Hyderabad | హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): పెట్టుబడులకు హైదరాబాద్ గమ్యస్థానమనే అంశం మరోసారి నిరూపితమైంది. అభివృద్ధిలో బెంగుళూరుసహా ఇతర నగరాలను హైదరాబాద్ ఎప్పుడో దాటేసిందని పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలు ఇప్పటికే స్పష్టంచేశారు. తాజాగా కేన్స్ టెక్నాలజీ పెట్టుబడి హైదరాబాద్‌కు తరలిరావడమే ఇందుకు నిదర్శనమని ఉదహరిస్తున్నారు. ఇప్పటికే అనేక అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తమ కార్యాలయాలకు హైదరాబాద్‌ను వేదికగా చేసుకోగా, తాజాగా సెమీ కండక్టర్ల రంగంలో కేన్స్ టెక్నాలజీ రూ.2,800 కోట్ల పెట్టుబడితో పరిశ్రమ స్థాపనకు ముందుకొచ్చింది. టెక్నాలజీ రంగంలో బెంగళూరుకు హైదరాబాదే పోటీ అనే వాదన గతంలో ఉండేది. కొన్నేళ్లుగా ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిశీల విధానాలు, మంత్రి కేటీఆర్ నిరంతర కృషితో ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఈవీ తదితర రంగాల్లో అనేక అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు హైదరాబాద్‌కు రావడంతో బెంగళూరును హైదరాబాద్ ఎప్పుడో వెనక్కి నెట్టింది. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్ శరవేగంగా పరిశ్రమను ఏర్పాటు చేస్తుండగా, అదే ప్రాంతంలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమ ఏర్పాటునకు కేన్స్ టెక్నాలజీ భారీ పెట్టుబడితో ముందుకొచ్చింది. ఫాక్స్‌కాన్ వచ్చినప్పుడే అనేక అనుబంధ సంస్థలు కూడా హైదరాబాద్‌కు క్యూ కడతాయని వాణిజ్యరంగ ప్రముఖులు పేర్కొన్నారు. ఆ వాద న కేన్స్ రాకతో నిజమయ్యింది. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ప్రాంతంలో ఫ్యాబ్‌సిటీ, ఎలక్ట్రానిక్స్ సిటీ ఏర్పాటు ద్వారా అనేక ఎలక్ట్రానిక్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. విమానయాన రంగ దిగ్గజం బోయింగ్‌తో కలిసి టాటా సంస్థ రంగారెడ్డి జిల్లాలో హెలికాప్టర్ల బాడీలను తయారు చేస్తున్నది. ప్రభుత్వ పాలసీలు, అత్యాధునిక మౌలిక సదుపాయాలతో కూడిన ఇండస్ట్రియల్ పార్క్‌లు, నిరంతర విద్యుత్తు, నీటి సరఫరా, అంతర్జాతీయ విమానాశ్రయం, లగ్జరీ హోటళ్లు దేశంలోని ఏ ప్రాంతానికైనా రెండు గంటల్లో చేరుకునే అవకాశం తదితర అంశాలు హైదరాబాద్‌ను పెట్టుబడుల గమ్యస్థానంగా అగ్రస్థానంలో నిలబెట్టాయి.
బెంగళూరుపై సడలుతున్న ఆశలు
కర్ణాటకలో ముఖ్యంగా బెంగళూరులో అదుపు తప్పిన ట్రాఫిక్ సమస్యకుతోడు నాసిరకం మౌలి క సదుపాయాల వల్ల కొత్తగా పెట్టుబడులు వస్తాయనుకోవడం మూర్ఖత్వమే అవుతుందని పలువురు పారిశ్రామికవేత్తలు అంటున్నారు. కేన్స్ టెక్నాలజీ హైదరాబాద్‌కు రావడంపట్ల కిరణ్ మజుందార్ షా, మోహన్‌దాస్ పై వంటి పారిశ్రామికవేత్తలు స్పందించారు. సిలికాన్ వ్యాలీగా చెప్పుకొనే బెంగళూరులో ట్రాఫిక్, మౌలిక సదుపాయాల సమస్యవల్ల కొత్త పెట్టుబడులు వచ్చే అవకాశం లేదని ఎక్స్‌లో ధ్వజమెత్తారు. బెంగళూరు పరిస్థితిపై సీఎం, మాజీ సీఎం, డిప్యూటీ సీఎంసహా అక్కడి ప్రముఖులను నిలదీశారు.
ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టిన తెలంగాణ
తెలంగాణ ఏర్పాటుకు పూర్వం హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య ఏ స్థాయిలో ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే రాష్ట్ర ఏర్పాటు తరువాత హైదరాబాద్‌కు చెందిన ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ నిర్వహించిన మొద టి సమావేశంలోనే ఈ అంశంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి ట్రాఫిక్ సమస్యను సమూలంగా పరిష్కరించాలని అధికారులకు స్పష్టంచేశారు. ఏకంగా రూ.25,000 కోట్లతో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంకు శ్రీకారం చుట్టారు. మొదటిదశలో 30 కిపైగా ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణాన్ని పూర్తిచేశారు. ప్రస్తుతం రెండో దశ పనులు కొనసాగుతున్నాయి.
బెంగళూరులో అదుపుతప్పిన ట్రాఫిక్
బెంగళూరులో ఇస్రో లేఔట్ ప్రాంతం నుంచి కోరమంగళ అనే ప్రాంతం మధ్య దూరం 12 కిలోమీటర్లు. ఈ ప్రయాణానికి కనీసం 3 గంటల స మయం పడుతున్నదంటే పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉన్నదో ఊహించుకోవచ్చు. నమయానికి గమ్యం చేరుకోలేక అనేకమంది తమ వ్యాపార అగ్రిమెంట్లు, ఉద్యోగాలు కోల్పోతున్నారు. పది కిలోమీటర్ల ప్రయాణానికి 150 నుంచి 200 నిముషాలు పడుతుండటంతో ర్యాపిడో, ఓలా వంటి క్యాబ్‌లకు రూ.వందల్లో వెయిటింగ్ చార్జీలు చెల్లించాల్సి వస్తున్నదని ప్రజలు వాపోతున్నారు.
కేన్స్ టెక్నాలజీ పెట్టుబడి హైదరాబాద్‌కు తరలివెళ్లడం కర్ణాటక వైఫల్యమే. ఇందుకు ట్రాఫిక్, మౌలిక సదుపాయాల సమస్యను నిందించక తప్పదు. పరిస్థితులు మెరుగుపడకపోతే కర్ణాటకకు పెట్టుబడులు వస్తాయని ఆశించకూడదు. మన మూర్ఖత్వానికి హైదరాబాద్ లాభపడుతున్నది.
– కిరణ్ మజుందార్ షా, బయోకాన్ వ్యవస్థాపకురాలు
హైదరాబాద్‌కు కేన్స్ పెట్టుబడి తరలివెళ్లడం నిజంగా షాకింగ్. ఈ పెట్టుబడిని కర్ణాటక ఎలా కోల్పోయింది?
– పద్మశ్రీ మోహన్‌దాస్, మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ చైర్మన్, ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో