Congress | హైదరాబాద్, ఫిబ్రవరి 7(నమస్తే తెలంగాణ): పార్టీ కోసం జెండామోసిన కార్యకర్తలను వదిలేసి, వ్యక్తి ప్రాధాన్యంగా విధేయత ప్రకటించిన వారికే పీసీసీలో పెద్దపీట వేసేందుకు రంగం సిద్ధమైంది. తమ అనుచరులు, భజనపరులను పీసీసీ కార్యవర్గంలో నింపడానికి రాష్ట్ర అగ్రనేతలు పోటీపడుతున్నారు. రాష్ట్రం నుంచి ఢిల్లీ వెళ్లిన నలుగురు కాంగ్రెస్ నేతలు ఎవరికి వారుగా తమ అనుచర వర్గం పేర్లతో పీసీసీ కార్యవర్గం లిస్టు తయారుచేసుకొని అధిష్ఠానానికి సమర్పించినట్టు తెలిసింది. పీసీసీ కార్యవర్గం కూర్పుపై తెలంగాణ అగ్రనేతలతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సుదీర్ఘ చర్చలు జరిపారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలతో విడివిడిగా సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో చర్చలు జరిపి, వారి అభిప్రాయాలను తీసుకున్నట్టు తెలిసింది.
పీసీసీలో అన్ని సామాజిక వర్గాల సమతుల్యత ఉండాలని, ప్రధానమైన సామాజికవర్గాల వారికి ‘లేదు అనకుండా’ ప్రాతినిథ్యం కల్పించాలని ఢిల్లీ అధిష్ఠానం దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. ప్రధానంగా, పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు, త్యాగాలు చేసిన నేతలను గుర్తించి వారికి మాత్రమే పీసీసీలో స్థానం కల్పించాలని, అగ్రనేతలంతా కూర్చొని అర్హులైన అభ్యర్థుల పేర్లతో లిస్టు తయారుచేసుకొని ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ అధిష్ఠానం సూచించినట్టు తెలిసింది.
అయితే, రాష్ట్ర పార్టీకి చెందిన అగ్రనేతలు మాత్రం ఎవరికి వారుగా తమ అనుచరుల లిస్టును తయారుచేసుకొని ఢిల్లీ వెళ్లినట్టు సమాచారం. జాబితా తయారీలో ఏ ఒక్కరూ కూడా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను పట్టించుకోలేదని తెలుస్తున్నది. ముఖ్య నేత, రాష్ట్ర పార్టీ పెద్ద నేత ఇద్దరూ కలిసి వలస నేతలతో లిస్టు తయారుచేసినట్టు, మరో ఇద్దరు సీనియర్ నాయకులు పూర్తిగా తమ అనుచర బలగాల పేర్లతోనే లిస్టు తయారుచేసుకొని ఇచ్చినట్టు తెలిసింది. ఆయా జాబితాలపై అధిష్ఠానం దూత అసంతృప్తి వ్యక్తంచేసినట్టు సమాచారం.
కాగా తమ వర్గం వారికి అవకాశం ఇవ్వాలని నలుగురు నేతలూ పట్టుబట్టినట్టు తెలుస్తున్నది. దీంతో మధ్యే మార్గంగా కమిటీలోకి నలుగురు కార్యనిర్వాహక అధ్యక్షులను తీసుకోవాలని, దళిత, ముస్లిం, గిరిజన, రెడ్డి సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరి చొప్పున అవకాశం కల్పించాలని ప్రాథమికంగా అనుకున్నట్టు తెలిసింది. పార్టీ ఉపాధ్యక్షులుగా మరింత ఎక్కువమందికి అవకాశం కల్పించాలని, పదవులు కోరుకునే వాళ్లందరికీ ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. డిమాండ్‌ను బట్టి 15 నుంచి 20 వరకు ఉపాధ్యక్షులను నియమించాలని నిర్ణయించినట్టు సమాచారం.
ఇందుకోసం అవసరమైతే జంబో కమిటీగా విస్తరించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించినట్టు తెలిసింది. అదేవిధంగా పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులను కూడా నియమించాలని నిర్ణయించినట్టు సమాచారం. అనుకున్నది అనుకున్నట్టుగా సాగితే ఒకటి లేదా రెండో రోజుల్లోనే పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించాలని నిర్ణయించినట్టు తెలిసింది.