుగేసి, అటు న్యాయస్థానాన్ని, ఇటు రైతులను మోసం చేస్తున్నది ఎందుకు? ప్రభుత్వాధినేత ప్రజాపాలకుడిగా కన్నా, పచ్చి దళారీ మనస్తత్వంతో ఉంటే తప్ప అలా సాధ్యం కాదు.
రేవంత్‌రెడ్డి సర్కార్‌ది అచ్చంగా మారుబేరగాని విధానం. ఎకడ భూమి కనిపించినా దాన్ని ‘ఏదోరకంగా లాకోవాలి. అగ్గువసగ్గువకు తీసుకుని, అమ్ముకోవాలి.. ఇదే పాలసీ! ప్రజలకు మంచి చేయాలని కానీ, పదికాలాలపాటు వాళ్ల హృదయాల్లో నిలిచిపోవాలని కానీ ఇసుమంతైనా ఉన్నట్టు రేవంత్ చేపట్టిన కార్యక్రమాల్లో కనిపించడం లేదు. ఫార్మాసిటీ భూముల వ్యవహారం, గ్రీన్‌ఫీల్డ్ రోడ్ల ప్రాజెక్టు, ప్యూచర్‌సిటీ మాయాజాలం.. అన్నింటా కనిపిస్తున్నదిదే. పేదలే బాధితులు, రైతులే పీడితులు. వీటిలో ప్రభుత్వంలో ఉన్న నాలుగు పెద్దతలలు సంపద పోగేసుకోవడం తప్ప, ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు. అలాకూడా కాదు, సామాన్య జనాన్ని బాధితులుగా మార్చి రోడ్డున పడేసే వికృత మనస్తత్వానికి నిదర్శనం కాదా?
డబ్బులు పిండుకోవడమే పరమావధిగా ఉన్న ప్రభుత్వ పెద్దల తీరు ఆక్షేపణీయం. ధనార్జన మీది ఆశ పరాకాష్టకు చేరితే ఎలా ఉంటుందో రేవంత్ హిల్ట్ పాలసీతో బహిర్గతమైంది. 9,292 ఎకరాల్లో రూ 5 లక్షల కోట్ల అవినీతికి రూపం పోసిన పాలసీ అది. లోపాయికారీ ఒప్పందాలతో పారిశ్రామిక భూములకు అయినవారికి కట్టబెట్టే యోచన. భూములు ఇచ్చిన రైతుల త్యాగాలకు మసిపూసి మభ్యపెట్టే ఎత్తుగడ. నిబంధనలు ఉల్లంఘించిన పారిశ్రామికవేత్తలకు రియల్ ఎస్టేట్ చేసుకునే వెసులుబాటు ఇస్తూ, పాలసీ తీసుకు రావడమంటే పట్టపగలు ప్రజల కండ్లకు గంతలు కట్టి, రాష్ట్రం గొంతుకోయడం తప్ప మరొకటి కాదు. ఈ ఒక పాలసీ చాలు రేవం త్ వ్యాపార దృక్పథాన్ని అంచనా వేయడానికి!
కేసీఆర్ అడవి గిరిజనుల హక్కులను గుర్తించి 4.06 లక్షల ఎకరాలకు పోడు పట్టాలను పంపిణీ చేస్తే.. రేవంత్ మాత్రం ఓట్లేసి గెలిపించిన సొంత నియోజకవర్గం లగచర్ల గిరిజనుల భూముల మీద పడ్డడు. ముక్కారు పంటలు పండే ఆకుపచ్చని భూముల్లో పారిశ్రామిక విషబీజాలు వేస్తానంటూ తిరిగాడు. భూములు ఇవ్వబోమన్న లగచర్ల గిరిజన రైతులను పోలీసు లాఠీలతో కొట్టించి, జైళ్లోకి నెట్టాడు. గర్భిణిని, ముసలివాళ్లనూ వదల్లేదు. ఆ కిరాతకకాండ జాతీయస్థాయిలో విమర్శలపాలైంది. అంతటితో ఆగలేదు. ఇరవైండి గ్రామం కొసగుంపు (భద్రాచలం-కొత్తగూడెం జిల్లా) ఆదివాసీ పల్లె మీద బుల్డోజర్ పెట్టిండు. అధికారంలోకి వచ్చిన 20 నెలల కాలంలో 22 ఆదివాసీ గూడేల మీద దాడులు చేశారు. లగచర్ల గిరిజనుల మీద జరిగిన దాడే దుర్మార్గం అనుకుంటే, అంతకుమించి ఇరవైండి గ్రామ ఆదివాసీ మహిళల మీద అటవీ అధికారులు తెగబడటం.. చీరలు చింపి, నిర్దాక్షిణ్యంగా కొట్టడం.. ముమ్మాటికి రేవంత్ ప్రభుత్వ రాక్షసచర్యకు పరాకాష్ట. ఫ్యూచర్‌సిటీ భూముల మాయ ముసుగు తొడిగి రైతుల గొంతులను ఆ ముసుగు కిందనే నులిమేశారు. ఎకరం వంద కోట్లకు పైగా పలికే హైదరాబాద్ చుట్టూ భూములన్నీ చవగ్గా కొట్టేసే ఎత్తుగడల్లోంచే హైడ్రాలు, సుందరీకరణలు, భూసేకరణలు, హిల్ట్ పథకాలు పుట్టుకొచ్చాయనేది సుస్పష్టం.
