దేశాభివృద్ధికి కొత్త ఎజెండా కావాలి
వివక్షాపూరిత పరిపాలన చేస్తున్న కేంద్రంలోని బీజేపీ సరారుపై ఉమ్మడిగా పోరాడుతాం. రాష్ట్రాల హక్కులను కాలరాసి పెత్తనం చేస్తున్న మోదీ ప్రభుత్వంపై భావసారూప్య పార్టీలన్నింటితో కలిసి గట్టిగా పోరాడాలని నిర్ణయించాం. దేశాభివృద్ధికి కొత్త ఎజెండా రూపొందించాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలుచేస్తున్నారు. దేశాభివృద్ధికి ఇప్పుడు కేసీఆర్ లాంటి నేతలు అవసరం.
-మీడియా సమావేశంలో శరద్‌పవార్
హైదరాబాద్, ఫిబ్రవరి 20 : బీజేపీ పాలనలో దేశం తిరోగమనంలో పయనిస్తున్నదని, ఈ పరిస్థితుల్లో దేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సేవలు అవసరమని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్‌పవార్ అన్నారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు. నిరుద్యోగం, ఇంధన, నిత్యావసర ధరల మంట.. ఇలా చెప్పుకొంటూపోతే అనేక సమస్యలు దేశాన్ని పట్టి పీడిస్తున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ముంబైలో శరద్‌పవార్‌తో సమావేశమయ్యారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అనంతరం శరద్‌పవార్ నివాసానికి వెళ్లిన కేసీఆర్‌కు, టీఆర్ఎస్ నేతలకు శరద్‌పవార్ కూతురు సుప్రియా సూలే ఘనస్వాగతం పలికారు. టీఆర్ఎస్ ప్రతినిధి బృందాన్ని శరద్ పవార్‌కు కేసీఆర్ పరిచయం చేశారు. అనంతరం దేశ రాజకీయాలపై సీఎం కేసీఆర్, శరద్ పవార్ దాదాపు గంటన్నరపాటు చర్చలు జరిపారు. చర్చల్లో ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ తదితరులు కూడా పాల్గొన్నారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఎన్సీపీ నేతలకు సీఎం కేసీఆర్ వివరించారు. 50 వేల కోట్లతో రైతుబంధు పథకాన్ని అమలుచేస్తున్నట్టు తెలిపారు. ఈ పథకం గురించి శరద్‌పవార్ ఆసక్తిగా అడిగి తెలుసుకొన్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తెలంగాణ సర్కారు మాత్రం రైతుల కోసం అద్భుత చర్యలు తీసుకొంటున్నదని అన్నారు.
కేంద్రంపై పోరాటమే..
వివక్షాపూరిత పరిపాలన చేస్తున్న కేంద్రంలోని బీజేపీ సరారుపై ఉమ్మడిగా పోరాడుతామని సీఎం కేసీఆర్, శరద్‌పవార్ ప్రకటించారు. చర్చల అనంతరం ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడారు. బీజేపీయేతర రాష్ర్టాలను అణచివేస్తూ, రాష్ట్రాల హక్కులను కాలరాసి పెత్తనం చేస్తున్న మోదీ ప్రభుత్వంపై కలిసివచ్చే పార్టీలన్నింటితో కలిసి గట్టిగా పోరాడాలని నిర్ణయించారు. దేశాభివృద్ధికి కొత్త ఎజెండా రూపొందించాల్సిన అవసరం ఉన్నదని ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలుచేస్తున్నారని, దేశాభివృద్ధికి ఇప్పు డు కేసీఆర్ లాంటి నేతలు అవసరమని శరద్‌పవార్ మీడియాతో అన్నారు. కేసీఆర్‌తో కలిసి పనిచేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శరద్ పవార్ ఇచ్చిన మద్దతు ఎప్పటికీ మరువలేమని సీఎం కేసీఆర్ అన్నారు. 1969 నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శరద్ పవార్ మద్దతుగా ఉన్నారని, రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు తెలిపిన ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. 75 ఏండ్ల స్వేచ్ఛా భారతంలో సమస్యలు అలాగే ఉన్నాయని, అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితుల్లో దేశాభివృద్ధికి కొత్త ఎజెండా రూపొందించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. దేశం సరైన రీతిలో ముందుకుపోవడం లేదని, దళిత వికాసం మూలన పడిందని తెలిపారు. త్వరలో భావసారుప్యంగల పార్టీలతో సమావేశం నిర్వహించి, అందరం కలిసి దేశాభివృద్ధికి చేపట్టాల్సిన ఎజెండాపై చర్చించి భవిష్యత్ కార్యాచరణను ప్రజల ముందు ఉంచుతామని ప్రకటించారు. దేశ రాజకీయాల్లో విశేష అనుభవం ఉన్న నేత శరద్ పవార్ చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయ్యారని ప్రశంసించారు. మోదీ సరారుపై చేపట్టిన తమ పోరాటానికి శరద్ పవార్ మద్దతుగా నిలిచి ఆశీర్వదించారని తెలిపారు.