హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయ సీజన్ వచ్చిందంటే చాలు ఉమ్మడి రాష్ట్రంలో ఎరువుల కోసం రైతుల గోస వర్ణనాతీతం. లాఠీదెబ్బలు తింటే తప్ప యూరియా బస్తా దొరికేది కాదు. షాపుల ముందు చెప్పుల క్యూలైన్లు, పోలీస్స్టేషన్లలో ఎరువుల అమ్మకాలు… ఇలా నాటి గోసను ఎంత చెప్పినా తక్కువే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ దుస్థితికి చరమగీతం పాడారు. సాగు రెట్టింపైనా, ఎరువుల వినియోగం రెండింతలైనా ఎక్కడా కొరత అనే మాట రాకుండా రైతులకు ఎరువులు అందించారు. అయితే దీని వెనుక ఆయన చేసిన కృషి, మేథోమథనం అంతా ఇంతా కాదు. ఎరువుల కొరత ఎందుకు వస్తుంది? దీనికి పరిష్కారం ఏమిటి? ప్రభుత్వం నుంచి ఏంచేయాలి? లోపం ఎక్కడున్నది? వంటి అంశాలపై లోతైన పరిశీలన చేశారు. ఒక్కొక్క సమస్యను పరిష్కరిస్తూ… ఎరువుల కొరత లేకుండా చేశారు.
నాడు ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ రాష్ట్రంలో ఎరువుల సరఫరా, నిల్వలపై నిరంతరం పర్యవేక్షణ చేసేవారు. అవసరమైన నిల్వలో ఏమాత్రం తక్కువ అనిపించినా వెంటనే వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులను ఢిల్లీకి వెళ్లాలని ఆదేశించేశారు. దీంతోపాటు కేసీఆర్ సైతం కేంద్ర మంత్రులతో మంతనాలు జరిపేవారు. ‘మీకు రావాల్సిన కోటా మీకు ఇస్తాం’ అని కేంద్ర మంత్రులు, అధికారులు చెప్తే తప్ప రాష్ట్ర అధికారులు అక్కడినుంచి కదిలేవారు కాదు. కోటా విడుదల చేస్తూ కేంద్రం ఉత్తర్వులిచ్చిన తర్వాతే తిరుగు ప్రయాణమయ్యేవారు. ఒకవేళ అధికారులు వస్తామన్నా.. అందుకు సీఎం కేసీఆర్ ఒప్పుకొనే వారు కాదు. ‘రైతులకు అవసరమైన ఎరువులు తీసుకొనిరాకుండా మీరంతా ఇక్కడికి వచ్చి ఏం చేస్తరు? ఎన్ని రోజులైనా ఫర్వాలేదు.. ఎరువులు తీసుకొనే రండి’ అని సూచనలు ఇచ్చేవారు. ఇలా ఎరువుల కోసం ఉన్నతాధికారులు మూడు నాలుగు రోజులు ఢిల్లీలోనే మకాం వేసిన సందర్భాలున్నాయి. అదేవిధంగా సీజన్ మధ్యలో ఏమాత్రం కొరత ఏర్పడినా కేసీఆర్ ఆదేశాలతో అధికారులు మళ్లీ ఢిల్లీ వెళ్లేవారు. కిందిస్థాయి అధికారులు వెళ్తే కేంద్రంలో పట్టించుకోరనే ఉద్దేశంతో ఉన్నతాధికారులనే పంపించేవారు. దీనికితోడు కేసీఆర్ సైతం స్వయంగా ఫోన్ చేసి మాట్లాడటంతో కేంద్ర అధికారులు తెలంగాణకు అవసరమైన ఎరువులను కేటాయించేవారు.
ఎరువుల కొరత పరిష్కారం కోసం నాడు కేసీఆర్ తన చతురతను ప్రదర్శించారు. దేశంలో ఇతర రాష్ర్టాలకు ఎరువులు అవసరంలేని సమయంలో కేంద్రాన్ని, ఎరువుల కంపెనీలను ఒప్పించి రాష్ర్టానికి అవసరమైన ఎరువులను ముందుగానే కొనుగోలుచేసేవారు. ఏప్రిల్, మే నెలల్లో ఇతర రాష్ర్టాలు ఎక్కువగా ఎరువులను తీసుకోవు. ఇదే అదునుగా తెలంగాణ ప్రభుత్వం కంపెనీల నుంచి ఎరువులను కొనుగోలుచేసేది. ఇందుకోసం ప్రతి సీజన్లో సుమారు రూ.500 కోట్ల నుంచి రూ.700 కోట్ల వరకు ముందుగానే నిధులు విడుదల చేసి ఎరువులు కొనుగోలు చేసేది. దీంతో వానకాలం సీజన్‌కు అవసరమైన ఎరువులు రెండు నెలల ముందే రాష్ర్టానికి చేరేవి. వర్షాలు కురిసే సమయానికి రైతులకు అందుబాటులో ఉండేవి. 2014లో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాలు ఉండగా ప్రస్తుతం ఇది 2.2 కోట్ల ఎకరాలకు పెరిగింది. 2014లో మొత్తం ఎరువుల వినియోగం 25.14 లక్షల టన్నులు ఉండగా ప్రస్తుతం 40.43 లక్షల టన్నులకు పెరిగింది. అయిన్పటికీ, ఎరువుల కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
వానకాలం, యాసంగి సీజన్ ఏదైనా రెండు నెలల ముందునుంచే కేసీఆర్ ఎరువుల సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టేవారు. ఎంత ఎరువులు అవసరం? ఎంత స్టాక్ ఉన్నది? మిగిలిన స్టాక్ ఎప్పుడు వస్తుంది? ఏ జిల్లాలో పరిస్థితి ఎలా ఉన్నది? వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించేవారు. ప్రతిరోజూ ఎరువులకు సంబంధించిన రిపోర్టును అధికారుల నుంచి తెప్పించుకొనేవారు. ఇందులో ఏమాత్రం తేడాలు కనిపించినా వెంటనే అధికారులను అప్రమత్తం చేయడం, అవసరమైతే ఢిల్లీ వెళ్లాలని ఆదేశించేవారు.