ఇకడ కేసీఆర్, రేవంత్ వ్యక్తిత్వాలు రెండు భిన్న ధ్రువాలుగా మనకు కనిపిస్తాయి. ఒకరిది దూరదృష్టి. మరొకరిది హ్రస్వదృష్టి. ఒకరు ప్రజలను తన వెంట నడిపించి గమ్యాన్ని ముద్దాడినవారు. మరొకరు స్వప్రయోజనాల కోసం ప్రజలను కష్టాలపాల్జేయడానికీ వెనుకాడనివారు. ఒకరు భూమిని నమ్ముకుని విలువ పెంచినవారు. మరొకరు నేల విలువను దిగజార్చి అమ్ముకుని సొమ్ముచేసుకోవాలని ఆత్రుతపడుతున్నవారు. దండుగన్న సాగును పండుగగా మా ర్చి రైతును రాజును చేసి సమున్నతంగా నిలిపిండు కేసీఆర్. సేద్యాన్ని కష్టసాధ్యంగా మార్చి అన్నదాతను అరిగోస పెడుతున్నడు రేవంత్. ఒకరు ప్రాజెక్టులు కట్టి తెలంగాణ నీటిగోస తీర్చిన అపర భగీరథుడు. మరొకరు తానేమీ కట్టకపోయినా, పగబట్టి ప్రాజెక్టులను పడావు పెట్టిన జలవిరోధి.
ఒకరు మాట్లాడితే తెలంగాణ చెవియొగ్గి వింటుంది. తీయనైన తెలంగాణ నుడికారం, ఈ గడ్డమీద మమకారం దట్టించిన భాషతో, జాతీయాలు, సామెతలతో అలరారే ఆయన ప్రసంగం ప్రశంసలు పొందింది. మరొకరు మాట్లాడితే బూతు మాటలు, నెత్తు టి కూతలు శరపరంపరగా దొర్లుతాయి. శుషవాగాడంబరం. ఒకరిది ప్రజోపకారం. మరొకరిది ప్రతీకారేచ్ఛతో కూడిన అహంకారం. ఒకరు తెలంగాణ తల్లికి కిరీటం పెట్టి మురిసిపోతే.. మరొకరు ఆ కిరీటాన్ని పడగొట్టి సంబురపడ్డరు. ఒకరు హిస్టరీ మేకర్. మరొకరు రాజకీయ బ్రోకర్.
నిజమే రియల్ ఎస్టేట్ దళారీకి పరిపాలనా పగ్గాలు చేతికిస్తే ఏం చేస్తడు? రియల్ ఎస్టేట్ వ్యాపారమే చేస్తడు! అదే రైతు నాయకుడి చేతికిస్తే రైతు రాజ్యమే తెస్తడు. మట్టికి ముడుపుగట్టి, సాగునీళ్లు సాకబోసి, పంటగా మూటగట్టి భావితరాల జీవరాశికి భరోసా ఇస్తడు. పదేండ్లు కేసీఆర్ ఆదే చేసిండు.
కానీ జనం రత్నాన్ని వదిలేసి.. రాయిని పట్టుకున్నరు. పంట పండించే ట్రాక్టరు వదిలేసి బుల్డోజర్ను నెత్తిన పెట్టుకున్నరు.
