Congress | హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): కట్టుకథలు చెప్పడంలో, ప్రజలను మభ్యపెట్టడంలో తాము సిద్ధహస్తులమని కర్ణాటక కాంగ్రెస్ నేతలు మరోసారి నిరూపించుకున్నారు. గురువారం హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించిన కర్ణాటక విద్యుత్తుశాఖ మంత్రి కేజే జార్జ్ నోటికొచ్చిన కట్టు కథలన్నీ చెప్పారు. తెలంగాణలో 24 గంటల కరెంటు గత కాంగ్రెస్ ప్రభుత్వమేనంటూ బడాయి మాటలు చెప్పుకొచ్చారు. జార్జ్ వ్యాఖ్యలపై తెలంగాణవాదులు, విద్యుత్తు రంగ నిపుణులు మండిపడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చివరి పదేండ్లు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే 24 గంటల కరెంటు సరఫరాకు కృషి చేసి ఉంటే.. కనీసం ఏడు గంటల కరెంటు కూడా ఎందుకు ఇవ్వలేకపోయారని, నిత్యం విద్యుత్తు కోతలు, కటిక చీకట్లు ఎందుకు ఉండేవని నిలదీస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి స్థాపిత విద్యుత్తు సామర్థ్యం 7,778 మెగావాట్లు ఉండేదని, అయినా గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ 5,661 మెగావాట్లకు మించి ఎందుకు సరఫరా చేయలేకపోయారని ప్రశ్నిస్తున్నారు. నాడు కనీసం 6 వేల మెగావాట్లు కూడా సరఫరా చేయలేని స్థితిలో విద్యుత్తు సరఫరా వ్యవస్థ ఎందుకు కొట్టుమిట్టాడిందని నిలదీస్తున్నారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును ఇవ్వాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వాలకు లేకపోవడమే ఇందుకు కారణమని చెప్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన బాధ్యతలు స్వీకరించిన వెంటనే విద్యుత్తురంగానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి, దానిని బలోపేతం చేయడానికి కృషి చేశారని విద్యుత్తురంగ నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాలకు 24 గంటల నిరంతరాయ విద్యుత్తును అందించడానికి కావాల్సిన వ్యవస్థలను బలోపేతం చేసేందుకు మౌలిక వసతులు కల్పించారని ఉదహరిస్తున్నారు.
విద్యుత్తురంగంలో మౌలిక వసతుల కల్పన, బలోపేతానికి సుమారు రూ.40 వేల కోట్లు ఖర్చు చేశారని వివరిస్తున్నారు. ఫలితంగా గరిష్ఠ డిమాండ్ దాదాపు మూడు రెట్లు పెరిగి, 15,497 మెగావాట్లకు చేరుకున్నదని చెప్తున్నారు. కాంగ్రెస్ కాలంలో దుస్థితిని.. ఇప్పుడున్న పరిస్థితిని లెక్కలతో సహా వివరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణలో 400 కేవీ సబ్స్టేషన్లు ఆరు మాత్రమే ఉండగా, సీఎం కేసీఆర్ పరిపాలనలో వాటి సంఖ్య 27కు పెరిగిందని గుర్తుచేస్తున్నారు. 220 కేవీ సబ్ స్టేషన్ల సంఖ్యను 51 నుంచి 103కు, 132 కేవీ సబ్స్టేషన్లను 176 నుంచి 252కు పెంచారని వివరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు విద్యుత్తు లైన్ల పొడవు 4.89 లక్షల కిలోమీటర్లు ఉండగా.. కేసీఆర్ పరిపాలనలో విద్యుత్తు లైన్ల పొడవు 6.78 లక్షల కిలోమీటర్లకు పెరిగింది.